మద్యంపై రాజకీయపక్షాల దారెటు?

మద్యంపై రాజకీయపక్షాల దారెటు?మన రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు అయ్యాయి. మరి కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ప్రజలను ఏడిపిస్తున్న మద్యం సమస్య మీద ఆయా రాజకీయ పార్టీల వైఖరి మాత్రం ఎటూ తేల్చకుండానే ఉన్నట్టు కనిపిస్తోంది. మద్యాన్ని నియంత్రించడానికి, తాగుడు తగ్గించడానికి, పేదరికం నుండి బయటపడేందుకు, ఆరోగ్యాన్ని కాపాడేందుకు, నేరాలు తగ్గించేందుకు, మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, రాజకీయ పక్షాలు ఆలోచిస్తాయా? లేక ప్రజల్ని పీడించి మరింత లాభాలను సంపాదించుకునే ప్రయత్నం చేస్తాయా? మద్యం సమస్య మీద అనేక అధ్యయనాలు జరిగాయి, జరుగుతున్నాయి. మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి తాగుడు అలవాటు ఉందట. దీనిని కనీసం రెట్టింపు చేయడం ద్వారా తమ లాభాలను రెట్టింపు చేసుకోవచ్చని బహుళజాతి కంపెనీలు, దేశీయ కంపెనీలు ప్రయత్నం చేస్తున్నాయి. తమ మార్కెట్‌ను పెంచుకునేందుకు వివిధ రూపాల్లో దొంగ చాటుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇక ప్రజల ఓట్లతో అధికారంలోకి వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం అమ్మకాల ద్వారా తమ బహుళ ప్రయోజనాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజలు నుండి ఒత్తిడి వచ్చినప్పుడు వాటిని తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు నటిస్తున్నాయి. అక్కడో ఇక్కడో కొన్ని మినహాయింపులు తప్ప! మద్యపానం వల్ల జీడీపీలో 1.45 శాతం ఆర్థికంగా దేశం నష్టపోతుందని ఇటీవల వచ్చిన ఒక అధ్యయనం తెలియజేసింది. మొత్తం బడ్జెట్‌లో ఆరోగ్యం కోసం కేటాయిస్తున్నది 1.1 శాతం మాత్రమే! అంటే ఆరోగ్య సంరక్షణకు కేటాయిస్తున్న దాని కంటే మద్యం తాగడం వల్ల దేశం ఆర్థికంగా నష్టపోతున్నది ఎక్కువ. దీనితో పాటుగా ప్రజల ఆరోగ్యం క్షీణించడంలో, పేదరికం పెరగడంలో, హింస పెరగడంలో కూడా దీని ప్రభావం ఎంత ఉందో ఈ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్యం తాగడాన్ని తగ్గించడానికి అన్ని చర్యలు చేపట్టాలని సూచన చేసింది. ధరలు పెంచడం ద్వారా మద్యం తాగుడును నిరుత్సాహపరచాలని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది.
1990 నుండి 2017 వరకు 189 దేశాల్లో మద్యం ఎంత తాగుతున్నారు, దాని ప్రభావం ఎంత ఉందని ఇటీవల ఒక అధ్యయనం చేశారు. మన దేశంలో ఈ కాలంలో 38 శాతం తాగడం పెరిగిందని తేలింది. అంతే కాదు, తాగుతున్న మోతాదు కూడా పెరిగింది. మన దేశంలో గతంలో ఏడాదికి ఒక వ్యక్తి 4.3 లీటర్ల లిక్కర్‌ తాగేవాడు. ఇప్పుడు 2017 నాటికి 5.9 లీటర్ల మద్యం తాగుతున్నారు. కర్నాటక రాష్ట్రంలో సగటున ఒక మనిషి తొమ్మిది లీటర్లు తాగుతున్నారు. కేరళలో ఎన్‌.హెచ్‌.ఎఫ్‌.ఎస్‌-4, 2015-16 సర్వే ప్రకారం 37 శాతం పురుషులకు 1.6 శాతం మహిళలకు మద్యం తాగే అలవాటు ఉండగా ఎన్‌.హెచ్‌. ఎఫ్‌ ఎస్‌-5, 2019- 20 సర్వే ప్రకారం 19.9 శాతం పురుషులు, 0.2 శాతం మహిళలు (సగటున 9.4 శాతం) తాగుతున్నట్లు తేలింది. అంటే గణనీయంగా తగ్గింది. పశ్చిమ బెంగాల్‌లో తాగుడు చాలా ఆందోళనకరంగా పెరిగిందని పేర్కొన్నారు. 29 శాతం మంది తాగుతుండగా చిన్నపిల్లల్లో నాలుగు శాతం తాగుతున్నారట. మన రాష్ట్రంలో 11.5 శాతం (15-49 వయస్సులో పురుషులు 31.2 శాతం) జనం తాగుతూ ఉండగా జాతీయ సగటు 9.9 శాతం (మగవాళ్లు 22 శాతం) ఉంది. బీహార్‌లో 1.7 శాతం మంది మాత్రమే ప్రస్తుతం తాగుతున్నారు. ఈ వివరాలు చూసినప్పుడు దేశవ్యాప్తంగా తాగుడు అలవాటు ప్రజలందరిలో ఒకే విధంగా లేదు. ఆయా రాష్ట్రాల్లో లిక్కర్‌ కంపనీలు, మాఫియా, అందుకు సహకరించే ప్రభుత్వాలు లిక్కర్‌ పెంపుదలకు ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి.
కేరళలో ”విముక్తి” పేరుతో తాగుడికి వ్యతిరేకంగా కుడుంబశ్రీ, ఆరోగ్య శాఖ కలిసి ఒక విస్తృతమైన ప్రచారం చేపట్టాయి. అందులో మహిళలు, యువకులు ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు. ఆ రాష్ట్రంలో 2016లో ఒక విధానంగానే 730 బార్లను మూసివేయడం జరిగింది. బీహార్‌, గుజరాత్‌, నాగాలాండ్‌, లక్షద్వీప్‌లలో మద్యనిషేధం ఉంది. గుజరాత్‌ గిఫ్ట్‌ సిటీలో ఇటీవల మద్యాన్ని అనుమతించారు.
ఆనాడు మహిళలు వ్యక్తం చేసిన నిరసన ఫలితంగా బీహార్‌లో 2016 ఎన్నికలవేళ నితీష్‌ కుమార్‌ మద్య నిషేధం హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత కఠినంగా అమలు చేశారు. ఫలితంగా భారీగా తాగే వారి సంఖ్య తగ్గడానికి కారణమైంది. అందుకు భిన్నంగా పశ్చిమ బెంగాల్‌లో అమెజాన్‌, బిగ్‌ బాస్కెట్‌ కంపెనీల ద్వారా హోమ్‌ డెలివరీ ప్రవేశపెట్టారు. చిన్న చిన్న పాకెట్లు, చిన్న సీసాలలో ప్యాకేజీ ద్వారా చేయడం కూడా విస్తరించడానికి కారణమైంది. భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 47లో మద్య నియంత్రణ లక్ష్యంగా ప్రకటించింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు రూపొందించి అమలుచేయాలి. కానీ బహుళజాతి కంపెనీలతో సంబంధాలే కేంద్ర ప్రభుత్వానికి ప్రధానం అయ్యాయి. లాభాల కోసం స్వదేశీ, విదేశీ పొత్తులతో మురిసిపోతున్నారు. పాలకుల మద్దతుతో మద్యం వ్యాపారం విస్తరిస్తున్నది. మద్యం ద్వారా ఆదాయం లేకపోతే ప్రభుత్వాలు ఎలా నడుస్తాయంటూ జనాన్ని నమ్మించ చూస్తున్నారు.
కోవిడ్‌ కాలంలో మద్యం షాపులు లేవు. నూటికి 90 శాతం జనం తాగడం మానేశారు. బతుకు సాగలేదా? జైలులో మందు దొరకదు కదా? తాగకుండానే ఉన్నారు. అయితే ఈ మందు అవసరం ఎవరికి? లాభాలు ఆశించే వారికి. అందుకే మోడీ ప్రభుత్వం కోవిడ్‌ సమయంలో పాఠశాలలు తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. కానీ మద్యం షాపులను తెరవడానికి అనుమతించింది. మహమ్మారిగా మారిన మద్యాన్ని నియంత్రిస్తేనే జనానికి ఆరోగ్యం. నేరాలు తగ్గిం చేందుకు వీలవుతుంది. కుటుంబాలు, ఆ కుటుంబంలో పిల్లలు ఒకరికి మరొకరుగా బతుకు బండి నడుస్తుంది. పేదరికాన్ని ఎదిరించే శక్తి వస్తుంది. ఎన్నికల సందర్భంగా మహిళలు మరోసారి ఆవేదనతో ఆగ్రహంతో గళమెత్తుతున్నారు. మద్య నియంత్రణ చేయలేనివారికి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత ఉందా అన్నది వారి ప్రశ్న!
– డి. రమాదేవి

Spread the love