ప్రభాకర్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి

An exgratia of Rs.25 lakh should be announced to Prabhakar's family– రైతు కుటుంబానికి అండగా ఉంటాం
– రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్‌ఎస్‌ రాష్ట్ర బృందం
– రైతు ఆత్మహత్యకు కారకులైన ఎస్సై, తహశీల్దార్‌లను సస్పెండ్‌ చేయాలి
– నిందితులను కారులో ఎక్కించుకొని తిరుగుతున్న డిప్యూటీ సీఎం
– జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ముగ్గురు మంత్రులకు కనిపించడం లేదా?
– జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి
నవతెలంగాణ- బోనకల్‌ (చింతకాని)
ఆత్మహత్యకు పాల్పడిన రైతు బోజడ్ల ప్రభాకర్‌ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి కుటుంబాన్ని ఆదుకోవాలని, ప్రభాకర్‌ పిల్లలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. చింతకాని మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు బోజడ్ల ప్రభాకర్‌ తన భూమిని ఆక్రమించుకున్నారని మనస్థాపనతో ఈ నెల 1వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రభాకర్‌ కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌ రాజు, బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆదివారం పొద్దుటూరులో ప్రభాకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆక్రమణకు గురైన ప్రభాకర్‌ భూమిని తొలుత వారు పరిశీలించారు. అనంతరం ప్రభాకర్‌ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌ కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల రూపాయల నగదును అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభాకర్‌ చట్టబద్ధంగా తనకు 7.10 ఎకరాలకు పట్టా ఉందని, అయినా కొంతమంది ఆక్రమించు కున్నారని ఎస్సై, తాసిల్దారులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లిన ఫిర్యాదులు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. 40 ఏళ్లుగా ఆ భూమిని ప్రభాకర్‌ సాగు చేసుకుంటు న్నారన్నారు. ఆ పొలానికి రైతుబంధు కూడా వస్తుందన్నారు. ఎస్సై, తహసిల్దార్‌ భూ ఆక్రమణదారులకు మద్దతుగా నిలిచి వారి నుంచి లంచాలు తీసుకొని ప్రభాకర్‌కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. ప్రభాకర్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తాము పూర్తి మద్దతుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఒకటవ తేదీన ప్రభాకర్‌ ఆత్మహత్య చేసుకుంటే మధిర ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తాము వస్తున్నామని తెలిసి హడావుడిగా వచ్చి ప్రభాకర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ వెంటనే ప్రభాకర్‌ ఆత్మహత్య కేసులో నిందితుడైన కూరపాటి కిషోర్‌ ఇంటికి వెళ్ళటంలో ఆంతర్యం ఏమిటో భట్టి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. లంచాలకు మరిగిన మంత్రులు ప్రజలకు న్యాయం చేయటం లేదని విమర్శించారు. అసలైన నిందితుల పేర్లు చెప్పవద్దని ప్రభాకర్‌ కుటుంబంపై కొంతమంది ఒత్తిడి తీసుకువచ్చారన్నారు. ఎ-3గా ఉండవలసిన కూరపాటి కిషోర్‌ ను తప్పించి బాధితునికి అండగా ఉన్న తమ పార్టీ నాయకుడు పెంట్యాల పుల్లయ్యను ఎ-3గా చేర్చడం దారుణం అన్నారు. పోలీస్‌ దుర్మార్గాలను నోట్‌ చేసుకుంటున్నామని, దుశ్చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తర్వాత తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు. కారేపల్లి, అశ్వరావుపేట మండలాల్లో రైతుల ఆత్మహత్యలకు పాల్పడుతుంటే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వీరికి తీరిక లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. రెవిన్యూ శాఖ మంత్రి బంధువు, అశ్వారావు పేట సీఐ వేధింపుల వల్లే దళిత ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి లుంగీ కట్టుకొని తమ వ్యవసాయక్షేత్రాల్లో సేద తీర్చుకుంటున్నాడని విమర్శిం చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా మంత్రులకు సిగ్గు, శరం ఉంటే నిజంగా ప్రజలకు సేవ చేయాలని హితవు పలికారు. బిఆర్‌ఎస్‌ నాయకుల, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే సహించేది లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం పెట్యాల పుల్లయ్య ఇంటికి వెళ్లారు. అక్కడ సమావేశం నిర్వహించారు.

Spread the love