మోడీ పుట్టకముందే..

మోడీ పుట్టకముందే..– నోబెల్‌కు గాంధీ పేరు పరిశీలన : ఏచూరి
– బ్రిటీష్‌ వలస దేశంగా భారత్‌ ఉన్నందునే అవార్డు ఇవ్వలేదు ఐదుసార్లు గాంధీ పేరు ప్రస్తావన
న్యూఢిల్లీ : ప్రముఖ ఆంగ్ల నటుడు బెన్‌ కింగ్స్‌లీ నటించిన ‘గాంధీ’ చిత్రం విడుదలైన తర్వాతే జాతిపిత గాంధీజీ గురించి ప్రపంచానికి తెలిసిందని ప్రధాని మోడీ మంగళవారం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం మోడీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇటీవల మోడీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల అనేక అభ్యంతరాలు, విమర్శలు వస్తున్నప్పటికీ ఖాతరు చేయని ప్రధాని మరోసారి వక్రభాష్యాలు పలికారు. దీనిపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ప్రధాని వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. తాజాగా సీపీఐ(ఎం) పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రధాని వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ‘1982లో విడుదలైన గాంధీ సినిమా తర్వాతనే ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలిసిందని మోడీ అనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మోడీ పుట్టక ముందే మహాత్మా గాంధీ పేరు ఐదు సార్లు నోబెల్‌ శాంతి బహుమతుల కోసం పరిశీలించబడింది. కానీ ఆ సమయంలో భారతదేశం బ్రిటీష్‌ వలస దేశంగా ఉన్నందున ఆయనకు ఎప్పుడూ అవార్డు ఇవ్వలేదు. జాతిపిత, మహాత్మా గాంధీ తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన తరతరాలుగా శాంతి, అహింసకు రాయబారిగా ప్రపంచ వ్యాప్తంగా కీర్తించబడ్డారు’ అని ఏచూరి తన పోస్టులో పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా… కాంగ్రెస్‌ని టార్గెట్‌ చేసిన మోడీ గాంధీజీపై ఈ వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ కాంగ్రెస్‌ హయాంలో కాంగ్రెస్‌ గాంధీని ప్రపంచానికి అందించలేకపోయిందని మోడీ వ్యాఖ్యానించారు. ప్రపంచం మొత్తానికి నెల్సన్‌ మండేలా లేదా మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌ తెలిసినట్టుగా గాంధీని ఎందుకు తెలియజేయలేదు? ఇది ఎవరి వైఫల్యం?” అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ స్పందించారు. ‘మొత్తం పొలిటికల్‌ సైన్స్‌’లో గ్రాడ్యుయేట్‌ స్థాయిలో చదివిన వ్యక్తి మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేయగలడు. యాదృచ్ఛికంగా, మోడీ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ గురించి ఓ ప్రశ్న ఉత్పన్నమౌతోంది. పొలిటికల్‌ సైన్స్‌లో తాను పట్టభద్రుడయ్యాడని చెబుతున్నారు. అయితే, తాను చదివినట్టు ఎక్కడా పట్టా లేదు’ అని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

Spread the love