అర్జున్‌ ‘ఫైటర్‌’

Arjun 'Fighter'నవతెలంగాణ క్రీడావిభాగం
పారిస్‌ ఒలింపిక్స్‌లో యువ షుటర్‌ అర్జున్‌ బబుత హృదయం ముక్కలైంది!. విశ్వ క్రీడల్లో పతకం కోసం విశ్రాంతి లేకుండా కష్టపడిన అర్జున్‌ బబుత.. ఒక్క చెత్త షాట్‌తో పతకం చేజార్చుకున్నాడు. చిన్న వయసులోనే ఒలింపిక్స్‌లో పోటీపడే అవకాశం దక్కించుకున్న అర్జున్‌కు నిజానికి పారిస్‌లో పోటీపడటమే పెద్ద విజయం. పారిస్‌లో పతకం కోసం ఆఖరు వరకు పోరాడిన అర్జున్‌ బబుత.. నిజ జీవితంలోనూ పోరాట యోధుడు. 2019లో చెన్నైలోని గన్‌ ఫర్‌ గ్లోరీ అకాడమీలో సాధన చేస్తుండగా.. ఉన్నట్టుండి అర్జున్‌ కుప్పకూలిపోయాడు. శారీరక శ్రమను ఏమాత్రం లెక్క చేయకుండా విరామం లేని సాధనతో అర్జున్‌ తీవ్ర అనారోగ్య సమస్యలకు గురయ్యాడు. దేశవ్యాప్తంగా వైద్య నిపుణులను సంప్రదించినా.. మళ్లీ గన్‌ పట్టుకోవటం అసాధ్యమని తేల్చారు. కానీ గన్‌తో దేశం గర్వపడే ప్రదర్శన చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న అర్జున్‌.. అనారోగ్య సమస్యలను అధిగమించేందుకు రెట్టించిన మానసిక స్థైర్యంతో ముందుకు సాగాడు. 25 ఏండ్ల అర్జున్‌.. ఆరేండ్ల క్రితం భారత షుటింగ్‌లో ఓ ముగిసిన అధ్యాయం. కానీ ఇప్పుడు భారత షుటింగ్‌కు భవిష్యత్‌గా కనిపిస్తున్న యోధుడు!. ‘2019 నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. దేశవ్యాప్తంగా ఎంతో మంది వైద్యులను సంప్రదించాను. నేను గన్‌ పట్టుకుని షుట్‌ చేసినప్పుడు నా శరరీం కుప్పకూలిపోయింది. 2018లో భారత జాతీయ జట్టులోకి ఎంపికైనప్పుడు నా వయసు 19 ఏండ్లు. సాధనపై ఫోకస్‌ చేసిన నేను.. విశ్రాంతి తీసుకోవటం విస్మరించాను. సరైన మార్గదర్శనం లేకపోవటం వల్ల ఇది జరిగింది. ఇప్పుడు అనారోగ్యం సమస్యల నుంచి బయటపడ్డాను. కెరీర్‌లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాను’ అని అర్జున్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం చేజార్చుకోవటం మరువలేని గాయం. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినా.. బలంగా పుంజుకున్న అర్జున్‌ బబుత పారిస్‌ ఒలింపిక్స్‌ పతకం విషయంలోనూ అదే చేస్తాడని చెప్పవచ్చు.

Spread the love