ఆయుష్మాన్‌ భారత్‌ అంటే – ఆయుష్మాన్‌ బీజేపీ అనా?

ఆయుష్మాన్‌ భారత్‌ అంటే - ఆయుష్మాన్‌ బీజేపీ అనా?రామ్‌నామ్‌ కి లూట్‌ హై సకేతో లూట్‌ అంత్‌కాల్‌ పఛ్‌తాయేగా జబ్‌ సత్తా జాయెగి ఛూట్‌ – అని కబీర్‌దాస్‌ దోహేను తిరగరాసుకుని రాముని పేరు చెప్పి, ప్రాణప్రతిష్ట పేరు చెప్పి, భక్తి పారవశ్యంలో తెలిపోతున్నట్టు నటిస్తూ.ఫొటో షూట్‌ చేసుకుంటూ ప్రజల సొమ్మును తప్పుడు మార్గంలో దోచుకోవడం బీజేపీ నాయకులకు అలవాటు. క్రిమినల్సే కీలకస్థానాల్లో కొనసాగుతుండగా పరిస్థితులు నీతిమంతంగా సక్రమంగా ఉంటాయని ఎలా అనుకుంటాం? అమ్ముడుపోయిన ప్రధాన మీడియా నోరు మెదపకున్నా, నిజాయితీ నిబద్దత గల మిగతా మీడియా బీజేపీ అక్రమాల్ని వెలుగులోకి తెస్తూనే ఉంది. వివేచన గల దేశ పౌరులు ఆలోచించి సరైన నిర్ణ యం తీసుకోవాలి. దేశాన్ని ఫాసిజం వైపు నియంతృత్వం వైపు తీసుకుపోయే ప్రభుత్వం కావాలా? ప్రజాస్వామ్య బద్ధంగా అందరి హక్కుల్ని, స్వేచ్ఛని పరిరక్షించే ప్రభుత్వం కావాలా? ఆలోచించుకోవాలి! అలాంటి ప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు సమైక్యంగా కృషిచేయాలి!!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చాలా అవినీతి జరిగిందని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో – బయటా చాలా సుధీర్ఘమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు. 2జి, 3జి, 4జి వంటి అనేక స్కాంలు జరిగాయనీ, అప్పటి ప్రభుత్వం భ్రష్టుపట్టి పోయిందనీ ఒంటికాలి మీద లేస్తుంటారు. అవినీతి ఎక్కడ ఎప్పుడు జరిగినా బయటపెట్టడం మంచి పనే – అభినందించదగిందే!!. కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌: ఇచ్చిన రిపోర్టు చూపించి ఆ ఆరోపణలు చేశారు. ఆ రోజుల్లో సిఎజి ఛీఫ్‌ వినోద్‌ రారు ఉన్నాడు. ఇక్కడ నవ్వుకోవాల్సిన పరిస్థితి ఏమిటంటే అంతగా అప్పుడు ఎగిరిపడ్డ బీజేపీ ఆ అవినీతి నిరూపించి బాధ్యుల్ని జైలుకు పంపాలి కదా? మరి ఎందుకు పంపలేదూ? అది ఈనాటి ఈ బీజేపీ ప్రభుత్వపు ఆసమర్థత కాదా? సరే. అప్పటి విషయం అలా ఉంచి. ఇప్పటి ఈ బీజేపీ ప్రభుత్వం గురించి అదే  (కాగ్‌) ఇచ్చిన రిపోర్టు తెరచి చూద్దాం! ప్రధాన మీడియా మోడీకి దాసోహమంటోంది గనక, ఇలాంటి విషయాలు అది బయటపెట్టదు. బాధ్యత గల స్వతంత్ర జర్నలిస్ట్‌లు సత్యాన్వేషణకు పూనుకున్న కొన్ని పత్రికలు అధికార బీజేపీ అవినీతిని బయటపెడుతూనే ఉన్నాయి. స్వేచ్ఛాలోచనను బలపరిచే మనమూ-ఎవరు ఎక్కడ అవినీతికి పాలుపడ్డా, ఎవరెక్కడ నిజాయితీకి నిప్పుపెట్టినా స్పందిస్తూనే ఉండాలి కదా?
ఎలక్టోరల్‌ బాండ్స్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బీజేపీకి, మోడి ప్రభుత్వానికి ఊపిరి ఆడకుండా చేసింది. ఇక, తాజా సిఎజి రిపోర్టు ప్రకారం ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పేరుతో బీజేపీ ప్రభుత్వం ఎంత ఆవినీతికి పాల్పడిందో… బయటపడింది. ఈ పథకాన్ని భారతీయ జన ఆరోగ్య యోజన  అని అంటారు. దీనితో భారతీయ పౌరులకు, ముఖ్యంగా పేదలకు ఆరోగ్య సమస్యలేవైనా ఉంటే, చికిత్స కోసం భారత ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఖర్చు చేస్తుంది. ఆరోగ్య పథకం బావుంది దేశ ప్రజల ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే – అందులో సందేహం లేదు! కానీ, అది నిర్వహించబడుతున్న తీరు ఎలాగుందో అధ్యయనం చేసి జA+ రిపోర్టు విడుదల చేసింది. ఈ పథకం (స్కీం)లో లాభం పొందాలనుకునే వారు మొదట ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ కార్డు తీసుకోవాలి. తర్వాత ఆ స్కీంలో రిజిస్టర్‌ చేసుకోవాలి. అంటే తమ పేరు అందులో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత చికిత్స చేయించుకోవాలి. ఎంత పెద్ద ఆసుపత్రిలో నైనా సరే-వచ్చే ఖర్చులో రూ.ఐదు లక్షలు భారత కేంద్ర ప్రభుత్వమే చిల్లిస్తుంది. దీనితో అట్టడుగు పేదలకూ ఖర్చు భరించలేని మధ్యతరగతి వారికి ఎంతో ఊరట లభిస్తుంది. అలా బాగానే ఉంది కదా? ఇందులో అవినీతి ఏముందీ అని ఎవరికైనా అనుమానం వస్తుంది.
ఆయుష్మాన్‌ భారత్‌ను అడ్డుపెట్టుకుని, అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేసిందో  వివరాలు ఇచ్చింది. అవి ఇలా ఉన్నాయి. 1. వేరు వేరు కారణాల వల్ల అంతకు ముందే చనిపోయిన వారికి ప్రభుత్వం 5లక్షల చొప్పున డబ్భు చెల్లించింది-అంటే, చెల్లించినట్టు రాసి పెట్టారు! అసలైతే ఆ డబ్బు ఏ దేశ నాయకుడి ఖాతాలోకి పోయిందో ప్రజలు సులభంగానే ఊహించుకోవచ్చు. 2. దేశ పౌరులు మొదట ఆ స్కీమ్‌లో తమ పేరు నమోదు చేసుకుంటారు కదా? అలా నమోదు చేసుకున్న విధానం చూస్తే మతిపోతుంది. ఎందుకంటే ఒకే ఒక్క మొబైల్‌ నెంబర్‌ నుండి లక్షల మంది పేర్లు రిజిస్టర్‌ అయి ఉన్నాయి. ఒక కుటుంబంలోని సభ్యులు ఈ పథకం కింద లబ్ది పొందాలనుకుంటే, ఇంట్లో ఉన్న ఒక మొబైల్‌ నెంబర్‌తో నలుగురో, అయిదుగురో రిజిస్టర్‌ చేసుకుంటారు-నిజమే! అంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు కానీ, ఒక్క మొబైల్‌ నెంబర్‌తో లక్షల మంది పేర్లు రిజిస్ట్టర్‌ కావడం సాధ్యమా? పైగా అంతకు ముందెప్పుడో చనిపోయిన వారి ఎకౌంట్‌లలోకి డబ్బులు పంపినట్లు దొంగ లెక్కలు రాసుకున్నారు. అంటే వందల కోట్ల రూపాయల్లో ఎవరికీ ఏమి ఇచ్చింది లేదు. ఒక జఉఉఖజుణ ఖూ ూుఉ=్‌ తయారు చేసి దేశ నాయకులు డబ్బు లాగేశారన్నమాట. 3. దీని వల్ల ఆయుష్మాన్‌ భారత్‌ అంటే ఆయుష్మాన్‌ బీజేపీ అయిపోయిందన్న మాట: 4. ఈ పథకం వల్ల దేశ ప్రజలకు ఏ మాత్రం లాభం చేకూరలేదన్న విషయం  చెప్పకనే చెప్పింది. 5. ఏడున్నర లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని చూపించిన ఒక మొబైల్‌ నెంబరు గురించి ఎంక్వయిరీ చేస్తే – బిఐయస్‌ డేటా విశ్లేషకులు చెప్పిన దాని ప్రకారం అసలు ఆ నెంబర్‌తో సిమ్‌ కార్డు లేదు. లక్షా ముప్పయి తొమ్మిది వేల మూడు మంది రిజిస్ట్రేషన్‌ 8888888888 (పి సార్లు8) నెంబరుగల మొబైల్‌తో చేశారు. తొంబయి ఆరువేల నాలుగు వందల అరవై మంది-అంటే సుమారు లక్ష మంది మొబైల్‌ నెంబరు 9000000000 (9-9 సున్నాలు)తో రిజిస్టరయ్యారు. ఇంకా 20 వేల మంది ఇలాంటి ఒక లేని, తప్పుడు మొబైల్‌తోను, మరో 15 వేల మంది మరో దొంగ మొబైల్‌ నెంబర్‌తోనూ అలా అలా లక్షల మంది రిజిస్టర్‌ అయ్యారు. వారివారి దొంగ ఖాతాల్లోకి డబ్బులు పంపినట్లు రికార్డులు సృష్టించుకున్నారు అని నిరూపించింది.
పొరపాటున విషయం బయటపడి విచారణ జరిగితే ఎలాగా? అన్న భయం లేకుండా, తెగించి రికార్డులు తయారు చేసుకున్నారు. ఇంకా సిఎజి చెప్పిన విషయమేమంటే- ”లబ్దిదారులు” చనిపోయిన తేదీ తర్వాత- కొంత కాలం తర్వాత.. ఎప్పుడో వారి ఎకౌంట్లో డబ్బులు వేసినట్టు రికార్డు సృష్టించారన్నమాట! ప్రభుత్వ శాఖలో ఉండే మరణాల లిస్టు బయటికి తీసి ఇలా ఆరోగ్య పథకానికి డబ్బులిచ్చామని చక్కగా కథ అల్లుకున్నారు. మూర్ఖుల తెలివితేటలు ఇదిగో ఇలా ఉంటాయి! అందుకే జర్మన్‌ నవలా రచయిత ఫ్రాంజ్‌ కాఫ్కా అన్నాడు ”వారి ముర్ఖత్వం వల్లనే వారికి వారిపై అంతగా నమ్మకం ఉంటుంది!” అని! మూర్ఖుల గురించి చెప్పాడు. ఆనాడు యూపిఎ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టడానికి సిఎజి ఇచ్చిన రిపోర్టు మార్చి కాంగ్రెస్‌ను దుమ్మెత్తి పోశారు కదా? మరి పదేండ్లుగా దోషుల్ని జైలుకు ఎందుకు పంపలేదూ? – అని సామాన్యుడు ప్రశ్నిస్తాడు కదా? అంటే – అవినీతి ఆనాటి ప్రతిపక్ష బీజేపీ దేనని తేలిపోయింది. ఇప్పుడు కూడా అధికార బీజేపీదే అవినీతి అని తేటతెల్లమయ్యింది. ఎందుకంటే ఈ వివరాలు తెచ్చి ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం లేదు. (న్యూట్రల్‌గా ఉండే మీడియా ఇచ్చిన ఆధారాలను బట్టే నేను విషయాలు తెలియజేస్తున్నాను) విపక్షాలు గెలిచినచోట డబ్బులు ఎగజల్లి అధికారం స్వంతం చేసుకోవడం అధికార బీజేపీకి మామూలై పోయింది. ఒక రకంగా అదీ అవినీతే. అన్నన్ని డబ్బులు ఎలా వెదజల్లుతున్నారంటే ఇదిగో ఇలా ప్రజలకు తెలియకుండా ప్రజల సొమ్ము స్వాహా చేస్తున్నారన్నమాట! బ్యాంకులు దోపిడీ చేసి లక్షల కోట్లు కొల్లగొట్టుకుపోయిన గుజరాత్‌ దొంగల్ని దేశం దాటించడం తర్వాత రుణమాఫీ పేరుతో అవన్నీ మాఫీ చేయడం బీజేపీ ప్రభుత్వపు అవినీతి కాదా? బీజేపీ పార్టీ ఒక ‘వాషింగ్‌ మిషన్‌’ అని అందులో వేసి ఉతుక్కుంటే ఎంతటి వారైనా నీతిమంతులుగా, పని మంతులుగా తయారై వచ్చి దేశ భక్తులవుతారని ఆ పార్టీ చెప్పుకుంటుంది. అదే విధంగా ఈడీ బెదిరింపులకు లొంగి బీజేపీకిి లొంగి అందులో చేరిపోయిన వారెం దరూ? అజిత్‌పవార్‌, యడ్యూరప్ప, జ్యోతిరాధిత్య, సిధియా, సుమేందు అధికారి, హిమంత బిశ్వశర్మ, ముకుల్‌ రారు, ప్రపుల్‌ పటేల్‌, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, రమేశ్‌ పోఖ్రియాల్‌ -లాంటి వారు ఒకప్పుడు అవినీతిపరులు. బీజేపీలో చేరాక ఇప్పుడు నీతిపరుల య్యారు. ఇదంతా బీజేపీ ఆరెస్సెస్‌ – మోడీ ప్రభుత్వపు అవినీతి కాదా?
అర్హులైన వారికి ఇవ్వాల్సిన పెన్షన్‌ డబ్బును అక్రమంగా మళ్లించి – ప్రభుత్వ ప్రకటనలకు వాడుకున్నారని సిఎజి రిపోర్టు చేసింది. 2019 ఎన్ని కలకు ముందు పెద్ద పెద్ద హోర్డింగ్‌లకు, పేపర్‌, టి.వి. ప్రకటనలకు వాడుకుంది వృద్ధులకు, వికలాంగులకు, రిటైరయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడం కన్నా- తమ ప్రభుత్వ ప్రకటనలే ముఖ్య మను కుంది – బీజేపీ కేంద్ర ప్రభుత్వం! మరో విషయమేమంటే ‘బిజినెస్‌ లైన్‌’ పత్రిక 31 జులై 2023న హర్యానా – ఫరీదాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌కు సంబంధించిన ఒక స్కాంపై సవివరమైన వ్యాసం ప్రచురించింది. 2015 – 2020 మధ్యకాలంలో వేర్వేరు పనులకు సంబంధించిన చెల్లింపులు కేవలం ఒకే ఒక్క కాంట్రాక్టర్‌కు చెల్లించారు. నియమ నిబంధనలకు నీళ్లొదిలి, కండ్లు మూసుకుని అదే ఫరీదాబాద్‌కు చెందిన బీజేపీ సపోర్టరయిన సత్‌బీర్‌సింగ్‌ అనే కాంట్రాక్టర్‌కు 5వేల వోచర్ల ద్వారా విడతల వారిగా రూ.వందకోట్ల పైచిలుకు డబ్బు చెల్లించారు. అక్కడేమైనా అభివృద్ధి జరిగిందా అంటే అదీ లేదు.అంతా పేపర్‌ మీదే ఉంది. ఆ కాంట్రాక్టర్‌ ద్వారా డబ్బంతా బీజేపీ అగ్ర నాయకులకు చేరిందని ప్రత్యేకంగా ఊహించనక్కర లేదు. మోడీ ప్రభుత్వంలో అవినీతి జరగలేదనీ, జరగడం లేదనీ కాదు- మీడియా ప్రజలకు చెప్పడం లేదు- అంతే!!
కోవిడ్‌ సమయంలో చూశాం. దేశ ప్రజలకు ఈ బీజేపీ ప్రభుత్వం కల్పించిన రక్షణ ఏమీలేదు. పైగా తమది నిజాయితీ గల ప్రభుత్వమని అగ్రనాయకులే ప్రచారం చేసుకుంటున్నారు. గ్యాసు, పెట్రోలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. టాక్స్‌లు విపరీతంగా పెరిగాయి. ‘హంగర్‌ ఇండెక్స్‌’లో దేశం అట్టడుగున ఉంది. మత కలహాలు చెలరేగే దేశాల జాబితాలో పైస్థానం ఆక్రమించింది. రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. రామాలయం పేరుమీద దాని చుట్టూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ ఒక్కొక్కటి బయటికి వస్తోంది. యువత అధికంగా ఉన్న దేశం మనది. అందుకే దేశ భవిష్యత్తు యువత నిర్ణయం మీదే ఆధార పడి ఉంది. జై శ్రీరామ్‌ నినాదం ఎవరికీ తిండిపెట్టదు. కూడు గుడ్డానివ్వదు. మోడీ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టుకుని యువత బయటపడాలి! ఒకప్పుడు ఈస్ట్‌ ఇండియా కంపెనీని తన్ని తగలేసినట్టే ఇప్పుడు ఈ నార్త్‌ ఇండియా కంపెనీని కూడా వదిలించుకోవాలి. ప్రాథమిక హక్కుల్ని హరిస్తూ, రాజ్యాంగస్ఫూర్తిని ధ్వంసం చేస్తున్న అవినీతి బీజేపీ ప్రభుత్వం అవసరమా?ఈ దేశ పౌరులు తక్షణం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
– సుప్రసిద్ధ సాహితీ వేత్త, జీవశాస్త్ర వేత్త
(మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love