మదురో, ఖమేనీ, రౌల్ క్యాస్ట్రో
ఫొటోలతో వైట్‌హౌస్ పోస్టర్
రౌల్ క్యాస్ట్రో ఫొటోపై
‘నేరారోపణల నమోదు’ స్టాంప్
దీనిపై వివరణ ఇచ్చేందుకు
వైట్ హౌస్ నిరాకరణ
వాషింగ్టన్ : ‘ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం’ అనే శీర్షికతో ఒక గ్రాఫిక్ పోస్టర్‌ను వైట్ హౌస్ విడుదల చేసింది. క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోపై అమెరికా న్యాయశాఖ నేరారోపణలను నమోదు చేసిన నేపథ్యంలో రిలీజ్ చేసిన ఈ పోస్టర్ ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై వెనిజులా మాజీ పాలకుడు నికోలస్ మదురో, ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ, ఐసిస్ ఉగ్రవాది అబూ బిలాల్ అల్ మీనూకి, క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో ఫొటోలు వరుసగా ఉన్నాయి. మదురో ఫొటోపై అరెస్టెడ్, ఖమేనీ ఫొటోపై కిల్డ్, అబూ బిలాల్ అల్ మీనూ – ఐసిస్ జెండాపై కిల్డ్, రౌల్ క్యాస్ట్రో ఫొటోపై నేరారోపణల నమోదు అని రాసి ఉన్నాయి. ఈ గ్రాఫిక్ పోస్టర్ ఎగువ భాగంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్ద ఫొటో ఉంది. దీని కింద పెద్దసైజు అక్షరాల్లో ‘ప్రెసిడెంట్ ట్రంప్ పాలనలో అమెరికా శత్రువులు నిర్వీర్యం’ అనే శీర్షికను పెట్టారు. ఈ గ్రాఫిక్ పోస్టర్‌ను ‘న్యాయం జరుగుతుంది’ అనే క్యాప్షన్‌తో వైట్ హౌస్ ట్వీట్ చేసింది.
గ్రాఫిక్ పోస్టర్‌పై వివరణకు వైట్ హౌస్ నో
ఈ గ్రాఫిక్ పోస్టర్ ట్రంప్ రెండో పాలనా కాలంలో అమెరికా విదేశాంగ విధానంలో, దూకుడులో వచ్చిన తీవ్రమైన మార్పును అద్దం పడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక కార్య కలాపాల్లో రాజీలేని విధంగా ముందుకు సాగడం, అమెరికా సరిహద్దు రక్షణపై ప్రధాన దృష్టితో కూడిన జాతీయవాద భద్రతా నమూనా వైపు ట్రంప్ సర్కారు బలంగా మొగ్గు చూపుతోంది. ఆ గ్రాఫిక్ పోస్టర్‌ను ట్వీట్ చేయడం వెనుకనున్న ఉద్దేశాలపై వివరణ ఇచ్చేందుకు, విస్తృతమైన ప్రకటన విడుదల చేసేందుకు వైట్ హౌస్ నిరాకరించింది.
1996లో పౌర విమానాలను కూల్చేసిన క్యూబా
అమెరికా న్యాయశాఖ 20 పేజీల అధికారిక చార్జ్‌షీట్‌ను రౌల్ కాస్ట్రోపై దాఖలు చేసింది. దీని ప్రకారం, 1996 ఫిబ్రవరి 24న రెండు పౌర విమానాలను క్యూబా కూల్చేసిన ఘటనలో రౌల్ కాస్ట్రోపై అమెరికా కోర్టులో నేరారోపణలను నమోదు చేశారు. అమెరికా కేంద్రంగా పనిచేసే బ్రదర్స్ టు ది రెస్క్యూ సంస్థకు చెందిన రెండు పౌర విమానాలు 1996 ఫిబ్రవరి 24న అంతర్జాతీయ జలాలపై ప్రయాణిస్తుండగా క్యూబా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం క్షిపణులతో గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆ విమానాల్లో ఉన్న నలుగురు పైలట్లు మరణించారు. వీరిలో ముగ్గురు అమెరికా పౌరులు ఉన్నారు. మూడు దశాబ్దాలనాటి కేసును తిరగదోడి ..యుద్ధానికి రెడీ అంటూ ట్రంప్ చేస్తున్న ప్రకటనలపై క్యూబా కూడా ధీటుగా సమాధానమివ్వటానికి సన్నద్ధమవుతోంది. ఆయుధాలు లేని రెండు పౌర విమానాలకు ముందస్తు హెచ్చరికలు చేయకుండానే దాడి చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను నాటి క్యూబా రక్షణ మంత్రిగా ఉన్న రౌల్ కాస్ట్రో ఉల్లంఘించారని అమెరికా న్యాయశాఖ ఆరోపించింది.
ఇరాన్‌పై మే 19న తాము చేయాల్సిన ముందస్తు సైనిక దాడులను గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు వాయిదా వేశామని మే 18న (సోమవారం) మధ్యాహ్నం ట్రూత్ సోషల్ వేదికగా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. గల్ఫ్ దేశాలు జోక్యం చేసుకోకపోయి ఉంటే, తాము మరో గంటకల్లా (మంగళవారం మధ్యాహ్నం) ఇరాన్‌పై దాడులను మొదలుపెట్టి ఉండేవాళ్లమని మే 19న వైట్ హౌస్ సౌత్ లాన్ వద్ద రిపోర్టర్లకు ట్రంప్ తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్‌జీసీ) ఘాటుగా స్పందించింది. అమెరికా, ఇజ్రాయిల్ దళాలు మళ్లీ దాడులు ప్రారంభిస్తే, ఈ సైనిక ఘర్షణను పశ్చిమాసియా ప్రాంతం ఆవలకు విస్తరించడానికీ తాము రెడీగానే ఉన్నామని హెచ్చరించింది.
ట్రంప్ వర్సెస్ ఇరాన్
వైట్ హౌస్ విడుదల చేసిన అయతోల్లా ఖమేనీని చంపేసామంటూ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇజ్రాయిల్, అమెరికా యుద్ధోన్మాదానికి ఖమేనీని హతమార్చారని విమర్శించింది. చర్చలు జరుగుతున్న దశలోనే ఖమేనీని హతమార్చి..అధికార పీఠాలను మార్చటానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయిన విషయం విదితమే. ఇప్పటికీ చావు తప్పి కన్నులోట్టపోయిన చందాన ట్రంప్ పరిస్ధితి మారిందని స్పష్టమైంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు వ్యవహారశైలి కూడా చర్చనీయాంశంగా మారింది.
సౌదీ, ఖతార్, యూఏఈ పాలకుల ఫోన్‌కాల్స్
సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వంటి గల్ఫ్ దేశాల అగ్రనేతలు ట్రంప్‌నకు ఫోన్ చేసి, ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నందున ముందస్తు సైనిక దాడులను ప్రస్తుతానికి వాయిదా వేయాలని కోరినట్టు సమాచారం. ఇరాన్ చర్చల ద్వారా ఒప్పందానికి రావడానికి సుముఖత వ్యక్తం చేయడంతో, ట్రంప్ వారికి కొంత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో శాంతిచర్చల మధ్యవర్తిత్వానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ గురువారం (మే 21న) టెహ్రాన్‌కు రానున్నారని ఓ ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ కథనాన్ని ప్రచురించింది.



