Wednesday, April 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'సర్‌'పై పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలి

‘సర్‌’పై పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలి

- Advertisement -

– దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలి
– కాంగ్రెస్‌, బీజేపీ వ్యవహారంపై దృష్టిసారించాలి
– కొత్త ఓటర్ల నమోదుపై చొరవ చూపాలి :హైదరాబాద్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)పై ప్రత్యేక దృష్టిసారించాలనీ, పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌) సూచించారు. దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ ఇప్పటికే దొంగ ఓట్లను నమోదు చేశాయనీ, వాటి వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని అన్నారు. మంగళవా రం హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పద్మారావు గౌడ్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంకటేష్‌, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, వాణిదేవితోపాటు ఇతర నియోజకవర్గాల ఇంచార్జీలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం నిర్వహించే సర్‌ పేరుతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రతి నియోజకవర్గానికి అత్యంత కీలకమని అన్నారు. దీన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా పరిగణించి పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఇప్పటికే నమోదు చేసిన దొంగ ఓట్లు, డబుల్‌ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని కేటీఆర్‌ ఆదేశించారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంట్లోనే పదుల సంఖ్యలో ఓట్లు నమోదు కావడం, వేల సంఖ్యలో ఇతర నియోజకవర్గాల ఓట్లు ఉండటం వల్ల బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు హక్కును కోల్పోకుండా పార్టీ తరఫున అండగా నిలవాలనీ, నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమ బాధ్యతలతోపాటు పర్యవేక్షణను మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు అప్పగిస్తున్నట్టు కేటీఆర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్‌ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరారు. బూత్‌ స్థాయిలో చురుకైన కార్యకర్తలను వెంటనే ”బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ)గా గుర్తించి, ఆ జాబితాను ప్రభుత్వ సిబ్బందికి, కేంద్ర పార్టీ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. త్వరలోనే బూత్‌ లెవల్‌ ఏజెంట్లకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -