Friday, May 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంహార్ముజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్

హార్ముజ్‌పై పట్టు బిగిస్తున్న ఇరాన్

- Advertisement -

ఒప్పందాలు, తనిఖీలు, రుసుములతో జలసంధిని దాటుతున్న నౌకలు
టెహ్రాన్ :
మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలలో ఇంధన నిల్వలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలకు సరఫరాలు సజావుగా జరిగేందుకు వీలుగా ఇరాన్ బహుళ అంచెల వ్యవస్థను అమలు చేస్తోంది. చమురు నౌకల సిబ్బంది ఇరాన్ నిర్దేశించిన దారిలో చెక్‌పోస్టుల మీదుగా హార్ముజ్ జలసంధిలో తమ ప్రయాణాలను సాగిస్తున్నారు. ఇరాన్ నుంచి ముడి చమురును తీసుకొని వియత్నాం వెళుతున్న ఓ నౌక ఏప్రిల్ చివరి నుంచి దుబాయి తీరంలో నిలిచిపోయింది. అయితే ఇరాన్‌తో ఇరాక్ ప్రధాని ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆ నౌక ఈ నెల 10న జలసంధి వైపు బయలుదేరింది. హార్ముజ్ మీదుగా ప్రయాణించే నౌకలకు అనుమతి ఇచ్చేందుకు ఇరాన్ సంక్లిష్టమైన విధానాన్ని, బహుళ అంచెల వ్యవస్థను అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఇరాక్ నౌకకు అనుమతి లభించింది.

అమెరికా బెదిరింపులు
హార్ముజ్ మీదుగా ఇప్పటి వరకూ కేవలం కొన్ని నౌకలు మాత్రమే ప్రయాణించాయి. అమెరికా సంస్థ సిన్‌మాక్స్ ఇంటెలిజెన్స్ విశ్లేషణ ప్రకారం ఏప్రిల్ 18‘మే 6 తేదీల మధ్య కేవలం 60 కంటే తక్కువ నౌకలే హార్ముజ్‌ను దాటాయి. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు రోజుకు 120‘140 వాణిజ్య నౌకలు ఈ జలసంధి మీదుగా ప్రయాణించేవి. ఇరాన్‌పై అమెరికాతో పాటు అనేక పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా నౌకాయానానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. హార్ముజ్‌లో సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ ప్రభుత్వానికి రుసుములు చెల్లించినా లేదా హామీలు కోరినా ఆంక్షలు మరింత తీవ్రమవుతాయని అమెరికా ఆర్థిక శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ అక్రమ వాణిజ్యానికి మద్దతు ఇచ్చే ఏ విదేశీ కంపెనీ పైన అయినా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా ఇరాన్ అనుసరిస్తున్న విధా నం కారణంగా దాని మిత్ర దేశాలైన రష్యా, చైనా నౌకలకు ప్రాధాన్యత లభి స్తోంది. ఆ తర్వాత టెహ్రాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న భారత్, పాకిస్తాన్ వంటి దేశాల నౌకలు సురక్షితంగా హార్ముజ్‌ను దాటుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ నౌకలను మాత్రం ఇరాన్ అనుమతించడం లేదు.

ఒప్పందం లేకుంటే రుసుము కట్టాల్సిందే
ఒప్పందాలు చేసుకోని దేశాలకు చెందిన నౌకలు హార్ముజ్‌ను దాటేందుకు ఇరాన్ అధికారులకు లక్షన్నర డాలర్లకు పైగా చెల్లిస్తున్నాయని యూరోపియన్ షిప్పింగ్ వర్గాలు తెలిపాయి. నౌకలోని సరుకును బట్టి రుసుము మారుతుంటుంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో…ఇరాన్‌కు రుసుము చెల్లించిన నౌకల యజమానుల పేర్లు, ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఇరాన్‌తో నేరుగా ఒప్పందాలు చేసుకునేందుకు నౌకల యజమానులు సుముఖత చూపుతున్నారు. ఇరాన్ ప్రభుత్వ అభీష్టం మేరకే హార్ముజ్‌ను మూసివేయడం, తెరవడం జరుగుతుందని నిపుణులు తేల్చి చెప్పారుమూ రాజకీయ పొత్తుల కారణంగా కొన్ని నౌకలు హార్ముజ్ లోపలికి వస్తాయి. మరికొన్ని రుసుము చెల్లిస్తాయి. కొన్నింటిని వెనక్కి పంపుతారు. ఇదంతా ఇరాన్ పర్యవేక్షణలోనే జరుగుతుంది’ అని వారు తెలిపారు. హార్ముజ్‌ను దాటే నౌకలకు అమెరికాతో ఏమైనా సంబంధం ఉన్నదా అనే విషయాన్ని ఐఆర్‌జీసీ సిబ్బంది పరిశీలిస్తారు.

కీలక పాత్ర పోషిస్తున్న ఐఆర్‌జీసీ
హార్ముజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్ అధీనంలోనే ఉంది. చమురు ట్యాంకర్ల రవాణాకు వీలుగా వివిధ దేశాలతో ఇరాన్ ఒప్పందాలు చేసుకుంటుంది. చమురు నౌకలను తనిఖీ చేస్తుంది. కొన్ని సందర్భాలలో రుసుము కూడా వసూలు చేస్తుంది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) అధికారులు హార్ముజ్‌లో గస్తీ నిర్వహిస్తూ అనుమానం వచ్చిన నౌకలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. హార్ముజ్‌లో శక్తివంతమైన ఐఆర్‌జీసీ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా సైన్యం చెబుతున్న దాని ప్రకారం ఈ నెల ప్రారంభం నాటికి గల్ఫ్‌లో 1,500 నౌకలు చిక్కుకుపోయాయి. వీటిలో సుమారు 22,500 మంది సిబ్బంది ఉన్నారు. తీరం వెంబడి జలసంధిలో ప్రయాణించే నౌకలపై దాడి చేయగల సామర్ధ్యం ఇరాన్‌కు ఉండడమే ఈ సముద్ర ప్రతిష్టంభనకు కారణం. దీనికి ప్రతిగా అమెరికా సేనలు జలసంధి వెలుపల ఓ దిగ్బంధనాన్ని ఏర్పాటు చేసి ఇరాన్ నౌకలు, సరుకులను అడ్డుకుంటున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -