Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవిద్యార్థుల భవిష్యత్తుతో ‘బీజేపీ’ చెలగాటం

విద్యార్థుల భవిష్యత్తుతో ‘బీజేపీ’ చెలగాటం

- Advertisement -

పోటీ పరీక్షల్లో అక్రమాలతో విద్యార్థుల ఆశలకు దెబ్బ
విద్యార్థుల ఆత్మహత్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి : వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య


నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా

విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ సూచనల మేరకు చేపట్టిన ‘విద్యార్థుల గర్జన (చాత్రోన్ కి గుంజ్)’ కార్యక్రమానికి మద్దతుగా బుధవారం హనుమ కొండ జిల్లా కేంద్రంలో కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ నుంచి పబ్లిక్ గార్డెన్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ఎంపీ కావ్య పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం నీట్ ప్రశ్నాపత్ర లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల చిత్రపటం వద్ద క్యాండిళ్లు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎస్‌ఎస్‌సీ, ఆ‌ర్‌ఆర్‌బీ, యూపీఎస్సీ, నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షల ద్వారా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వారి ఆశలు అడియాశలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్ అంశం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిపారు. పరీక్షల ఒత్తిడితో విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతూ ఆత్మహత్య లకు పాల్పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టూ లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓటు చోరీ, సీటు చోరీ, పార్టీ చోరీతో పాటు ఇప్పుడు పిల్లల భవిష్యత్తును కూడా చోరీ చేస్తోందని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కలలను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధి కోసం కోరిన ఒక సంవత్సరం పొడిగింపుపై కూడా కేంద్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. రానున్న రోజుల్లో పేద, బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా పోరాడుతుందని, విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా అండగా నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ గుండు సుధారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్ కాంగ్రెస్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -