– ఆయిల్‌పామ్ సాగు శాస్త్రీయ పద్ధతులపై అవగాహన
– హెడ్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ సూచనలు
నవతెలంగాణ – అశ్వారావుపేట : గుంటూరు జిల్లా మంగళగిరి, బాపట్ల జిల్లా కొల్లూరు ప్రాంతాలకు చెందిన 50 మంది రైతులు గురువారం అశ్వారావుపేటలోని ఉద్యాన పరిశోధనా స్థానాన్ని సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో రైతులు కొత్తగా ఆయిల్‌పామ్ సాగును ప్రారంభిస్తున్న నేపథ్యంలో, ఆయిల్‌పామ్ సాగు విధానాలు, సమగ్ర పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఈ క్షేత్ర సందర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యాన పరిశోధనా స్థానం హెడ్ అండ్ సైంటిస్ట్ డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆయిల్‌పామ్ తోటల ఏర్పాటు నుంచి దిగుబడి దశ వరకు పాటించాల్సిన శాస్త్రీయ సాగు విధానాలను రైతులకు వివరించారు. నాణ్యమైన మొక్కల ఎంపిక, సరైన దూరంలో నాటడం, నీటి నిర్వహణ, ఎరువుల యాజమాన్యం, తోటల పరిశుభ్రత, మొక్కల పెరుగుదలకు చేపట్టాల్సిన చర్యలపై సమగ్రంగా అవగాహన కల్పించారు.
ఆయిల్‌పామ్ పంటలో వచ్చే ప్రధాన చీడపీడల లక్షణాలు, వాటిని ప్రారంభ దశలో గుర్తించే విధానం, సమగ్ర నివారణ చర్యలు, పురుగుమందులను సురక్షితంగా వినియోగించే పద్ధతులను వివరించారు. అలాగే ఆయిల్‌పామ్ తోటల ప్రారంభ దశలో రైతులకు అదనపు ఆదాయం అందించే అంతర పంటల సాగుపై కూడా సూచనలు చేశారు. నేల స్వభావం, నీటి లభ్యత, మార్కెట్ అవకాశాలు, మొక్కల వయస్సును పరిగణనలోకి తీసుకుని తగిన అంతర పంటలను ఎంపిక చేసుకోవాలని, నీరు, పోషకాల కోసం అధిక పోటీ కలిగించే పంటలను సాగు చేయరాదని సూచించారు.
అనంతరం రైతులు ఉద్యాన పరిశోధనా స్థానంలోని ఆయిల్‌పామ్ తోటలు, వివిధ అంతర పంటల నమూనాలు, పరిశోధన మరియు ప్రదర్శనా క్షేత్రాలను సందర్శించారు. రైతులు అడిగిన సందేహాలకు డాక్టర్ మజ్జిగ శ్రీనివాస్ సమాధానాలు ఇచ్చారు. ఆయిల్‌పామ్ సాగును శాస్త్రీయ పద్ధతుల్లో చేపడితే స్థిరమైన దిగుబడులతో పాటు మెరుగైన ఆదాయం పొందవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి, కొల్లూరు ఉద్యాన శాఖ అధికారులు కె. దీపిక, కళ్యాణ్ చక్రవర్తి, ఉద్యాన శాఖ సిబ్బంది, ఉద్యాన పరిశోధనా స్థానం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.



