డిస్కంల్లో తాత్కాలిక డైరెక్టర్ల నియామకం

Temporary in disks Appointment of Directorsనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల్లో (డిస్కంలు) తాత్కాలిక డైరెక్టర్లను నియమిస్తూ సీఎమ్‌డీలు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విద్యుత్‌ సంస్థల్లో సుదీర్ఘకాలంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న డైరెక్టర్లను తొలగిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఆయా సంస్థల సీఎమ్‌డీలు డైరెక్టర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేసమయంలో కొత్త డైరెక్టర్ల నియామకాల కోసం నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. అయితే ఆ ప్రక్రియ పూర్తయ్యేదాకా పరిపాలన స్తంభించకుండా, సంస్థల్లో చీఫ్‌ జనరల్‌ మేనేజర్లుగా పనిచేస్తున్న వారినే తాత్కాలిక డైరెక్టర్లుగా బాధ్యతలు అప్పగిస్తూ, ఉత్తర్వులు ఇచ్చారు. దానిప్రకారం దక్షిణ డిస్కంలో డైరెక్టర్‌ (కమర్షియల్‌, ఐపీసీ అండ్‌ ఆర్‌ఏసీ)గా సీజీఎమ్‌గా పనిచేస్తున్న కే రాములును నియమించారు. మరో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌, ఐటీ, ఈఏ, డీపీఈ అండ్‌ అసెస్‌మెంట్స్‌)గా ప్రాజెక్ట్స్‌ విభాగం చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కే నందకుమార్‌ నియమితులయ్యారు. డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌, పీ అండ్‌ ఎమ్‌ఎమ్‌)గా ఓ అండ్‌ ఎమ్‌ సీజీఎమ్‌గా పనిచేస్తున్న ఎన్‌ నర్సింహులు, డైరెక్టర్‌ (ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌ఱ అండ్‌ ఐఆర్‌)గా రెవెన్యూ సీజీఎమ్‌గా పనిచేస్తున్న కే సుధామాధురికి బాధ్యతలు అప్పగించారు.
టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో…
ఉత్తర డిస్కం డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌)గా కమర్షియల్‌ విభాగం సీజీఎమ్‌గా పనిచేస్తున్న టీ సాదర్‌లాల్‌, డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌)గా ఓ అండ్‌ ఎమ్‌-1 సీజీఎమ్‌గా పనిచేస్తున్న వీ మోహన్‌రావు, డైరెక్టర్‌ (హెచ్‌ఆర్‌డీ అండ్‌ ఐఆర్‌)గా మార్కెటింగ్‌ సీజీఎమ్‌ బీ అశోక్‌కుమార్‌ తాత్కాలికంగా నియమితులయ్యారు.

Spread the love