– కరకట్ట భద్రతపై భద్రాద్రివాసుల ఆందోళన
– పునరావాస కేంద్రాలు కాదు శాశ్వత
– పరిష్కారం కావాలంటున్న ముంపు బాధితులు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా నమోదవుతాదని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ఇప్పటికే ఎగువ ప్రాంతాల కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాంత ప్రజల గుండెల్లో గోదావరి అలజడి మొదలైంది. ఒకవైపు తాలిపేరు ఉగ్రరూపం మరోవైపు శబరి ఎదురుపోటుకి తోడు పోలవరం ప్రాజెక్టు వద్ద కాపర్ డ్యాం నిర్మాణంతో భద్రాచలం పట్టణానికి ఈసారి వరద కష్టాలు అధికంగానే ఉంటాయని అధికారులే ఆందోళన చెందుతున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణంలోని కరకట్ట భద్రతపై పట్టణ వాసుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. 2022వ సంవత్సరంలో 75 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టంతో భద్రాచలం పట్టణం మూడు వైపుల నుండి జలదిగ్బంధంలో చిక్కుకోగా అప్పటి జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి యుద్ధ ప్రాతిపదికన సుమారు 3000 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. అప్పటికి పట్టణంలోని కరకట్ట ఏ ప్రాంతంలో ఏ పక్క కోతకు గురవుతుందోనని నాలుగు రోజులపాటు ఇటు అధికార యంత్రాంగం స్థానిక ప్రజలు నిద్ర లేకుండా గడిపిన విషయం కూడా తెలియంది కాదు. వరద పరిస్థితిని తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సైతం భద్రాచలం పర్యటనకు వచ్చి కరకట్టపై సమగ్ర నివేదికను అధ్యయనం చేసి మరమ్మతులకు వెయ్యి కోట్లను కేటాయిస్తానని హామీ ఇచ్చి ఆ పనులు ప్రారంభం కాకుండానే మారిన రాజకీయ సమీకరణలో కేసీఆర్ ఓటమిపాలు కాగా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం కరకట్ట పునర్ నిర్మాణ పనులపై దృష్టి పెట్టకపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది. ప్రధానంగా పట్టణంలోని సుభాష్ నగర్ చట్ట దిగువ అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ వద్ద ఉన్నటువంటి స్లూఈజ్‌ల వద్ద భారీగా వరద నీరు లీకయ్య ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్న అధికారులపై లోతట్టు ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పునరావాస కేంద్రాలు కాదు శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టదిగో వద్ద ఏర్పాటు చేస్తున్న మోటర్లు కొన్ని సందర్భాలలో మొరాయించడంతో రాష్ట్ర నలుమూలల నుండి రామయ్య దర్శనానికి వస్తున్న భక్తులకు గోదారమ్మతో తిప్పలు తప్పవని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
స్లూఈజ్‌ల వద్ద కట్టుదిట్టమైన రక్షణ చర్యలు ఇరిగేషన్ ఈఈ రాంప్రసాద్
భద్రాచలం పట్టణవ్యాప్తంగా 7 స్లూయిజులు ఉండగా మరొక రెండు ఎట్టపాక మండలంలో ఉన్నప్పటికీ వాటి పర్యవేక్షణ కూడా భద్రాచలం ఇరిగేషన్ అధికారులే చేపడుతున్నారు. ఇప్పటికే స్లూయిజుల మరమ్మతులతోపాటు వరద నీరు లీకై నివాస ప్రాంతాల్లోకి చేరకుండా ఉండేందుకు 20వేల ఇసుక బస్తాలనసు కూడా సిద్ధం చేశాం. అదేవిధంగా పట్టణంలోని విస్తా కాంప్లెక్స్ వద్ద 7.50 హెచ్పి మోటర్‌నుతో పాటు రెడ్డి సత్రం అశోక్ నగర్, కొత్త కాలనీ, సుభాష్ నగర్ 250 హెచ్పీ మోటాలను సిద్ధంగా ఉంచి ఎప్పటికప్పుడు ఇటు వర్షపు నీటిని గోదావరి నుండి లీకయ్య నీటిని తోడేందుకు సిద్ధంగా ఉంచాం. కూనవరం రోడ్‌లో నిర్మిస్తున్న నూతన కరకట్ట జాతీయ రహదారుల అనుమతి రాని కారణంగా నిర్మాణం పూర్తికాని నేపథ్యంలో కొంతమేరకు నీరు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ కూడా పట్టణంలోకి గోదావరి నీరు రాకుండా ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచాం. ఇరిగేషన్ సిబ్బంది కరకట్ట పరిసర ప్రాంతాలను 24 గంటల పాటు పర్యవేక్షిస్తూ పరిశీలిస్తున్నారు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం ఏజెన్సీ వాసుల గుండెల్లో గోదావరి భయం మొదలైంది. శిధిలావస్థకు చేరిన కరకట్ట భద్రతపై ఆందోళన చెందుతున్న లోతట్టు ప్రాంత ప్రజలు నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి నెలకొన్నది. 2022లో వచ్చిన వరదల భయం ఇంకా ఈ ప్రాంత ప్రజలను వెంటాడుతున్న నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యం అధికారుల నిస్సాహిత మరోసారి భద్రాచలం ఏజెన్సీకి వరద ముప్పు తప్పదని స్పష్టమవుతుంది.
అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశాం
జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో భద్రాచలం పట్టణానికి గోదావరి ముంపు పొంచి ఉన్న నేపథ్యంలో అన్ని శాఖ అధికారులను సమన్వ యం చేస్తూ విపత్కర పరిస్థితి ఎదు ర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలను పునారావాస కేంద్రాలకు తరలిం చేందుకు పట్టణ వ్యాప్తంగా 10 పునరావస కేంద్రాలను గుర్తిం చాం. ప్రధానంగా పట్టణంలోని సుభాష్ నగర్ కాలనీ, చట్ట దిగు వ అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ వంటి లోతట్టు ప్రాంతాలలో వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం.ఇప్పటికే కలెక్టర్, పీవో, ఆర్డిఓ పలుమార్లు వరదలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 17వ తారీఖున వరద ప్రాంత మండల అధికారులతో కూడా మరోసారి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నాం.
– టి.శ్రీనివాస్ భద్రాచలం తహసీల్దార్