– 32 నెలల్లో అమరులైన 48 మంది జవాన్లు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారవర్గాలు తెలిపాయి. కాగా దోడా జిల్లాలో సోమవారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మేజర్ సహా నలుగురు సైనికులు వీరమరణం పొందారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందుకున్న రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు, రాష్ట్ర పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దోడా పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలోని దెసా అటవీ ప్రాంతంలో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఇరు పక్షాలు పరస్పరం తారసపడ్డాయి. ఈ సందర్భంగా 20 నిమిషాల పాటు భీకర పోరు సాగింది. కాల్పుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఆ తర్వాత ఉగ్రవాదులు పరారయ్యేందుకు ప్రయత్నించగా దళాలు వారిని వెంటాడాయి. ఈ క్రమంలో దట్టమైన అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడగా వారిలో నలుగురు చనిపోయారు. పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహమ్మద్‌కు షాడో గ్రూపుగా పనిచేస్తున్న కాశ్మీర్ టైగర్స్ ఈ దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. మృతుల్లో కెప్టెన్ బ్రిజేష్ థాపా, నాయక్ డి రాజేష్, సిపాయి బిజేంద్ర, సిపాయి అజరు నారూకా ఉన్నారని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా ఈ నెల 9న కథువాలో సైనిక కాన్వారుపై దాడి చేసింది కూడా కాశ్మీర్ టైగర్లే. సంఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరా తీశారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఆయనకు టెలిఫోన్‌లో పరిస్థితిని వివరించారు. తాజా ఘటనతో కలిపి జమ్మూ ప్రాంతంలో గత 32 నెలల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో మొత్తం 48 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 9న కథువా జిల్లాలో సైనిక కాన్వారుపై ఉగ్రవాదులు దాడి చేయగా ఐదుగురు సైనికులు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. గత నెల 11, 12 తేదీల్లో జరిగిన రెండు దాడుల్లో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. గత నెల 9న యాత్రికులతో వెళుతున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో బస్సు ఓ వాగులో పడి తొమ్మిది మంది చనిపోయారు. 33 మంది గాయపడ్డారు. మే 4న పూంఛ్ జిల్లాలో రెండు వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేయగా వైమానిక దళానికి చెందిన సైనికుడు చనిపోగా ఐదుగురు గాయపడ్డారు.