నవతెలంగాణ-సత్తుపల్లి
11వ అంతర్జాతీయ ‘ఆయుర్వేద’ దినోత్సవాన్ని మంగళవారం సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ యునాని, ఆయుర్వేద వైద్యశాలలు సంయుక్త ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోరుతూ మొక్కలు నాటారు.
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యకరమైన ఆహారం ప్రాముఖ్యతను వివరించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వైద్యాధికారులు తెలియజేశారు. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యతను చాటుతూ ఉత్సాహంగా యోగ వాక్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యునాని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షీలా స్రవంతి ఆరోగ్య సూత్రాలపై ప్రసంగించారు. ఫార్మసిస్టులు సంతోష్ కుమార్, కె. శ్రీనివాసరావు, యోగా ఇన్‌స్ట్రక్టర్ శాంతి, ఎస్‌ఎన్‌ఓ ప్రవీణ్ కుమార్, వంశీ పాల్గొన్నారు.



