బీజేపీ నేత, నటుడు సురేష్‌ గోపి వెకిలి చేష్టలు

BJP leader and actor Suresh Gopi's antics– మహిళా జర్నలిస్టు పట్ల అనుచిత ప్రవర్తన
– తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు
తిరువనంతపురం : బీజేపీ నేత, నటుడు సురేష్‌ గోపి ఒక మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. కొజికోడ్‌లో విలేకర్ల సమావేశంలో పాల్గొన్న సురేష్‌ గోపి, మహిళా జర్నలిస్టు అనుమతి లేకుండానే ఆమెను పదే పదే తాకాడు. సురేష్‌ గోపి వైకిలి చేష్టలపై మహిళా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తనను అవమానించారంటూ జిల్లా ఎస్పీకి బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. కేరళలో ఇంతవరకు ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై సదరు మహిళా జర్నలిస్టు గోపిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఆమె భుజంపై పదేపదే చేయి వేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. బాధిత మహిళా ఆయన చేయి తీసిపారేస్తున్నా ఆయన తన వెకిలిచేష్టలు ఆపలేదు. ‘మమ్మల్ని ప్రయత్నించనీ తల్లీ..’ అంటూ చేయి వేస్తూనేవున్నారు. సురేష్‌ వైఖరిని గమనించిన ఆమె గట్టిగా తోసివేసిన దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఇది మహిళలను అవమానించడమేనని కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ విమర్శించింది. మహిళా కమిషన్‌కు దీనిపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. సదరు నేత బాడీ లాంగ్వేజ్‌ అసభ్యంగా, అనుచితంగా వుందని నెట్‌వర్క్‌ ఆఫ్‌ వుమెన్‌ ఇన్‌ మీడియా, ఇండియా విమర్శించింది. పని ప్రదేశాల్లో వేధింపులుగా దీన్ని చూడాలని పేర్కొంది. ఈ చర్య తీవ్రతను గమనించి రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్య తీసుకోవాలని కోరింది. ఆ తర్వాత ఆమెను తన కూతురిగా భావించే అలా చేయివేశాను తప్ప మరే ఉద్దేశ్యం లేదంటూ గోపి తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆమెకు మనస్తాపం కలిగితే తాను క్షమాపణలు చెబుతానన్నాడు. ఆ తర్వాత ఆ బాధిత జర్నలిస్టు తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో ఒక పోస్టు పెడుతూ ఇప్పటికీ కూడా తన ప్రవర్తన తప్పుగా వుందని ఆ వ్యక్తి భావించనపుడు ఆ క్షమాపణలకు కూడా అర్థం లేదని అన్నారు. సురేష్‌ గోపి చర్యను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌.బిందూ, ప్రతిపక్ష నేత సతీశన్‌, కాంగ్రెస్‌ నేత మురళీధరన్‌, సీపీఐ(ఎం) ఎంపీ రహీమ్‌ బీజేపీ నేత తీవ్రంగా ఖండించారు.

Spread the love