Sunday, June 14, 2026
E-PAPER
Homeదర్వాజమూడో నేత్రం మూసేయ్ తండ్రీ..

మూడో నేత్రం మూసేయ్ తండ్రీ..

- Advertisement -


కాలాలు కాటేసే సర్పాలైతే
కదిలే దృశ్యాలన్నీ విగత సంకేతాలే
ఆకాశం అగ్నివర్షం కురుస్తున్నట్లుంది
భూమి నిప్పుల దుప్పటి కప్పుకున్నట్లుంది
​భానుడా..
ఎందుకీ ఉగ్ర కేళీ విన్యాసం
ఏమిటీ దగ్ధ ప్రళయ కల్లోలం
యుగాల మానవ దమన రీతికి
దహనమే సరి అయిన దండననుకుంటివా
​ఆగని నీ విలయ విస్ఫోటన తాండవంలో
విలవిలలాడుతున్నవి
చెమట కాల్వలు పారించే శ్రమజీవన శకలాలే
​కాలు బయట పెట్టొద్దన్న ప్రకటనలు
కాలే కడుపులకు పట్టని మెట్ట వేదాంతాలు
​బతుకు బండి సాగాలంటే
ఎండబండను తలపై మోయక తప్పని
బడుగు జీవుల తిప్పలు
​భుజానికో సంచి.. సంకలో ఓ సంటి బిడ్డ
వడగాలులకు తలుపులు మూసుకున్న వాడల్లోంచి
పిడచగట్టుకున్న నాలుకను తడి చేసుకుంటూ
ఆగని కేకలతో ఆమె..
‘ఎంటికలకు బోల్లిత్తం.. ఎంటికలకు బోల్లిత్తం’..
​ఏసీ లలో సేదదీరు తమకపు తనువుల చెవులకు
వినబడని విధివంచిత స్వరం
​అరిచీ అరిచీ అలసిన ఆ దేహం
నీ కోపోద్రిక్త జ్వాలాకీలలకు చిక్కి
చివరికి ఇంటికో.. మంటికో
​కూలర్ల ముందు కూర్చుంటే కూలీ దొరికేనా..
​నీ మంటల మంగులంలో
తనువులు తలాయించుకుంటూ
ధనవంతుల భవంతుల నిర్మాణాల్లో
మోడులై మాడిపోతున్న కూలీలు
​ఇటుక బట్టీలలో ఇగిరిపోతున్న ప్రాణాలు
వీధుల్లో ఒరిగిపోతున్న చిరు వ్యాపారుల దేహాలు
అన్నపు రూపాంతరమై ఆరుగాలం శ్రమిస్తూ
అసువులు బాస్తున్న అన్నదాతలు
​ఎటు చూసినా నీ ప్రళయాగ్ని కీలలకు
ఆరిపోతున్న ప్రాణ జ్యోతులన్నీ
దిక్కుమొక్కు లేని దీన దీపంతలే
​పెరిగిపోతున్న మనుషుల పాపాలకు తీర్పుగా
ప్రకోపిస్తున్నవి నీ నిరసన సెగలే అనుకున్నా..
​ఏ పాపముమూ ఎరుగని పశుపక్ష్యాదులు
మూగగా చావు కౌగిట్లోకి చేరుకుంటున్న
మౌన రోదనల మాటేమిటి?
​శాంతించు భాస్కరా..
సృష్టి స్థితిలయలు
నీ చిరు మందహాసాలు
పుడమి పులకింతలు
నీ దయాదాక్షిణ్యాలు
​నీ క్రీగంటి చూపు చాలు
మూడో నేత్రాన్ని మూసేయ్ తండ్రీ..!

గాజోజు నాగభూషణం, 9885462052

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -