నాయకుడు దారి చూపగా..!

the leader Showing the way..!– కొత్త పాత్రలో మెప్పిస్తున్న రోహిత్‌ శర్మ
–  పవర్‌ప్లేలో హిట్‌మ్యాన్‌ ధనాధన్‌ షో ప్రపంచ క్రికెట్‌లో దశాబ్ద కాలంగా
అటు రెడ్‌ బాల్‌ ఫార్మాట్‌లో, ఇటు వైట్‌బాల్‌ ఫార్మాట్‌లో అగ్రజట్టుగా వెలుగొందుతున్న జట్లలో టీమ్‌ ఇండియా ఒకటి. 2015, 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ సహా 2017 చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు చేరిన భారత్‌ పరుగుల వేటలో సంప్రదాయ పద్దతులను వీడటం లేదనే విమర్శ ఎక్కువగా వినిపించేది. 2023 ప్రపంచకప్‌ వేటలో ఆ విమర్శకు జవాబు ఇచ్చిన రోహిత్‌ శర్మ.. జట్టు నుంచి ఏ తరహా ప్రదర్శన ఆశిస్తున్నాడో స్వీయ ఆట నుంచి చూపిస్తున్నాడు.
నవతెలంగాణ క్రీడావిభాగం
టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 2023 ప్రపంచకప్‌లో తన జట్టును సరికొత్త పంథాలో నడిపిస్తున్నాడు. కొత్త బంతిపై పవర్‌ప్లేలో పరుగుల వేట ముమ్మరం చేసిన రోహిత్‌ శర్మ.. ఫీల్డింగ్‌ పరిమితులు ఉన్న తొలి పది ఓవర్లలో దంచికొట్టిన బ్యాటర్లలో ముందున్నాడు. వన్డే క్రికెట్‌లో 200 ప్లస్‌, అత్యధిక వ్యక్తిగత స్కోరుకు చిరునామా రోహిత్‌ శర్మ. రోహిత్‌ శర్మ కెరీర్‌ అంతా.. ఆరంభంలో నెమ్మదిగానే ఆడాడు. ఓ ఎండ్‌లో శిఖర్‌ ధావన్‌ దూకుడుగా ఆడితే, రోహిత్‌ మాత్రం సావధానంగా ఇన్నింగ్స్‌కు వేగం తీసుకొచ్చేవాడు. కానీ 2023 వరల్డ్‌కప్‌లో కథ మారింది. పవర్‌ప్లేలో ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర చేసే బాధ్యత స్వయంగా నాయకుడే తీసుకున్నాడు. యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు ఆ బాధ్యత ఇవ్వకుండా తనే దంచికొడుతున్నాడు. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఎంతో రిస్క్‌ తీసుకున్న రోహిత్‌ శర్మ ఆ ఫలాలను ఇప్పుడు ఆస్వాదిస్తున్నాడు. రోహిత్‌ నయా శైలిలో జట్టుతో పాటు అతడూ అజేయ పథంలోనే నడుస్తున్నాడు.
కంఫర్ట్‌ జోన్‌ వీడి..
చీఫ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ద్వయం జట్టు ప్రణాళికల్లో పెద్దగా మార్పులు చేయలేదు. కానీ ఆటగాళ్లు కంఫర్ట్‌ జోన్‌ వీడి ఆడేందుకు అవకాశాలు కల్పించారు. దీంతో ప్రస్తుత టీమ్‌ ఇండియా వికెట్‌కు పెద్దగా విలువ ఇవ్వటం లేదు. పరుగుల వేటపైనే గురి పెడుతోంది. సహచర క్రికెటర్లు కంఫర్ట్‌ జోన్‌ వీడి ఆడాలంటే.. తొలుత కెప్టెన్‌గా తనే ఆ పని చేయాలని రోహిత్‌ శర్మ నిశ్చయించుకున్నాడు. అందులో భాగంగానే పవర్‌ప్లేలో పవర్‌ఫుల్‌ ప్రదర్శన చేస్తున్నాడు. పవర్‌ప్లేలో ఏకంగా 30 శాతం బంతులను రోహిత్‌ శర్మ బౌండరీలుగా మలచాలని చూస్తున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ ఒక్కడే ఈ అంశంలో రోహిత్‌ కంటే ముందున్నాడు. కానీ 77 శాతం షాట్‌ నియంత్రణ, సక్సెస్‌ రేట్‌తో రోహిత్‌ శర్మ ముందంజలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌ గ్రూప్‌ దశ మ్యాచుల్లో ఆస్ట్రేలియా మాత్రమే పవర్‌ప్లేలో భారత్‌ కంటే ఎక్కువ పరుగులు చేసింది. ఆసీస్‌ తరఫున ఇద్దరు ఓపెనర్లు డెవిడ్‌ వార్నర్‌, ట్రావిశ్‌ హెడ్‌ ఎదురుదాడి చేస్తుండగా.. భారత్‌ నుంచి రోహిత్‌ శర్మ ఒక్కడే ఆ పని చేస్తున్నాడు.
కోహ్లిపై నమ్మకమే!!
రోహిత్‌ శర్మ ఎదురుదాడి వెనుక మరో రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఇన్నింగ్స్‌ తొలి ఐదు ఓవర్లలో రోహిత్‌ ఆచితూచి ఆడుతున్నాడు. పిచ్‌ నుంచి పేసర్లకు స్వింగ్‌ లభిస్తుందా? లేదా అని పరిశీలిస్తున్నాడు. స్వింగ్‌ లేదని నిర్ధారణకు వచ్చాక అతడు ఆగటం లేదు. భీకర పేసర్లతో కూడిన సఫారీ బౌలర్లు పవర్‌ప్లేలో బంతి వేసేందుకు ఎంతగా తడబడ్డారో చూశాం. అందుకు కారణం, రోహిత్‌ శర్మ వీరోచిత హిట్టింగే. ఆరంభంలోనే భీకర పేసర్లపై ఎడాపెడా బౌండరీలు బాదుతున్న రోహిత్‌.. బౌలర్ల ఆత్మ స్థైర్యం దెబ్బతీస్తున్నాడు. పవర్‌ప్లేలో వేగంగా పరుగులు రావటంతో మిడిల్‌ ఓవర్లలో బ్యాటర్లపై పెద్దగా ఒత్తిడి ఉండటం లేదు. ఇదే సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో విరాట్‌ కోహ్లి ఉన్నాడనే నమ్మకం సైతం రోహిత్‌ శర్మను ఎదురుదాడికి ఉసిగొల్పుతుంది. ఆరంభంలో రోహిత్‌ శర్మ దూకుడుగా ఆడే బాధ్యత తీసుకోగా.. ఇన్నింగ్స్‌ ఆఖరు వరకు క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధించే బాధ్యత కోహ్లి తీసుకుం టున్నాడు. దీంతో ఆరంభంలోనే వికెట్‌ పడితే ఎలా? అనే ఆందోళన డ్రెస్సింగ్‌రూమ్‌లో పెద్దగా కనిపించటం లేదు. విరాట్‌ కోహ్లి సక్సెస్‌ సైతం రోహిత్‌ శర్మ భయమెరుగని బ్యాటింగ్‌కు ఓ కారణం.
నాయకుడి నిర్ణయమే
రోహిత్‌ శర్మ పవర్‌ప్లేలో నయా రూపం, కొత్త బంతిపై భయమెరుగని ఎదురుదాడి వెనుక డ్రెస్సింగ్‌రూమ్‌ ప్రణాళికల గురించి బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోర్‌ను అడుగగా.. పవర్‌ప్లేలో పరుగుల వేట ఫార్ములా పూర్తిగా నాయకుడి నిర్ణయమే అని చెప్పాడు. ‘ప్రపంచకప్‌లో ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఎటువంటి ప్రణాళికలు నిర్దేశించలేదు. క్రీజులో ఉన్నంతసేపు వీలైనన్ని పరుగులు చేయటమే మా ఫార్ములా. పిచ్‌ బాగుంటే, ఎదురుదాడికి వెళ్లటమే. అది పూర్తిగా రోహిత్‌ శర్మ నిర్ణయం. జట్టు సారథిగా మాటలతో కాకుండా యాక్షన్‌తో మెప్పిస్తున్నాడు. జట్టు నుంచి తను ఏం ఆశిస్తున్నాడో.. తను అది ఆచరించి చూపిస్తున్నాడు. గొప్ప బ్యాటర్ల, కెప్టెన్ల లక్షణం ఇదే’ అని విక్రమ్‌ తెలిపారు.

Spread the love