– ప్రోటోకాల్ పాటించలేదని గ్రామసభను అడ్డుకున్న బీఆర్‌ఎస్ నాయకులు
– జతచేయాల్సిన పత్రాలపై అవగాహనలోపం
– సిబ్బంది కొరత
నవతెలంగాణ-విలేకరులు
రెండు రోజుల సెలవుల అనంతరం మంగళవారం ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు వెల్లువల వచ్చాయి. కానీ ఇప్పటికీ సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. దరఖాస్తులు సరిపడా లేకపోవడంతో జిరాక్స్ సెంటర్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ప్రోటోకాల్ పాటించలేదని బీఆర్‌ఎస్ నాయకులు గ్రామసభను అడ్డుకున్నారు. మాజీ మంత్రి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఫొటో లేకుండానే ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని అధికారులతో వాగ్వావాదానికి దిగారు. రెండు గంటల అనంతరం మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో గ్రామసభ పున: ప్రారంభించి దరఖాస్తులు స్వీకరించారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నాలుగోరోజు 89,058 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. నాలుగు రోజులకు గాను 2,85,891 దరఖాస్తులు వచ్చాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 47324 దరఖాస్తులు రాగా.. నాలుగు రోజులకు గాను 1,54,586 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో దరఖాస్తుదారులు ఫారానికి జత చేయాల్సిన డాక్యుమెంట్స్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అవగాహన కల్పించకపోవడంతో జిరాక్స్‌ల కోసం ప్రజలు ఆన్‌లైన్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. జిరాక్స్ సెంటర్ల నిర్వహకులు అదనంగా డబ్బులు తీసుకుంటున్నారు. సిరిసిల్ల జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు నింపడంపై అవగాహన లేక అపసోపాలుపడ్డారు. దరఖాస్తులు నింపేందుకు ఆశాలు, అంగన్వాడీలు సహాయంగా ఉంటారని అధికారులు పేర్కొన్నా.. అధికారుల స్థానంలో వారే ఉండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. భదాద్రి జిల్లా బూర్గంపాడులో 2000కు పైగా దరఖాస్తులు వచ్చాయి.