బీజేపీకి పెత్తందారీ కులాల మద్దతు

బీజేపీకి పెత్తందారీ కులాల మద్దతు– ఎన్నికల్లో కాషాయ కూటమికే వారి ఓటు
– ఆ వర్గాలను ఓటు బ్యాంకుగా మార్చుకున్న కమలం పార్టీ : రాజకీయ విశ్లేషకులు
న్యూఢిల్లీ : ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదని చెప్పే బీజేపీ.. తన వరకు వచ్చేసరికి అవేమీ వర్తించవనే విధంగా వ్యవహరిస్తున్నది. సాధారణంగా, భారత రాజకీయాల్లో ముస్లింలు, దళితులను తరచుగా ‘ఓటు బ్యాంకులు’గా చూస్తాయి పార్టీలు. అయితే, అదే దారిలో పెత్తందారీ కులాల ఓటు బ్యాంకు కూడా ఏర్పడిందనీ, అది ఈ ఎన్నికల్లో స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. వీరు ఈ సారి కూడా గంపగుత్తగా ఓటు వేశారనీ, బీజేపీకి వారి మద్దతు లభించిందని అంటున్నారు.2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ముస్లింల నుంచి బలమైన మద్దతు, కీలక రాష్ట్రాలలో ఓబీసీల నుంచి మద్దతు పెరగటంతో పాటు దళిత సంఘంలోని ఓటరు బేస్‌లోని ఒక విభాగం ఇండియా కూటమి వైపు వెళ్లింది. దీంతో అయోధ్య వంటి ప్రదేశాల్లోనూ ఈ కూటమి.. ఎన్డీయేను ఓడించగలిగిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ది హిందూలో ప్రచురించబడిన సీఎస్‌డీఎస్‌-లోక్‌నీతి వివరణాత్మక సర్వే ప్రకారం.. హిందువులలో 60 శాతం మంది పెత్తందారీ కులాలు ఎన్డీఏకు మద్దతుగా నిలిచాయి. ఇందులో 53 శాతం మంది బీజేపీ వెనుక, ఏడు శాతం మంది బీజేపీ మిత్రపక్షాల వైపు నిలిచారు. కాగా, ఈ మొత్తం దాదాపు 2019 లోక్‌సభ ఎన్నికలతో సమానం. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో ఈ గణాంకాలు మరింత కీలకంగా మారాయని విశ్లేషకులు అంటున్నారు.

Spread the love