బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌..!

– కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
లోక్‌సభ ఎన్నికల ముంగిట నిర్మల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి దీప్‌దాస్‌ మున్షీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో గులాబీ పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉన్న ఇంద్రకరణ్‌రెడ్డి కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. కానీ నిర్మల్‌ నియోజకవర్గానికి చెందిన కారగ్రెస్‌ నాయకులు ఆయన చేరికను వ్యతిరేకించారు. పార్టీలో చేర్చుకోవద్దని నిరసన తెలిపారు. దీంతో కొన్ని రోజుల పాటు ఆయన కాంగ్రెస్‌లో చేరిక వాయిదా పడింది. తాజాగా లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన హస్తం పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయనతో పాటు బోథ్‌ నియోజకవర్గంలో తొలుత కాంగ్రెస్‌లో కీలక నాయకుడిగా ఉన్న వన్నెల అశోక్‌ సైతం తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలుత బోథ్‌ టికెట్‌ అశోక్‌కే కేటాయించినప్పటికీ.. వివిధ సమీకరణాల దృష్ట్యా ఆయన టికెట్‌ను రద్దు చేసిన పార్టీ ఆడె గజేందర్‌కు కేటాయించింది. దీంతో అసంతృప్తికి గురైన అశోక్‌ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా దీప్‌దాస్‌ మున్షి ఆధ్వర్యంలో తిరిగి కాంగ్రెస్‌లో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Spread the love