భూముల ధర పెంపునకు కసరత్తు..!

Efforts to increase the price of land..!– నేటి నుంచి కార్యాచరణ ప్రారంభం
– క్షేత్రస్థాయిలో ధర ఆధారంగా లెక్కింపు
– ఆగస్టు 1 నుంచి అమలయ్యేలా నిర్ణయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
వ్యవసాయ, వ్యవసాయేతర ధరలను పెంచేందుకు సర్కార్‌ సిద్ధమైంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెరగనున్నాయి.. ఇప్పటికే భూముల మార్కెట్‌ విలువను పెంచే కసరత్తు ప్రారంభమైంది. ఆదాయం పెంచుకోవడానికి గల మార్గాలపై ప్రభుత్వం ఇటీవల సమీక్షించింది. వివిధ ప్రాంతాల్లో భూముల ధరలను ఎంత మేర పెంచాలో సూచించాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వ ధర.. ప్రయివేటు విలువల ఆధారంగా కొత్త మార్కెట్‌ విలువను నిర్ణయించనున్నారు. ఈ పెరిగిన ధరలతో కలిపి ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త మార్కెట్‌ ధరలు అమలు చేసేందుకు కసరత్తు సాగుతోంది.
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో నేషనల్‌ హైవేలు, స్టేట్‌ రోడ్డులు, పారిశ్రామిక వాడలు, కమర్షియల్‌ జోన్లు, గ్రామీణ ప్రాంతాలను ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలు, ఖాళీ స్థలాలకు ప్రాంతాల వారీగా మార్కెట్‌ విలువను నిర్ణయించనున్నారు. జోనల్‌ డెవలప్‌మెంటల్‌, అర్బన్‌ డెవలప్‌మెంటల్‌ అథారిటీల ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి ప్రస్తుతం ఏ మేరకు ఆదాయం సమకూరుతుంది..? భూముల విలువలు ఏ మేరకు పెంచే అవకాశం ఉందనే వివరాలు సేకరిస్తోంది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖదే పైచేయి
ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చడంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ముందు వరుసలో నిలుస్తోంది. అయితే, వ్యవసాయ భూములు, ప్లాట్లు, స్థలాల మార్కెట్‌ ధరకు.. రిజిస్ట్రేషన్‌ విలువకు పొంతన లేదని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ధరలను సవరించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు, అడిషనల్‌ కలెక్టర్‌, ఆర్డీఓ, పంచాయతీ, సర్వే, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన కార్యాచరణ మొదలవుతుంది. జిల్లా రిజిస్ట్రార్‌, మార్కెట్‌ వ్యాల్యూ రిజిస్ట్రార్‌, సబ్‌ రిజిస్ట్రార్లు ఈ కమిటీని సమన్వయం చేస్తారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రస్తుతం ఉన్న ధరలను పరిశీలించి పెంచాల్సిన ధరలను నివేదిస్తారు.
ప్రాంతాల ఆధారంగా నిర్ణయం
ప్రాంతాల ఆధారంగా ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులు వెళ్లే ప్రాంతాలు, వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ధరలు ఎక్కువగా పెరగనున్నట్టు తెలుస్తోంది. కాగా, మరోసారి 20 నుంచి 50 శాతం వరకు భూముల ధరలు పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తుండగా అదేస్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం కూడా లభించనుంది.
ఇదీ షెడ్యూల్‌..
ఈ నెల 18వ తేదీన కమిటీ తొలి సమావేశం జరుగుతుంది. 23వ తేదీ నాటికి మార్కెట్‌ విలువ సవరణ ప్రక్రియ పూర్తి చేసి, 25న కొత్త ధరల ప్రతిపాదనలతో భేటీ అవుతారు. 29న ధరల సవరణకు కమిటీ ఆమోదం తెలిపాక జూలై 1వ తేదీన అభ్యంతరాల స్వీకరణకు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. జూలై 15వ తేదీ నాటికి వచ్చే అభ్యంతరాలను 20వ తేదీ వరకు పరిష్కరించి 24న తుది ఆమోదం కోసం కమిటీకి సమర్పిస్తారు. ఆపై 31వ తేదీన ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆగస్టు 1 నుంచి సవరించిన భూముల మార్కెట్‌ విలువలను అమలు చేయనున్నారు.
2021-2022లో పెంపు
2021-2022లో అప్పటి ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్‌ విలువను ఎంత పెంచింది..? ప్రభుత్వానికి ఎంత రాబడి వచ్చింది..? అనే అంశాలను కూడా పరిశీలిస్తుంది. ప్రాంతాన్ని బట్టి భూముల రేట్లు 40 నుంచి 50శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అలాగే ప్రస్తుతం వసూలు చేస్తున్న 7.5శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజును కూడా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Spread the love