హ‌థ్రాస్ లో ఘోరం

Bad in Hathras– తొక్కిసలాటలో వందమందికి పైగా మృతి
– నిండు ప్రాణాలు బలిగొన్న సత్సంగ్‌
– ఉత్తరప్రదేశ్‌లో విషాదం
– రాష్ట్రపతి సహ పలువురి దిగ్భ్రాంతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటు చేసుకుంది. హథ్రాస్‌లో నిర్వహిం చిన ఒక ఆధ్యాత్మిక సత్సంగ్‌ (ప్రార్థనా శిబిరం) కార్యక్రమంలో నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో జరిగిన తొక్కిసలాటలో వందమందికిపైగా మరణించారు. 200 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఘటనా స్థలంలో ఎటుచూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపించాయి. గుండెలవిసే రోదనలతో పరిసర ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రశాంత వాతావారణంలో సాగాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిర్వాహకులు, ప్రభుత్వ యంత్రాంగ ఘోర వైఫల్యం వల్ల మృత్యువు విలయతాండవం చేసింది. సాంత్వన కోసం పరితపించి వచ్చిన నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
హథ్రాస్‌ : హథ్రాస్‌ జిల్లా సికందర్‌ రావు పోలీసు స్టేషన్‌ పరిధిలోని పులారి గ్రామంలో స్థానిక గురువు గౌరవార్ధం ఏర్పాటు చేసిన సత్సంగ్‌ (ప్రార్ధనా సమావేశం) సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాట పెనువిషాదానికి దారితీసింది. వందమందికి పైగా నిండు ప్రాణాలు కోల్పోగా, సుమారు రెండువందల మందికిపైగా క్షతగాత్రులయ్యారని ఇటా సీనియర్‌ ఎస్పీ రాజేష్‌ కుమార్‌ తెలిపారు. వచ్చిన జనం వెళ్ళిపోవడానికి ప్రయత్నించిన సమయంలో ఈ తోపులాటలు, తొక్కిసలాట చోటు చేసుకుందని ఈ కార్యక్రమానికి హాజరైన ఒక మహిళ తెలిపారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో జరిగిన ఈ భయానక సంఘటనకు సంబంధించిన దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. మృతదేహా లను బస్సుల్లో, టెంపోల్లో తరలిస్తున్నారు. ఇటా ఆస్పత్రికి ఇప్పటివరకు 27 మృత దేహాలను తీసుకువచ్చారు. వీరిలో 23 మంది మహిళలు కాగా, ముగ్గురు పిల్లలు, ఒక పురుషుడు వున్నారని ఎస్‌పి విలేకర్లకు తెలిపారు. ఈ సత్సంగ్‌ కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని, జనాలు కిక్కిరిసి రావడంతో తొక్కిసలాట జరిగిందని ఎస్‌పీ చెప్పారు. కాగా ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆగ్రా అదనపు డీజీపీ, అలీగఢ్‌ కమిషనర్‌ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ దారుణ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రభృతులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అక్కడి దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుం బాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ తీవ్ర విషాద ఘటన పట్ల సీపీఐ(ఎం) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి విషాదం చోటుచేసుకున్నదని, ఇకనైనా తగిన ప్రొటోకాల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సామాజిక మాధ్యమాల్లో సీపీఐ(ఎం) పోస్టు చేసింది. ఇంతటి ఘోరం జరిగినా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘటనాస్థలానికి వెళ్లలేదు. బాధితులకు తగిన సహాయం అందించాలంటూ సామా జిక మాధ్యమాల ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఆయన చేతులు దులిపేసుకున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఎవరీ బాబా? 
ఇటా జిల్లా పాటియాలి తహసల్‌కు చెందిన బహదూర్‌ గ్రామానికి చెందిన భోలే బాబా గతంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో ఉద్యోగిగా పనిచేసినట్టు చెబుతారు. 26 ఏండ్ల క్రితమే ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మతపరమైన సత్సంగాలు ప్రారంభించారు. ఆయనకు వెస్ట్రన్‌ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. మోడ్రన్‌ బాబాల మాదిరిగా కాకుండా బోలో బాబా సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటారు. బోలో బాబా సత్సంగ కార్యక్రమాలు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ప్రతి మంగళవారం నిర్వహిస్తుంటారు. వీటికి పెద్ద సంఖ్యలో జనం హాజరవుతుంటారు. అయితే మంగళవారం వారిని మృత్యువు వెంటాడుతుందని ఊహించలేదు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. పోస్టుమార్టం నిర్వహించే ఆస్పత్రుల వద్ద కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన బంధుమిత్రుల అరణ్యరోదనలు మిన్నంటుతున్నాయి.

Spread the love