నవతెలంగాణ – హైదరాబాద్
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. కోస్టియాంటినవ్కా నగర మార్కెట్‌పై బుధవారం దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం కీవ్ నగరాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే రష్యా ఈ దాడులకు పాల్పడింది. కాగా, ఈ దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. పౌర ప్రాంతాలపై ఉద్దేశపూర్వకంగానే రష్యా దాడి చేసి ప్రాణనష్టం కలిగించిందని ఆరోపించారు. మరోవైపు రష్యా దాడిలో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే యుద్ధానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేసింది. తాజాగా 120ఎంఎం యురేనియం ట్యాంక్ రౌండ్లను సరఫరా చేసేందుకు అంగీకరించింది. వీటిని ఎం1 అబ్రామ్స్ ట్యాంకుల్లో వాడనున్నారు. అయితే ఈ ఏడాది చివరకు వరకు ఈ ఆయుధాలను ఉక్రెయిన్‌కు చేరవేయనున్నారు. ఆంటోనీ బ్లింకెన్ ఉక్రెయిన్‌లో పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది.