బిచ్కుందలో మరో జత జైన పాదాలు

Another pair of Jain feet in Bichkundaకామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం శివారులో భూమిలో పాతివున్న ఆరడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పైన రాతి పాదాలజతను చారిత్రక బదం పరిశోధకుడు బొగ్గుల శంకరరెడ్డి గుర్తించాడు. ఈ పాదాలు పాదాభరణాలతో అలంకరించబడి వున్నాయి. ఎవరో దేవత పాదాలని ప్రజలు పూజలు చేస్తున్నారు.
ఈ పాదాలను పోలిన పాదాలు మహబూబునగర్‌ జిల్లా గొల్లత్తగుడి వెనక పాదాలగడ్డలో, భైంసాలో, కొలనుపాక సోమేశ్వర దేవాలయ ప్రాంగణంలో, మహారాష్ట్రలోని కాంధార్‌లో ఉన్నాయి. అవన్నీ జైనధర్మక్షేత్రాలే. వాటిని జైన తీర్థంకరుల పాదాలుగానే చరిత్రకారులు గుర్తించారని కొత్త తెలంగాణ చరిత్రబృందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ వివరించాడు. బిచ్కుందలో అగుపించిన పాదాలు కూడా జైనధర్మశిల్ప సంబంధమైనవే. బిచ్కుందలో జైనమత చివరి తీర్థంకరుడు వర్ధమాన మహావీరుని విగ్రహానికి చెందిన అధిష్టాన పీఠం కూడా ఆ పరిసరాల్లోనే లభించింది.
ఇవి జైన తీర్థంకరుల భారీ విగ్రహాలకు చెందిన పాదాలై వుంటాయనిపిస్తుంది. కాంధార్‌ లో జైన తీర్థంకరుల పెద్ద శిల్పాల భాగాలు కూడా మ్యూజియం వద్ద కనిపిస్తాయి. అందువల్ల ఈ పాదాలు బాహుబలి విగ్రహంవంటి ఎత్తైన శిల్పాలవై వుండవచ్చుననిపిస్తున్నది.

క్షేత్ర పరిశీలకుడు: బొగ్గుల శంకర్‌ రెడ్డి, 9000679711,
చారిత్రక పరిశోధకుడు- కొత్త తెలంగాణ చరిత్ర బృందం
చారిత్రక వివరణ : శ్రీరామోజు హరగోపాల్‌, 9949498698,
కన్వీనర్‌, కొత్త తెలంగాణ చరిత్ర బృందం

Spread the love