– బోర్డు సంయుక్త కార్యదర్శిగా రోహన్ ఎన్నిక
ముంబయి: తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహణకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పచ్చజెండా ఊపిందని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు తెలిపారు. శనివారం ముంబయిలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశానికి హాజరైన జగన్‌మోహన్ రావు.. సంయుక్త కార్యదర్శి ఎన్నికలో పాల్గొన్నారు. గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రోహన్ దేశారుని బోర్డు సభ్యులు ఏకగ్రీవంగా సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్ని, కార్యదర్శి దేవాజిత్ సైకియ, కోశాధికారి ప్రభుతేజ్ సింగ్ భాటియాలతో పాటు జగన్‌తో పాటు హెచ్‌సీఏ ఆఫీస్ బేరర్లు దల్జీత్ సింగ్, సునీల్ అగర్వాల్‌లు భేటీ అయ్యారు. టీపీఎల్‌తో పాటు ప్రతిష్టాత్మక మోయినుద్దౌలా గోల్డ్ కప్‌ను పున ప్రారంభించేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్‌లో టీపీఎల్ నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు బోర్డు నిధులు అందించేందుకు సిద్ధంగా ఉందని జగన్ వెల్లడించారు.