తెలుగు సాహిత్యంలో సామాజిక వాస్తవాలను ప్రతీకల ద్వారా ఆవిష్కరించే రచనలు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని సంపాదించుకున్నయి. ఆ కోవలో కె.వి. నరేందర్ రచించిన “బర్రె” నవల సమకాలీన తెలుగు సాహిత్యంలో ఒక విశిష్టమైన సామాజిక-రాజకీయ రూపకంగా నిలుస్తది. ఈ నవల కేవలం ఒక జంతువు జీవితాన్ని చిత్రించే కథ మాత్రమే కాదు; అణచివేతకు గురైన వర్గాల అస్తిత్వ వేదనను, గుర్తింపు కోసం సాగుతున్న వారి నిరంతర పోరాటాన్ని ప్రతిబింబించే సాహిత్య వాచకం. బర్రెను కేంద్ర ప్రతీకగా తీసుకున్న రచయిత, సమాజంలో బలంగా పాతుకుపోయిన వర్ణ వివక్ష, సామాజిక అసమానతలు, దళిత-బహుజన అస్తిత్వ సమస్యలు, ఆధిపత్య రాజకీయాల స్వరూపాన్ని ప్రశ్నాత్మకంగా ఆవిష్కరించాడు.
డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించినట్లుగా, సామాజిక సమానత్వం లేకుండా ఏ ప్రజాస్వామిక వ్యవస్థా సంపూర్ణం కాలేదు. ఆ భావనకు సాహిత్య రూపంగా “బర్రె” నవలను చూడవచ్చు. బర్రె అనుభవాల ద్వారా సమాజంలో కనిపించే వివక్షా నిర్మాణాలను వెలికితీస్తూ, సమానత్వం, గౌరవం, గుర్తింపు వంటి అంశాల చుట్టూ రచయిత ఒక గంభీరమైన సామాజిక చర్చను ముందుకు తెచ్చనవల ఆరంభం నుంచే బర్రెను రచయిత ఒక సాధారణ జంతువుగా కాకుండా, చైతన్యవంతమైన అస్తిత్వంగా చిత్రించాడు. అది ఆలోచిస్తది, ప్రశ్నిస్తది, తన ఉనికి గురించి అంతర్మథనం చేసుకుంటది. “ఆవు తెల్లగా ఉందని దేవతగా పూజిస్తరు; నేను నల్లగా ఉన్నానని ఎందుకు చిన్నచూపు చూస్తరు?” అనే బర్రె ప్రశ్న నవల యొక్క కేంద్రీయ భావాన్ని ప్రతిబింబిస్తది. అదే విధంగా “పాలు రెండూ తెల్లగానే ఉంటయి… మరి గౌరవం మాత్రం ఎందుకు వేరుగా ఉంటది?” అనే ప్రశ్న ద్వారా రచయిత జంతువుల మధ్య కనిపించే వ్యత్యాసాన్ని మాత్రమే కాకుండా, సమాజంలో నిర్మితమైన కుల, వర్ణ, వర్గ ఆధారిత వివక్షల స్వరూపాన్ని కూడా ఆవిష్కరించాడు. ఈ ప్రశ్నలు బర్రె వ్యక్తిగత ఆవేదనను దాటి సామాజిక విమర్శగా రూపాంతరం చెందుతయి. ఫలితంగా బర్రె స్వరం అణగారిన వర్గాల సమిష్టి అనుభవాలకు ప్రతినిధిగా నిలుస్తూ, సామాజిక అసమానతలపై పాఠకుడిని విమర్శనాత్మకంగా ఆలోచించే దిశగా నడిపిస్తది.
బర్రె పాత్ర ఈ నవలలో ఒక ప్రతీక. అది దళితుడి బాధ, బహుజనుడి ఆవేదన, అణగారిన వర్గాల అస్తిత్వ పోరాటానికి ప్రతినిధిగా నిలుస్తుంది. ఆవును “గోమాత”గా ఆరాధించే సమాజం, బర్రెను మాత్రం పాలిచ్చే యంత్రంగా చూడడం ద్వారా రచయిత ఆధిపత్య వర్గాల ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేశాడు. బర్రె అడిగే ప్రశ్నలు చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ అవి మనసును లోతుగా తాకుతాయి. “ఆవు ఇచ్చేది పాలు… నేను ఇచ్చేది కూడా పాలు… మరి దానికి గౌరవం, నాకు నిర్లక్ష్యం ఎందుకు?” అని అది ప్రశ్నించినప్పుడు, మనకు ఒక్కసారిగా సమాధానం చెప్పలేని స్థితి వస్తుంది. “మాకు ఒక ఉనికి కావాలి, ఒక గుర్తింపు కావాలి” అని బర్రె చేసే ఆర్తనాదం వాస్తవానికి ఈ దేశంలో సమానత్వం కోసం పోరాడుతున్న ప్రతి అణగారిన మనిషి స్వరం.
ఈ నవలలో బర్రె చేసే పాదయాత్ర ఎంతో ప్రతీకాత్మకమైనది. అది కేవలం ప్రయాణం కాదు — స్వీయ అవగాహన కోసం, సమాజ సత్యాలను తెలుసుకోవడానికి చేసిన అస్తిత్వ యాత్ర. మార్గమధ్యంలో కలిసే లస్మవ్వ, ఎర్రావు, కర్రావు, గంగిరెద్దు వంటి పాత్రలు సమాజంలోని విభిన్న బాధలను మన ముందుంచుతాయి. ప్రతి పాత్ర వెనుక ఒక వర్గం, ఒక జీవన వాస్తవం, ఒక అణచివేత చరిత్ర దాగి ఉంది.
ఎర్రావు, కర్రావు, గంగిరెద్దు కథలు నవలకు మరింత జీవం తెస్తాయి. ప్రతి జీవి వెనుక ఒక బాధ ఉంది. ప్రతి నవ్వు వెనుక ఒక గాయం ఉంది. గంగిరెద్దును చూసి చిన్నప్పటి నుంచి అలంకరించుకోవాలని అనుకున్న బర్రె, దాని నిజమైన జీవితం తెలుసుకున్నప్పుడు చాలా మౌనంగా మారిపోతుంది. బయట కనిపించే రంగుల వెనుక ఎంత నొప్పి దాగి ఉంటుందో అర్థం చేసుకుంటుంది.
లస్మవ్వ పాత్ర ద్వారా మనిషి-జంతువు అనుబంధంలోని మానవత్వాన్ని చూపిస్తే, గంగిరెద్దు కథ ద్వారా వినోదం పేరుతో జరుగుతున్న దోపిడీని రచయిత బహిర్గతం చేశాడు. కర్రావు కథలో మనుషుల మూఢనమ్మకాల వెనుక దాగిన హింస కనిపిస్తుంది. ఈ పాత్రలన్నీ కలిపి నవలను ఒక సామాజిక పటంగా నిలబెడతాయి.
లారీ నుంచి దూకి బయటపడిన తర్వాత బర్రె ప్రపంచాన్ని చూడాలని నిర్ణయించుకోవడం ఎంతో హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఈ నవలలో బర్రె చేసే పాదయాత్ర చాలా అందమైన ప్రతీక. అది కేవలం ఒక ప్రయాణం కాదు. తనని తాను అర్థం చేసుకోవాలనే ప్రయత్నం. “మా జాతి తప్పేంటి?” అనే ప్రశ్నకు సమాధానం వెతికే ఆరాటం. తన యజమాని చేతిలో అవమానాలు అనుభవించి, చివరకు అమ్మబడిపోతున్నప్పుడు బర్రె గుండెల్లో కలిగే బాధ పాఠకుడికీ చేరుతుంది. ప్రేమతో పెంచిన జీవిని కూడా ఒక వస్తువులా అమ్మేయగల మనిషి స్వభావం అక్కడ కనిపిస్తుంది.
ఈ నవలలో రచయిత తన భావాలను ఎంతో మృదువుగా, ప్రభావవంతంగా వ్యక్తీకరించాడు. ఆయన ఎక్కడా ఆవేశంగా మాట్లాడడు, ఎవరినీ నేరుగా విమర్శించడు. అయినప్పటికీ ప్రతి సంఘటన పాఠకుడి మనసులో లోతైన ప్రశ్నలను రేకెత్తిస్తుంది. “ఎందుకు ఇలా జరుగుతోంది?” అనే ఆలోచనను సహజంగా కలిగించడం ఈ నవల యొక్క ప్రధాన ప్రత్యేకత.
“గోమాత” పేరుతో ఆవులకు గౌరవం ఇచ్చే సమాజం, అదే పాలను ఇచ్చే బర్రెల గురించి ఎందుకు మాట్లాడదనే ప్రశ్న ద్వారా రచయిత సామాజిక ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేశాడు. గోవులను పవిత్రంగా చూసే మనుషులు, బర్రెల బాధను మాత్రం ఎందుకు గుర్తించరనే ప్రశ్న పాఠకుడి మనసులో తీవ్ర ఆవేదనను కలిగిస్తుంది. ఈ ప్రశ్నలు కేవలం జంతువుల గురించే కాదు; సమాజంలో ఉన్న కుల, వర్గ వివక్షల గురించినవిగా కూడా భావించవచ్చు.
నవల ముగింపులో వినిపించే బర్రె గాండ్రింపు కేవలం ఒక జంతువు అరుపుగా మిగలదు; అది ఎన్నాళ్లుగానో అణచివేయబడిన అస్తిత్వాల సమిష్టి ఆర్తనాదంగా రూపాంతరం చెందుతుంది. సమానత్వం, గుర్తింపు, గౌరవం కోసం సాగుతున్న పోరాటానికి అది ప్రతిధ్వనిగా నిలుస్తుంది. ఈ సందర్భంలో మహాకవి జాషువా సాహిత్యంలో వ్యక్తమైన అణగారిన వర్గాల వేదనను స్మరించుకోవచ్చు. బర్రె స్వరంలో కూడా అదే సామాజిక బాధ, అదే అస్తిత్వ ఆందోళన, అదే గుర్తింపు కోసం తపన వ్యక్తమవుతాయి. అందువల్ల ఈ నవల పాఠకుడిని కేవలం కథానుభూతికే పరిమితం చేయకుండా, సమాజంలోని అసమానతలను విమర్శనాత్మకంగా పరిశీలించే దిశగా నడిపిస్తుంది.
ఈ నవలలో తెలంగాణ యాస వినియోగం కథకు ప్రత్యేకమైన జీవాన్ని ఇచ్చింది. ముఖ్యంగా జగిత్యాల ప్రాంత భాషలో వచ్చే సంభాషణలు ఎంతో సహజంగా, ఆప్యాయంగా అనిపిస్తాయి. ఆ మాటల్లో గ్రామీణ జీవితం యొక్క నిజాయితీ కనిపిస్తుంది. నేల వాసన, ప్రజల భావోద్వేగాలు, వారి కష్టాలు, ప్రేమ, ఆవేదనలు అన్నీ ఆ భాష ద్వారా మరింత బలంగా పాఠకుడికి చేరుతాయి. అందువల్ల భాష ఈ నవలలో కేవలం సంభాషణ సాధనం మాత్రమే కాదు; కథ యొక్క ఆత్మగా మారింది. పాఠకుడు నవలను చదువుతున్నట్టుకాకుండా, ఆ గ్రామంలోనే తిరుగుతున్నట్టుగా అనుభూతి చెందుతాడు.
ఈ నవల చదివిన తర్వాత పాఠకుడికి బర్రె మీద జాలి మాత్రమే కలగదు; తన ఆలోచనల మీద కూడా ఒక ప్రశ్న మొదలవుతుంది. “మనము ఎవరిని గౌరవిస్తున్నాం? ఎవరిని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నాం?” అనే ప్రశ్నలు మనసులో మళ్లీ మళ్లీ తలెత్తుతాయి. ఈ ప్రశ్నలు కేవలం జంతువుల గురించే కాదు; మనుషుల మధ్య ఉన్న వివక్షల గురించీ ఆలోచింపజేస్తాయి. అదే ఈ నవల యొక్క అసలైన గొప్పతనం.
ఈ నవలలో బర్రె కేవలం మాట్లాడే జంతువు కాదు; సమాజం వినకుండా వదిలేసిన స్వరాలకు ప్రతీక. దాని ప్రతి ప్రశ్న వెనుక ఒక వర్గం బతుకు ఉంది, ప్రతి బాధ వెనుక ఒక చరిత్ర ఉంది. రచయిత ఎక్కడా పెద్దగా నినాదాలు చేయకుండా, బర్రె అనుభవాల ద్వారానే సమాజంలో ఉన్న అసమానతలను చూపించాడు. అందుకే నవల ముగిసినా, అది లేవనెత్తిన ప్రశ్నలు మాత్రం పాఠకుడి మనసులో చాలా కాలం కొనసాగుతయి.
“బర్రె” ఒక నవల మాత్రమే కాదు. నిశ్శబ్దంగా బాధపడుతున్న జీవాల గుండె మాట. కనిపించకుండా పోతున్న అస్తిత్వాల కథ. మనిషి నిర్మించుకున్న భేదాల మీద వేసిన ప్రశ్న. చాలా మృదువుగా మనసును తాకుతూ, నెమ్మదిగా మనల్ని ఆలోచింపజేసే ఒక అందమైన సామాజిక రచన.
గాజోజి శ్రీనివాస్, 9948483560
బర్రె – అణగారిన అస్తిత్వాల ఆర్తనాదం
- Advertisement -
- Advertisement -



