– కాంట్రాక్టు కార్మికుల వివరాలు సేకరిస్తున్న అధికారులు
– సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఈఎస్‌ఐ బృందం
– సీఐటీయూ కృషితోనే అమలు : ఎస్‌సీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ వర్తింపజేసేందుకు ఆమోదముద్ర పడింది. దీని కోసం సింగరేణి యాజమాన్యం ప్రత్యేక అధికారిని కేటాయించింది. ఈఎస్‌ఐ బోర్డు కూడా అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీయూ అనుబంధం) అలుపెరుగని పోరాటం వల్లనే ఈ విజయం సాధించింది. ఈ పోరాట ఫలితం వల్ల రాష్ట్రంలోని 25 వేలకుపైగా ఉన్న సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ప్రయోజనం చేకూరనున్నది. సింగరేణి సంస్థలో కాంట్రాక్టు కార్మికులెంత మంది ఉన్నారు? అర్హులెవరు? అనే వివరాలను సింగరేణి ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. అందులో భాగంగానే గురువారం కొత్తగూడెంలో సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని ఈఎస్‌ఐ హైదరాబాద్ రీజినల్ డైరెక్టర్ కార్యాలయం అధికారి టి.ప్రశాంత్, వరంగల్ బ్రాంచి మేనేజర్ జి.సాయిలు సందర్శించారు. వివరాలు సేకరించారు. సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ పర్సనల్ డి. వరప్రసాద్, ఇతర పర్సనల్ అధికారులతో సుధీర్ఘంగా చర్చించారు.
2022 సెప్టెంబర్‌లో జరిగిన 18 రోజుల సమ్మె సందర్భంగా సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలతో చేసిన ఒప్పందంలో ఈఎస్‌ఐ సదుపాయాన్ని కల్పించేందుకు అంగీకరించింది. కానీ, ఆచరణలో రెండు నెలలు పాటు గడపదాటలేదు. దీనిపై సింగరేణి డైరెక్టర్(పా)పై సీఐటీయూ ఒత్తిడి చేసింది. దీంతో అనివార్యంగా నవంబర్ 2022లో ఈఎస్‌ఐ డైరెక్టర్‌కి సింగరేణి యాజమాన్యం లేఖ రాసింది. సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ అమలు అనుమతి కోరుతూ ఢిల్లీలోని ఈఎస్‌ఐ బోర్డు రీజినల్ అధికారులు లేఖ రాశారు. ఆ తర్వాత అధికారులు పెద్దగా పట్టించుకోలేదు.
సింగరేణి ఎన్నికల నిమిత్తం సెంట్రల్ లేబర్ అధికారులు 2023 జూన్ 13న నిర్వహించిన మీటింగ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేశారు. ఆ సందర్భంగా అప్పటి సింగరేణి డైరెక్టర్, నేటి సీఎండీ బలరాం నాయక్ జోక్యం చేసుకుని ఈఎస్‌ఐ రీజినల్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే సీఐటీయూ నాయకులు సింగరేణి అధికారులను, డైరెక్టర్‌ను కలుస్తూ వినపత్రాలు ఇస్తూనే, మరోపక్క ఈఎస్‌ఐ అధికారులను కలిసి ఒత్తిడి చేశారు. 2023 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల వ్యవధిలో నాలుగు సార్లు ఈఎస్‌ఐ అధికారులను కలిసి ఒత్తిడి చేశారు. ఢిల్లీలో ఫైల్ పెండింగ్‌లో ఉందని అధికారులు చేతులెత్తేశారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి, ఈఎస్‌ఐ బోర్డు మెంబర్ ప్రశాంత్ నంది చౌదరి రాష్ట్ర నాయకులు తీసుకెళ్లారు. అక్కడ ఆయన బోర్డుపై ఒత్తిడి చేసి అనుమతి ఇప్పించారు. అనుమతి వచ్చిన వెంటనే హైదరాబాదులోని రీజినల్ డైరెక్టర్ కార్యాలయం అధికారిని కేటాయించారు.
సీఐటీయూ కృషితోనే..అధికారులందరికీ ధన్యవాదాలు
తమ పోరాట ఫలితంగానే కాంట్రాక్టు కార్మికులకు ఈఎస్‌ఐ వర్తింపు జరిగిందనీ, ఈ విషయంలో సహకరించిన సింగరేణి, ఈఎస్‌ఐ అధికారులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు తెలిపారు. గురువారం కొత్తగూడెం పర్యటనకు వచ్చిన ఈఎస్‌ఐ బృందాన్ని సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం (సిఐటియు) ప్రతినిధి బృందం కలిసి ధన్యవాదాలు తెలిపింది. సాధ్యమైనంత తొందరగా కాంట్రాక్ట్ కార్మికులకు ఈఎస్‌ఐ మంజూరు చేసి ఈఎస్‌ఐ వైద్య సదుపాయాన్ని అందించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది. ఈ ప్రతినిధి బృందంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు, కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి డి. వీరన్న, బ్రాంచ్ అధ్యక్షులు జి. శ్యామ్‌కుమార్, తాజుద్దీన్, శ్రీను, పవన్ తదితరులు ఉన్నారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు ఈఎస్‌ఐ సదుపాయం కల్పించడానికి అంగీకరించి దాని అమలు కోసం వ్యక్తిగతంగా ప్రత్యేక శ్రద్ధను పెట్టి కషిచేసిన నాటి డైరెక్టర్ (పా) నేటి సీఎండీ ఎం.బలరాం నాయక్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈఎస్‌ఐ అమలు చేసేందుకు కృషి చేసిన ఈఎస్‌ఐ బోర్డు మెంబర్, సీఐటీయూ జాతీయ కార్యదర్శి ప్రశాంత్ నంది చౌదరికి ధన్యవాదాలు తెలిపారు.