ఢిల్లీలో భానుడి ఉగ్ర రూపం!

Bhanu's fierce form in Delhi!– 52.3 డిగ్రీలతో జాతీయ రికార్డు
– 8,300 మెగావాట్లతో విద్యుత్‌ డిమాండ్‌ కూడా రికార్డే
– నీరు వృధా చేస్తే రూ.2వేలు ఫైన్‌
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ప్రజలు బుధవారం భానుడి ఉగ్రరూపాన్ని చూశారు. మధ్యాహ్నం 2.30గంటల సమయంలో ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లో 52.3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఇప్పటివరకు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు సృష్టించిందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు వెల్లడించారు. ఢిల్లీతో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ శివారు ప్రాంతమైన ముంగేష్‌పూర్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదై ఇప్పటివరకు వున్న జాతీయ రికార్డును చెరిపివేసింది. రాజస్థాన్‌ ఎడారి ప్రాంతంలో గతంలో 51.3 డిగ్రీలుగా నమోదైంది. అప్పటికి అదే రికార్డు. ఆ రికార్డును అధిగమించి బుధవారం ఢిల్లీలో 52.3 డిగ్రీలు నమోదు కాగా, మంగళవారం వాయవ్య ఢిల్లీలో 49.9 డిగ్రీలు నమోదైంది.
అత్యధిక వేడిమితో ప్రజలు అల్లాడిపోతుండడంతో నగరంలో విద్యుత్‌ డిమాండ్‌ కూడా బాగా పెరిగింది. మరోవైపు నీటి కొరత కూడా తీవ్రంగానే వుంది. దేశ రాజధాని చరిత్రలోనే మొదటిసారిగా బుధవారం విద్యుత్‌ డిమాండ్‌ 8,300 మెగావాట్ల మార్క్‌ను దాటింది.
మరోవైపు నీటి కొరత నెలకొన్న ప్రాంతాలకు నీటి సరఫరాను పెంపొందించేందుకు గానూ చాలా ప్రాంతాల్లో నీటి సరఫరాలను సగానికి సగం తగ్గించినట్లు ఢిల్లీ జల వనరుల శాఖ మంత్రి అతిషి చెప్పారు. ఎవరైనా నీటిని వృధా చేసినట్లు వెల్లడైతే రూ.2వేల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
కారణమేంటంటే…
రాజస్థాన్‌ నుండి వీచే వేడిగాలులు మొట్టమొదటగా తాకేది ఢిల్లీ శివారు ప్రాంతాలేనని అందువల్ల ఇక్కడ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండి ప్రాంతీయ విభాగ అధిపతి కుల్‌దీప్‌ శ్రీవాత్సవ మీడియాతో చెప్పారు. అసలే వాతావరణ పరిస్థితులు అత్యంత దుర్భరంగా వున్నాయని, దానికి తోడు రాజస్థాన్‌ నుండి ఆ వేడి గాలులు కూడా తోడవడంతో ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు విలవిల్లాడిపోయాయయని చెప్పారు.
ఎలాంటి నిర్మాణాలు లేని ఖాళీ బహిరంగ ప్రదేశాల్లో రేడియేషన్‌ బాగా ఎక్కువగా వుంటుందని, నేరుగా సూర్యరశ్మి నేలను తాకడం, ఎక్కడా నీడన్నది లేకపోవడంతో ఇటువంటి ప్రాంతాలు అసాధారణమైన వేడిమిని నమోదు చేస్తాయని స్కైమెట్‌ వెదర్‌ సెంటర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ పలావత్‌ చెప్పారు. పశ్చిమ ప్రాంతాల నుండి బలమైన గాలులు వీచడం, పైగా నగర శివార్లు కావడంతో ముందుగా ఈ ప్రాంతాలు ప్రభావితమవుతాయని, విపరీతంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పారు.
వడగాడ్పులతో ఉక్కిరిబిక్కిరి
తీవ్రమైన వడగాడ్పుల గుప్పిట్లో మంగళవారం ఉత్తర, మధ్య భారతాల్లో పలు ప్రాంతాలు విలవిలలాడాయి. రాజస్థాన్‌లోని చురులో, హర్యానాలోని సిర్సాలో ఉష్ణోగ్రతలు 50డిగ్రీలు దాటాయి. చురులో 50.5, సిర్సాలో 50.3 డిగ్రీలు నమోదయ్యాయి. ఢిల్లీలో సాధారణం కన్నా ఏకంగా 9డిగ్రీలు అధికంగా నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌, నరేలా ప్రాంతాల్లో 49.9, నజఫ్‌గర్‌లో 49.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు ఐఎండి అధికారులు తెలిపారు. బంగాళాఖాతం నుండి తేమతోకూడిన గాలులు వీచడం వల్ల గురువారం నుండి కాస్త వేడి తగ్గే అవకాశం వుందని ఇంకో రెండు రోజులు పోతే వర్షాలు పడే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. రాబోయే కొద్ది రోజుల పాటు రాత్రుళ్ళు కూడా అధిక వేడి, ఉక్కపోత వుండొచ్చునని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

Spread the love