Tuesday, June 16, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్శనగపిండితో భలే రుచులు

శనగపిండితో భలే రుచులు

- Advertisement -

ఇంట్లో శనగపిండి ఉంటే చాలు.. చాలా మంది మిర్చిబజ్జీనో, ఉల్లిపకోడీనో చేసుకుంటారు. ఇవి సర్వసాధారణమైన చిరుతిళ్లు. మహా అయితే కారప్పూస, మైసూర్‌‌పాక్‌ ‌వంటివి చేస్తారు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఆ స్పెషల్‌ రెసిపీలు ఏంటో ఈ రోజు నేర్చుకుందాం…

హల్వా
కావల్సిన పదార్థాలు: శనగపిండి – రెండు కప్పులు, నెయ్యి – ముప్పావు కప్పు, బెల్లంపొడి – ఒకటిన్నర కప్పులు, పాలు – కప్పు, యాలకుల పొడి – ముప్పావు స్పూన్, జీడిపప్పులు – గుప్పెడు, బాదం, ఎండుద్రాక్ష – రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున
తయారు చేసే విధానం: నెయ్యిలో బాదం, జీడిపప్పులు, ఎండుద్రాక్షలను వేయించి పక్కనుంచాలి. అదే కడాయిలో శనగపిండి వేసి సన్న సెగ మీద కలియబెడుతూ వేయించాలి. పిండి చక్కగా వేగి.. మంచి వాసన వస్తున్నప్పుడు పాలు, కొన్ని నీళ్లు జతచేసి ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. కాస్త చిక్కగా అయ్యాక బెల్లం, యాలకుల పొడి జోడించాలి. హల్వా మరింత చిక్కబడిన తర్వాత బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పులు వేసి దించేయాలి. అంతే నోరూరించే బేసన్‌ హల్వా తయారైపోతుంది.

సేవ్‌
కావల్సిన పదార్థాలు: శనగపిండి – రెండు కప్పులు, బియ్యప్పిండి – నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు, కారం – ముప్పావు స్పూన్, పసుపు – చిటికెడు, వాము పొడి – అర స్పూన్, నూనె- వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం: వెడల్పాటి గిన్నెలో శనగపిండి, బియ్యప్పిండి, నెయ్యి, నీళ్లు, కారం, పసుపు, వాము పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ పిండిని సన్న రంధ్రాల ప్లేట్‌ అమర్చిన కారప్పూస గిద్దల్లోకి కొంత తీసుకోవాలి. కాగుతున్న నూనెలో సేవ్‌ మేకర్‌ను గుండ్రంగా తిప్పుతూ సన్నకారప్పూస చుట్టలుగా వేయాలి. మధ్యస్థమైన సెగ మీద బంగారురంగులోకి మారే వరకూ వేయించి టిష్యూ పేపర్‌ మీదికి తీస్తే అదనపు నూనెను పీల్చేసుకుంటాయి. ఇక నోట్లో పెడితే కరిగిపోయే ‘బేసన్‌ సేవ్‌’ రెడీ అయిపోతుంది. దీన్ని అలాగే తినొచ్చు, ఛాట్, భేల్‌పురీల్లోనూ వేసుకోవచ్చు.

ఖమన్‌ ఢోక్లా
కావల్సిన పదార్థాలు:
శనగపిండి – కప్పు, రవ్వ – టేబుల్‌ స్పూన్, పసుపు – చిటికెడు, ఉప్పు – రుచికి తగినంత, పంచదార, ఫ్రూట్‌ సాల్ట్‌ – స్పూన్‌ చొప్పున, నిమ్మరసం – టేబుల్‌ స్పూన్, నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – స్పూన్,
ఆవాలు – ముప్పావు స్పూన్, జీలకర్ర – అర స్పూన్, పచ్చిమిర్చి – మూడు, కరివేపాకు – రెండు రెబ్బలు, పంచదార – స్పూన్, కొత్తిమీర తరుగు – గుప్పెడు .
తయారు చేసే విధానం: మిక్సింగ్‌ బౌల్‌లో శనగపిండి, రవ్వ, పసుపు, ఉప్పు, పంచదార వేసి కలపాలి. అందులో అర కప్పు నీళ్లు, నిమ్మరసం, ఫ్రూట్‌ సాల్ట్‌ జతచేసి ఉండలు కట్టకుండా కలియబెట్టాలి. ఈ పిండిని నెయ్యి రాసిన వెడల్పాటి గిన్నెలో సమంగా సర్ది కుక్కర్‌లో ఉంచి, వెయిట్‌ పెట్టకుండా ఆవిరి మీద ఉడికించాలి.
పావుగంట తర్వాత సెగ తీసేసి చల్లారాక ముక్కలుగా కోయాలి. ఇప్పుడు ప్యాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలను ఒక్కొక్కటిగా వేయాలి. ఈ తాలింపును ఢోక్లా ముక్కలపై వేసి, కొత్తిమీర చల్లితే.. ఘుమఘుమలాడే ‘ఖమన్‌ ఢోక్లా’ తయారైపోతుంది. కొబ్బరి లేదా పుదీనా చట్నీతో ఎంతో బాగుంటుంది.

బర్ఫీ
కావల్సిన పదార్థాలు: శనగపిండి, పంచదార – కప్పు చొప్పున, నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – అర స్పూన్, బాదం, పిస్తా, జీడిపప్పులు – అన్నీ కలిపి పావు కప్పు
తయారు చేసే విధానం: కడాయిలో కాస్త నెయ్యి వేడిచేసి బాదం, పిస్తా, జీడిపప్పులను వేయించి గిన్నెలోకి తీయాలి. అందులోనే మిగిలిన నెయ్యి వేసి శనగపిండిని సన్న సెగ మీద కలియబెడుతూ వేయించాలి. పిండి లేత గోధుమరంగులోకి మారి మంచి వాసన వస్తుండగా బాదం, పిస్తా, జీడిపప్పులు జతచేసి దించేయాలి. ఇప్పుడు పంచదారలో అర కప్పు నీళ్లు చేర్చి పాకం పట్టాలి. పాకం తీగలా సాగుతున్నప్పుడు వేయించిన శనగపిండి, యాలకుల పొడి జతచేసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. అది ముద్దలా అయ్యే వరకూ ఉంచి సెగ తీసేయాలి.ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలో సమంగా సర్దాలి. చల్లారాక నచ్చిన ఆకృతిలో ముక్కలుగా కోసుకోవాలి. ఇక రుచికరమైన బేసన్‌ బర్ఫీ తిని ఆనందించడమే తరువాయి.

చీలా
కావల్సిన పదార్థాలు: శనగపిండి – కప్పు, ఉప్పు – రుచికి తగినంత, పసుపు – పావు స్పూన్, జీలకర్ర, కారం – అర స్పూన్‌ చొప్పున, ఉల్లి, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్ల చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు – స్పూన్, నూనె – నాలుగు స్పూన్లు
పనీర్‌ స్టఫింగ్‌ కోసం: తురిమిన పనీర్‌ – కప్పు, ఉల్లి తరుగు – గుప్పెడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిర్చి ముద్ద, నిమ్మరసం – అర స్పూన్‌ చొప్పున, మిరియాల పొడి – పావు స్పూన్, ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం: శనగపిండిలో కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు కట్టకుండా కలిపి.. ఒక పావుగంట పక్కనుంచాలి. మరో పాత్రలో పనీర్‌ తురుము, ఉల్లి, మిర్చి, కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం జోడించి స్టఫింగ్‌ తయారుచేయాలి. కాలుతున్న పెనం మీద గరిటెడు పిండితో దోశ వేసి చుట్టూ నూనె చల్లాలి. దాని మీద తగినంత పనీర్‌ మిశ్రమాన్ని సమంగా పరిచినట్లు చేయాలి. రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకూ కాల్చుకోవాలి. తక్కిన పిండితోనూ ఇలాగే చేయాలి. వీటికి టొమాటో లేదా పుదీనా చట్నీ మంచి కాంబినేషన్‌.

బేసన్‌ లడ్డూ
కావల్సిన పదార్థాలు:
శనగపిండి – రెండు కప్పులు, నెయ్యి – కప్పు, పంచదార పొడి – కప్పున్నర, యాలకుల పొడి – అర స్పూన్, జీడిపప్పులు – గుప్పెడు, బాదంపప్పు – రెండు టేబుల్‌ స్పూన్లు, కుంకుమపువ్వు – కొద్దిగా
తయారు చేసే విధానం: కడాయిలో కాస్త నెయ్యి వేడిచేసి బాదం, జీడిపప్పులను వేయించి పళ్లెంలోకి తీయాలి. అదే కడాయిలో మిగిలిన నెయ్యి, శనగపిండి, కుంకుమపువ్వు వేసి సన్నసెగ మీద కలియబెడుతూ వేయించాలి. కొద్దిసేపటికి పిండి కొద్దిగా జారుగా దోశల పిండిలా అవుతుంది. ఇప్పుడు దించేసి పంచదార పొడి, బాదం, జీడిపప్పులు, యాలకుల పొడి వేసి కలియబెట్టాలి. మిశ్రమం చల్లారాక.. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని లడ్డూలు చుట్టుకుంటే సరిపోతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -