అఫ్గాన్-ఏపై
101 పరుగులతో గెలుపు
‘ఏ’ జట్ల ముక్కోణపు వన్డే సిరీస్
దంబుల్లా (శ్రీలంక) : ‘ఏ’ జట్ల ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్-ఏ దాదాపుగా ఫైనల్లోకి ప్రవేశించింది. లీగ్ దశ తొలి మ్యాచ్‌లో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో అఫ్గనిస్తాన్-ఏ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్-ఏ.. బుధవారం దంబుల్లాలో జరిగిన రెండో మ్యాచ్‌లో అఫ్గాన్‌పై కసితీరా గెలుపొందింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించటంతో 101 పరుగుల తేడాతో భారత్-ఏ ఘన విజయం సాధించింది. లీగ్ దశలో శ్రీలంక-ఏ, అఫ్గనిస్తాన్-ఏ మ్యాచ్ మిగిలి ఉన్నప్పటికీ.. ఫైనల్లో బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. భారత్-ఏ తొలుత 50 ఓవర్లలో 9 వికెట్లకు 319 పరుగులు చేయగా.. ఛేదనలో అఫ్గనిస్తాన్-ఏ 36.5 ఓవర్లలో 218 పరుగులకే కుప్పకూలింది. 101 పరుగులతో భారత్-ఏ గెలుపొందింది.
సమిష్టిగా రాణించారు
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. టాప్ ఆర్డర్‌లో అందరూ రాణించారు. ప్రియాన్షు ఆరయ (58, 42 బంతులలో 9 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (59, 75 బంతుల్లో 5 ఫోర్లు), కుమార్ కుశాగ్ర (58, 67 బంతుల్లో 5 ఫోర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ (38), రుతురాజ్ గైక్వాడ్ (30), విప్‌రాజ్ నిగమ్ (30), నిశాంత్ సింధు (21 నాటౌట్) విలువైన ఇన్నింగ్స్‌లు ఆడారు.
కుప్పకూలిన అఫ్గాన్-ఏ
ఛేదనలో అఫ్గనిస్తాన్-ఏ కుప్పకూలింది. ఆల్‌రౌండర్ నిశాంత్ సింధు (4/31) స్పిన్ మాయతో నాలుగు వికెట్లు పడగొట్టగా.. పేసర్ యశ్ ఠాకూర్ (2/48) రెండు వికెట్లు తీసుకున్నాడు. భారత-ఏ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు కూల్చగా.. అఫ్గనిస్తాన్-ఏ 218 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు తరఫున బహిర్ షా (57, 52 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఫైజల్ (46, 56 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), ఇమ్రాన్ మీర్ (32, 27 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు.



