పరస్పర దూషణలు, ఆరోపణలతో బైడెన్‌, ట్రంప్‌ ముఖాముఖి

పరస్పర దూషణలు, ఆరోపణలతో బైడెన్‌, ట్రంప్‌ ముఖాముఖివాషింగ్టన్‌ : గత అధ్యక్ష ఎన్నికల్లో తీవ్ర స్థాయిలో గందరగోళం తర్వాత మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2024 ఎన్నికలకు సంబంధించి గురువారం ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ఈ చర్చలు జరిగాయి. చర్చా వేదికపైకి రాగానే కరచాలనం కూడా చేసుకోకుండానే ఇరువురు నేతలు ఆశీనులయ్యారు. దాదాపు 90 నిముషాల పాటు సాగిన చర్చ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పర ఆరోపణలు గుప్పించుకోవడంతో పాటూ తరచుగా వ్యక్తిగత దాడులకు, దూషణలకు దిగడం కనిపించింది. అమెరికా అధ్యక్షుడిగా నువ్వు పనికిరావంటే నువ్వు పనికిరావని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
అమెరికా రాజకీయాల్లో వృద్ధనేతలు ఎక్కువవుతున్న నేపథ్యంలో విధానపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడం కన్నా ఇరువురు అభ్యర్ధుల శారీరక పరిస్థితుల పట్ల ప్రజలు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించినట్లు కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇటువంటి టివి చర్చలు రియాల్టీ షోల వంటివని, విధానాల సమర్ధత గురించి లేదా ఎవరి విధానాలు ఉన్నతమైనవి అనే అంశాలపై పోటీ తక్కువగా వుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అభ్యర్ధులు అక్కడికక్కడ వ్యవహరించే తీరు ప్రాధాన్యత వహిస్తుందని అంటున్నారు.
అమెరికా ఆర్థిక విధానం, ఇమ్మిగ్రేషన్‌, సరిహద్దు అంశాలు, గర్భస్రావ హక్కులు, విదేశాంగ విధానం, ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు ఇలా విస్తృతాంశాలు చర్చకు వచ్చాయి.
అమెరికా చరిత్రలోనే అత్యంత అధ్వాన్నమైన అధ్యక్షుడు బైడెన్‌ అని ట్రంప్‌ విమర్శించగా, ట్రంప్‌ను దోషి అని బైడెన్‌ విమర్శించారు. చర్చ సందర్భంగా బైడెన్‌ చాలాచోట్ల మాట్లాడింది అస్పష్టంగా వుండి అర్ధం కాలేదు. బైడెన్‌ పనితీరుపై డెమోక్రాట్లు నిరాశ చెందారు. బైడెన్‌ కన్నా ట్రంప్‌ ఎక్కువ సేపు మాట్లాడారు. అయితే నేరుగా అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో విఫలమయ్యారు. అతిశయోక్తితో కూడిన, అబద్ధాల పుట్టలా ఆయన ప్రకటనలు వున్నాయి. ఈ చర్చ పూర్తి స్థాయిలో విఫలమైందని అనేకమంది టెలివిజన్‌ వీక్షకులు సోషల్‌ మీడియాలో విమర్శించారు. సమయం వృధా తప్ప మరేమీ లేదన్నారు. అమెరికా భవితవ్యం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మరోసారి నేతల మధ్య జరిగే ఇలాంటి చర్చల పట్ల అమెరికన్‌ ఓటర్లు ఉత్సాహంగా లేరని పలు పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. గత 30ఏళ్ళలో ఎన్నడూ లేని రీతిలో ఇరువురు అభ్యర్ధుల పట్ల కూడా ఓటర్లు వ్యతిరేకతే కలిగి వున్నారు. రెండో చర్చ సెప్టెంబరు 10న జరగనుంది.

Spread the love