– సృజనాత్మకత, నైపుణ్యత పెంపునకు మెళకువలు
– సంగీతం, చిత్రలేఖనం వంటి వాటికి ప్రోత్సాహం
– పిల్లల్లో ఉల్లాసం నింపుతున్న సమ్మర్ క్యాంపులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
చదువుల్లో రాణిస్తే చాలు. ర్యాంకులు వస్తే తమ పిల్లల కన్నా గొప్పొళ్లు లేరు. తమలాగా పిల్లలను బాగా చదివించే తల్లిదండ్రులు లేరు… అనే భావన సర్వత్రా వ్యాపించింది. అదే సమయంలో పిల్లలను పుస్తకాల పురుగులుగా మారుస్తుంటే వారి సహజసిద్ధమైన వికాసం ఆగిపోతుందని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసం కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. దానికి భిన్నంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో విద్యా సంవత్సరమంతా పుస్తకాలతో కుస్తీ పట్టించింది…సరిపోదన్నట్టు వేసవి, ఇతర సెలవుల్లోనూ ప్రత్యేక తరగతులు, ట్యూషన్లంటూ వారిపై భారం మోపుతున్నారు. కొంత మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర యాక్టివిటీస్‌లో ప్రోత్సహిద్దామని భావించినప్పటికీ, కళలు, క్రీడలంటూ వేలాది రూపాయలను ఫీజు అడుగుతుండటంతో పేద తల్లిదండ్రులకు అవి భారంగా మారాయి.
ఇలాంటి వారి కోసం 1960వ దశకంలోనే నాటి ప్రభుత్వం హైదరాబాద్‌లో రాష్ట్రస్థాయిలో జవహర్ బాలభవన్‌తో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో జిల్లాకొకటి చొప్పున బాల కేంద్రాలను ఏర్పాటు చేసింది. పబ్లిక్ గార్డెన్‌లో విశాలమైన ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ భవనంలో పిల్లల కేరింతలు వినిపిస్తుంటాయి. బాలభవన్, బాల కేంద్రాల్లో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, జానపదం, శాస్త్రీయ విజ్ఞానం, హస్తకళలు, గ్రంథాలయం తదితర అంశాలుండటంతో పిల్లలు ఉల్లాసంగా పాల్గొంటున్నారు. బాలభవన్‌లో ప్రభుత్వ, గురుకుల, మోడల్, వికలాంగులకు సంబంధించిన పాఠశాలలకు చెందిన చిన్నారులు ఆయా ప్రక్రియల్లో శిక్షణ పొందుతున్నారు. ఏడాదికి రూ.50 నామమాత్రపు రుసుం చెల్లిస్తే సరిపోతుంది.
ఇక్కడి ప్రక్రియల్లో తొలి అడుగులు వేస్తున్న చిన్నారులు అక్కడితో ఆగిపోవడం లేదు. వాటిలో మరిన్ని మెళకువలను నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. విద్యాసంవత్సరంలో చదువులకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజులను ఉపయోగించుకోవడంతో పాటు వేసవిలో పూర్తి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆయా ప్రక్రియల్లో శిక్షణ పొందిన వారు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మంచి ఉద్యోగవకాశాలను పొందడం గమనార్హం. ఈ వేసవి సెలవుల్లో కూడా శిక్షణ పొందుతున్న చిన్నారులతో బాలభవన్ కళకళలాడుతున్నది. అయితే ప్రభుత్వ ఉదాసీనత, నిధుల కొరత, సిబ్బంది లేమి, అరకొర వసతులు ఇటు హైదరాబాద్‌లోని జవహర్ బాలభవన్‌తో పాటు అటు జిల్లాల్లోని బాల కేంద్రాలను వేధిస్తున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ మరింత పెరగాల్సిన అవసరముంది.
ప్రతిపాదనలు పంపించాం….రమణకుమార్
జవహర్ బాలభవన్ అభివృద్ధికి ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించినట్టు ఆ సంస్థ డైరెక్టర్ రమణకుమార్ తెలిపారు. అవి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు వెల్లడించారు. పిల్లల్లో మానసిక వికాసానికి ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. సృజనాత్మకతకు ఉపయోగపడుతున్న కళలు, క్రీడల్లో పిల్లలను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఆసక్తిని గుర్తించాలి…..కప్పారి కిషన్
పిల్లలు ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నారనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించి ప్రోత్సహించాలని క్రియేటివ్ ఆర్ట్ సెక్షన్ ఉపాధ్యాయులు కప్పారి కిషన్ సూచించారు.
ఆసక్తి, పిల్లల్లో లేని ప్రతిభకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాలని బలవంతంగా చేయడం సరికాదన్నారు.
బాలభవన్‌లో ఆయా అంశాలు ఆసక్తితో నేర్చుకున్న పిల్లలు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో విజేతలుగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.