ఏఆర్‌హెచ్‌సీ స్కీమ్‌ ఫ్లాప్‌

ARHC scheme is a flop– నాలుగేండ్లలో సిద్ధంగా ఉన్న ఇండ్లు 7 శాతం కంటే తక్కువే
– అవి కూడా ఐదు రాష్ట్రాలు, యూటీలలోనే
– పట్టణ పేదలకు నెరవేరని ‘గూడు’ లక్ష్యం
– రాష్ట్రాలతో కేంద్రానికి సమన్వయం లోపం
– మోడీ సర్కారు తీరుపై పట్టణ పేదల ఆగ్రహం
న్యూఢిల్లీ : పట్టణ పేదల కోసం 2020 జులైలో మోడీ ప్రభుత్వం తక్కువ అద్దె గృహ సముదాయాల(ఏఆర్‌హెచ్‌సీ) పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే, ఈ పథకం మాత్రం పేదల ఆశలను తీర్చటం లేదు. వారికి నివాసం ఉండటానికి గూడును కల్పించటం లేదు. మోడీ సర్కారు వైఫల్యంతోనే ఏఆర్‌హెచ్‌సీ స్కీమ్‌ విజయవంతం కావటంలేదని దేశవ్యాప్తంగా ఉన్న పట్టణ పేదలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పథకం అమలులోకి వచ్చినప్పటి నుంచి నాలుగేండ్ల తర్వాత 83 వేలకు పైగా ప్రభుత్వం నిర్మించిన ఫ్లాట్లలో ఏడు శాతం కంటే తక్కువ.. పట్టణ ప్రజలకు తక్కువ అద్దె గృహాలుగా మార్చబడ్డాయి. అవి కూడా ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే కావటం గమనార్హం.
నగరాల నుంచి వలస కార్మికులు పెద్ద ఎత్తున తిరిగి గ్రామాలకు వెళ్ళడానికి దారితీసిన కోవిడ్‌ -19 మహమ్మారి సమయంలో ప్రారంభించబడిన ఈ పథకం లక్ష్యం పట్టణ పేదలకు అద్దె ప్రాతిపదికన గృహాలను అందించటం. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 83,534 ఫ్లాట్లను అద్దె వసతిగా మార్చాల్సి ఉన్నది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యూవల్‌ మిషన్‌(జేన్‌ఎన్‌యూఆర్‌ఎం), రాజీవ్‌ ఆవాస్‌ యోజన కింద ఈ ఫ్లాట్‌లు నిర్మించబడ్డాయి. ఏఆర్‌హెచ్‌సీ పథకం కింద.. ఈ ఫ్లాట్‌లను పట్టణ పేదలకు అద్దె గృహాలుగా మార్చాలి. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5,648 ఫ్లాట్లు మాత్రమే అద్దె ప్రాతిపదికన పట్టణ పేదలకు అందుబాటులోకి వచ్చాయి. 83,534 ఫ్లాట్లలో, మెజారిటీ మహారాష్ట్ర (32,245), ఢిల్లీ (29,112)లో ఉన్నాయి. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో.. గత నాలుగేండ్లలో 13,061 ఫ్లాట్లను అద్దె గృహాలుగా మార్చటానికి గుర్తించారు. వీటిలో 5,648 గుజరాత్‌, రాజస్తాన్‌, ఉత్తరాఖండ్‌, చండీగఢ్‌, జమ్మూ కాశ్మీర్‌లలో అద్దె గృహాలుగా మార్చబడ్డాయి. మంత్రిత్వ శాఖ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వ ఏజెన్సీలు మరో 7,413 గృహాలను అద్దెకు మార్చే ప్రక్రియలో ఉన్నాయి.
పట్టణ పేదలకు ఇళ్ల స్థలాలు అందించడం మోదీ ప్రభుత్వ ప్రధాన హామీలలో ఒకటి. ఏఆర్‌హెచ్‌సీ లాగానే 2015, జూన్‌లో ప్రారంభించబడిన ప్రధాన్‌ మంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ (పీఎంఏవై-యూ) పట్టణ ప్రాంతాల్లోని మురికివాడలలో నివసించే పట్టణ పేదలకు గృహాలను అందించడానికి ఉద్దేశించిన ఇన్‌-సిటు స్లమ్‌ రీడెవలప్‌మెంట్‌(ఐఎస్‌ఎస్‌ఆర్‌) భాగాన్ని కలిగి ఉన్నది. అయితే, చాలా మంది పేదలు దీనితో ప్రయోజనం పొందలేదని పట్టణాభివృద్ధి, గృహ నిపుణులు తెలిపారు.
హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల వద్ద అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఐఎస్‌ఎస్‌ఆర్‌ కాంపోనెంట్‌ కింద 2.96 లక్షల గృహాలు మంజూరయ్యాయి. వాటిలో 1.56 లక్షలు మార్చి 11 వరకు పూర్తయ్యాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో ఈ పథకం ముగియనున్నది. దేశవ్యాప్తంగా నగరాల్లోని మురికివాడల్లో నివసించే ప్రజలను ప్రభుత్వ సంస్థలు పెద్ద ఎత్తున ఖాళీ చేయించినప్పటికీ.. వారికి గృహాలను అందించడానికి చాలా తక్కువ చర్యలు తీసుకున్నారని ఢిల్లీలోని ఒక ఎన్జీఓ హౌసింగ్‌ అండ్‌ ల్యాండ్‌ రైట్స్‌ నెట్‌వర్క్‌(హెచ్‌ఎల్‌ఆర్‌ఎన్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎనాక్షి గంగూలీ అన్నారు.
గంగూలీ ప్రకారం.. దేశవ్యాప్తంగా 2022, 2023లో దాదాపు 7.4 లక్షల మంది మురికివాడల నివాసితులు తొలగించబడ్డారు. ఈ నెల ప్రారంభంలో, భూమి హక్కుల సంఘం భారతదేశంలోని మురికివాడల నివాసితుల తొలగింపుపై నివేదికను విడుదల చేసింది. ”ఢిల్లీ వంటి నగరాల్లో, చాలా తక్కువ ఇన్‌-సిట్‌ రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులు చేపట్టబడ్డాయి. ఢిల్లీలో అద్దె గృహాల పరిస్థితి ఏమిటో కూడా మాకు తెలియదు. పట్టణ పేదలకు గృహాలను అందించడానికి బాగా ఆలోచించదగిన విధానాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఉన్నది ”అని గంగూలీ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రకారం, ఏఆర్‌హెచ్‌సీ పథకం కింద నిర్మించిన ఫ్లాట్‌లు చాలా కాలం క్రితం నిర్మించబడ్డాయి.
వాటికి మరమ్మతులు చేయాల్సి ఉండగా, కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఢిల్లీలో కూడా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్‌ ఆవాస్‌ యోజన కింద నిర్మించిన ఫ్లాట్‌లలో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. ఢిల్లీలోని 29,000కు పైగా ఫ్లాట్ల విషయంలో.. కేంద్రం మరియు ఢిల్లీ ప్రభుత్వం ఈ అంశంపై ఇంకా ఒక అంగీకారానికి రాలేదు. మహారాష్ట్రలో ఏఆర్‌హెచ్‌సీ ప్రతిపాదనలను దాదాపు 40కి పైగా నగరాల్లో మున్సిపల్‌ కార్పొరేషన్లు అమలు చేస్తున్నాయి. ”ప్రస్తుతానికి, అద్దె గృహాల పథకం కింద ఎటువంటి ప్రతిపాదనను తీసుకోలేదు” అని మహారాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

Spread the love