Wednesday, June 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరాజకీయ సవాళ్లు తప్పవా?

రాజకీయ సవాళ్లు తప్పవా?

- Advertisement -

మధ్యంతర ఎన్నికల వేళ రిపబ్లికన్లలో ఆందోళన ఇంటా బయటా పెరుగుతున్న వ్యతిరేకత
రాజకీయ ప్రయోజనం
చేకూర్చని శాంతి ఒప్పందం
గందరగోళంలో ట్రంప్‌


వాషింగ్టన్‌ : అమెరికా, ఇరాన్‌ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ మార్కెట్లకు ఎంతో ఊరట ఇచ్చింది. ఇటీవలి కాలంలో కోల్పోతున్న ప్రజాదరణను తిరిగి కూడగట్టుకోవడానికి ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అవకాశం ఇస్తున్నప్పటికీ సొంత పార్టీ నుంచే వస్తున్న విమర్శలకు, మిత్ర దేశాల సందేహాలకు అది సమాధానం ఇస్తుందా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. రిపబ్లికన్‌ పార్టీలోని కొందరు సభ్యులు ఈ ఒప్పందాన్ని వ్యూహాత్మక విపత్తుగా అభివర్ణించారు. అసలు ఈ ఒప్పందంలో ఏముందో బయటపెట్టాలని మరి కొందరు డిమాండ్‌ చేశారు. ఇరాన్‌కు ట్రంప్‌ లంగిపోయారని కన్సర్టేవిట్‌ ఇన్‌ఫ్లుయన్సర్‌ ఎరిక్‌ ఎరిక్సన్‌ విమర్శలు కురిపించారు. యుద్ధానికి మద్దతు ఇచ్చిన ట్రంప్‌ మిత్రుడు, సెనెటర్‌ లిండ్సే కూడా ఒప్పందంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇరాన్‌, అధ్యక్షభవనం ఇచ్చిన వివరణలు పరస్పర భిన్నంగా ఉన్నాయని, ఇది కొంత ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు.

మధ్యంతర ఎన్నికలు ఆదుకుంటాయా?
తాము స్తంభింపజేసిన ఇరాన్‌ ఆస్తులలో కొన్నింటిని విడుదల చేసే అవకాశమే లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తేల్చి చెప్పారు. ఇరాన్‌ తన అణు కార్యక్రమానికి సంబంధించి నిర్దిష్ట ప్రమాణాలను పాటిస్తేనే నిధుల విడుదల జరుగుతుందని తెలిపారు. అమెరికాలో నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒప్పందంపై వివాదం చెలరేగడం రిపబ్లికన్‌ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. ప్రతినిధులసభలోనూ, సెనెట్‌లోనూ రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. దానిని కాపాడుకోవడానికే వారు ఆపసోపాలు పడుతున్నారు.

చమురు ధరలు తగ్గాలంటే టైం పట్టొచ్చు
హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరిస్తే గ్యాస్‌ ధరలు కిందికి దిగివస్తాయని అంచనాలు వేస్తున్నప్పటికీ అవి కొంతకాలం పాటు యుద్ధానికి ముందున్న స్థాయి కంటే ఎక్కువగానే ఉంటాయని విశ్లేషకులు తెలిపారు. అంటే ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటర్లకు పెట్రోలు బంకుల వద్ద ఇబ్బందులు తప్పవని తేలిపోయింది. శాంతి ఒప్పందంపై ఈ నెల 19న సంతకాలు జరిగినా ఆ వెంటనే హార్ముజ్‌ జలసంధిని తెరిచే పరిస్థితి ఉండదు. చమురు సరఫరాలు సాధారణ స్థాయికి చేరాలంటే కొన్ని వారాలు లేదా నెలలు కూడా పట్టవచ్చు. ఉత్పత్తిని క్రమేపీ పెంచుతూ, యుద్ధంలో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలకు మరమ్మతులు చేసేందుకు గల్ఫ్‌ దేశాలు ప్రయత్నిస్తున్నందున సరఫరాలు పరిమితంగానే ఉంటాయి. 2027 నాటికి కానీ పూర్తి స్థాయిలో చమురు రవాణా జరగదని నిపుణులు స్పష్టం చేశారు. చమురు సరఫరాలలో జాప్యం, ధరలు ఇప్పటికిప్పుడే తగ్గే అవకాశం లేకపోవడం వంటి పరిణామాలు ట్రంప్‌, రిపబ్లికన్ల రాజకీయ ప్రయోజ నాలను దెబ్బతీయవచ్చు. ఎందుకంటే అమెరికా ఓటర్లు జీవన వ్యయ ఒత్తిడులపై దృష్టి సారిస్తున్నారు. సమస్యను పరిష్కరించడంలో ట్రంప్‌ వైఫల్యాన్ని సుమారు 70 శాతం మంది వేలెత్తి చూపారు.

తుది ఒప్పందంపై ట్రంప్‌ ఆందోళన
ఇరాన్‌తో అమెరికా చేసుకున్న చివరి ఒప్పందం ఘోర మైనదని ట్రంప్‌ తరచూ చెబుతుంటారు. ఆ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది బరాక్‌ ఒబామా ప్రభుత్వం. ఆ ఒప్పందం ఫలితంగా ఒబామా ప్రభుత్వం ఇరాన్‌కు పెద్ద మొత్తంలో సొమ్ము చేరవేసిందని ట్రంప్‌ ఎగతాళి చేశారు. ఇప్పుడు ట్రంప్‌ కుదుర్చుకోబోయే తుది ఒప్పందం దాని కంటే మెరుగైనదిగా ఉండని పక్షంలో ఆయనపై విరుచుకు పడేందుకు డెమొక్రాట్లు సిద్ధంగా ఉన్నారు. తాజా ఒప్పందం వివరాలు అధికారికంగా ఇంకా బయటికి రాలేదు. ఏదేమైనా ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే మెరుగైన ఒప్పందం చేసుకోవడం గురించి ట్రంప్‌ అంతర్గతంగా ఆందోళన చెందు తున్నారు. విదేశాలలో స్తంభింపజేసిన ఆస్తు లను ఇరాన్‌కు అందుబాటులోకి తెస్తారా, ఒకవేళ తెస్తే ఏ మేరకు తెస్తారు అనేది సందేహాస్పదంగా ఉంది. అవగాహనా ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చినప్పటికీ దానిపై ఇరాన్‌, అమెరికా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

మిత్రులలోనూ అసంతృప్తి
ఇక్కడ మరో ముప్పు కూడా పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలపై ఓటర్లు దృష్టి సారిస్తున్న సమయంలో ఏ కారణం చేతనైనా పోరు మరోసారి తీవ్ర రూపం దాలిస్తే ఇంధన ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇరాన్‌, అమెరికా మధ్య కుదిరిన ఒప్పందాన్ని ఓ రకమైన లంగుబాటుగా ఇజ్రాయిల్‌ భావిస్తోంది. ఆ దేశ నాయకులు ట్రంప్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇరాన్‌లో కూడా కొందరు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నారు. విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన జరిగింది. పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమైంది. ఓ వైపు ఒప్పందంపై చర్చలు జరుగుతుంటే మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయిల్‌ బాంబు దాడులు జరిపింది. ఈ చర్య ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించింది. ఇరాన్‌తో చర్చలు విఫలమై ఘర్షణలు తిరిగి ప్రారంభం కావాలని ఇజ్రాయిల్‌ నేతలు కోరుకున్నారు. ఇదిలావుంటే గతంలో నాటో దేశాలపై ట్రంప్‌ మండిపడిన నేపథ్యంలో ఆయనకు, యూరోపియన్‌ నాయకులకు మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరోవైపు గల్ఫ్‌లో అమెరికా స్థావరాలకు ఆతిథ్యం ఇవ్వడం ఎంత నష్టదాయకమో మధ్యప్రాచ్యంలోని ప్రాంతీయ దేశాలకు తెలిసి వచ్చింది. దీంతో గల్ఫ్‌లోని అమెరికా మిత్రదేశాలు ప్రస్తుతం పునరాలోచనలో పడినట్లు కన్పిస్తోంది. ఇరాన్‌పై యుద్ధానికి అమెరికా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం చిరకాల మిత్రులకు కూడా రుచించడం లేదు.

క్లిష్టమైన సమలస్యలను వదిలేశారు
తాజా ఒప్పందం అనేక క్లిష్టమైన సమస్యలను భవిష్యత్తుకు వదిలివేయడం గమనార్హం. ముఖ్యంగా ఇరాన్‌ అణు కార్యక్రమంపై స్పష్టత రాలేదు. పైగా అంగీకారానికి వచ్చిన అంశాలపై కూడా ఇరు పక్షాలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. అణు కార్యక్రమానికి తుది ఒప్పందంలో పరిష్కారం లభించని పక్షంలో దాడులను తిరిగి ప్రారంభించాలని ట్రంప్‌ యోచిస్తున్నారు. అదే సమయంలో యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య అమెరికాలో పెరుగుతూ వస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -