గాంధీనగర్‌ సీటుపై బీజేపీ ఆశలు

BJP's hopes on Gandhinagar seat– కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పోటీతో ప్రతిష్టాత్మకం
– ఇక్కడ ఉన్న ఓట్లు దాదాపు 25 లక్షలు
– ఓటింగ్‌ శాతం సగటున 55 శాతానికి తక్కువే
– గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 26 శాతానికి పైనే
– కాషాయపార్టీ చెప్తున్న భారీ మెజారిటీ అసాధ్యం
– ఎన్నికలు, రాజకీయ విశ్లేషకులు
కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా పోటీ చేస్తున్న గాంధీనగర్‌ లోక్‌సభ స్థానంపై బీజేపీ శ్రేణులు ‘భారీ’ ఆశలే పెట్టుకున్నాయి. అమిత్‌ షా గెలుపును ముందుగానే ఊహించికుంటున్న ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు.. పది లక్షల మెజారిటీని టార్గెట్‌గా
గాంధీనగర్‌ : గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలున్నాయి. అన్నిటితో పాటు ఈ నియోజకవర్గానికి కూడా 7న మూడో దశలో భాగంగా ఎన్నికలు జరగనున్నాయి. కాగా, గాంధీనగర్‌ బీజేపీకి పట్టున్న సీటే అయినప్పటికీ.. ఈసారి తమకు గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని బీజేపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. తమకు ఇక్కడ పోటీయే లేదనీ, పది లక్షల మెజారిటీని సునాయాసంగా సాధించి అమిత్‌ షా ఇక్కడి నుంచి ఘన విజయం సాధిస్తారని బీజేపీ నాయకులు చెప్తున్నారు.
ఈ స్థానం మూడు దశాబ్దాలకు పైగా కమలం పార్టీదే
గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం బీజేపీకి చాలా కీలకం. 1989 నుంచి ఆ పార్టీ ఈ సీటును గెలుచుకుంటూ వస్తున్నది. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన మాజీ ఉప ప్రధాని, ఆ పార్టీ కురువృద్ధుడు ఎల్‌.కె అద్వానీ ఇక్కడ నుంచి ఆరు సార్లు ఎంపీగా గెలిచారు. 1996-98 మధ్య భారత మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనాయకుడైన వాజ్‌పేయి సైతం ఆ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన అమిత్‌ షా.. 5 లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే, ఈ సారి మెజారిటీ పది లక్షల తేడాతో ఉండనున్నదని బీజేపీ ఆశలు పెట్టుకున్నది.
ఎట్టకేలకు బరిలో 14 మంది
ప్రస్తుతం గాంధీనగర్‌ లోక్‌సభ స్థానానికి మొత్తం 39 మంది నామినేషన్లు వేశారు. చివరకు 16 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను వెనక్కి తీసుకోగా.. 9 మంది పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 14 మంది బరిలో ఉన్నారు. కాగా, నామినేషన్లు వెనక్కి తీసుకున్నవారిలో పది మంది బీజేపీ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే వెనక్కి తగ్గామని చెప్పటం గమనార్హం. అయినప్పటికీ.. ఇటు పోలీసు అధికారుల నుంచి కానీ, అటు ఎన్నికల అధికారి నుంచి కానీ ఎలాంటి చర్యలూ లేవు. ఇలా పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థుల్లో ఒకరైన జితేంద్ర సింగ్‌ చౌహాన్‌.. తన జీవితం ప్రమాదంలో ఉన్నదని ఒక వైరల్‌ వీడియోలో ఆరోపణలు వినిపంచటం తెలిసిందే. ఆలిండియా పరివార్‌ పార్టీ తరఫున గాంధీనగర్‌ నుంచి పోటీలో ఉన్న ఈయన.. బీజేపీ నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకే పోటీ నుంచి తప్పుకున్నట్టు వివరించాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్‌కు చెందిన చౌహాన్‌ ఒక పెయింటర్‌. కాగా, వీడియో వైరల్‌ అయినప్పటి నుంచి తనకు పని దొరకటం లేదనీ, గతంలో కలిసి పని చేసినవారు కూడా ఫోన్లు ఎత్తటం లేదని ఆయన వాపోయాడు.
బీజేపీవి అనైతిక చర్యలు : కాంగ్రెస్‌
ఇక్కడ కాంగ్రెస్‌ ఎంతో కొంత ఓట్లను రాబట్టగలిగే స్థాయిలో ఉన్నా.. మరింత పోటీ ఇవ్వకపోవటానికి గల కారణం బీజేపీ అనైతిక చర్యలేనని ఆ పార్టీ అంటున్నది. ” బీజేపీకి చాలా వనరులున్నాయి. హౌర్డింగ్‌లు, బ్యానర్‌లు ఏర్పాటు చేయటానికి బీజేపీ వారు ఎవరి దగ్గరి నుంచీ అనుమతి తీసుకోరు. మేము మాత్రం అనుమతి తీసుకోవాలి. హౌర్డింగ్‌లను ఏర్పాటు చేయటానికి ప్రజలు మాత్రమే కాదు.. కాంగ్రెస్‌ మద్దతుదారులు కూడా జంకుతున్నారు. ఇదే పెద్ద సమస్య” అని కాంగ్రెస్‌ అభ్యర్థి సోనాల్‌ పటేల్‌ తెలిపారు. ఒకవేళ కాదని ఎవరైనా ధైర్యం చేస్తే పోలీసుల నుంచి వారికి బెదిరింపు కాల్స్‌ వస్తాయని, ఇలా చాలా మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు దీనిని ఎదుర్కొన్నారని వివరించారు.
సమావేశాలు ఏర్పాటు చేద్దామన్నా.. ‘ఒత్తిళ్లే’
కాంగ్రెస్‌ సేవాదళ్‌కు చెందిన ముకేశ్‌ మరు మాట్లాడుతూ.. ”గాంధీనగర్‌లోని ఒక హాల్‌లో సమావేశం ఏర్పాటు చేద్దామనుకుంటే.. ఆ హాల్‌కు చెందిన యజమానిపై ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఆ తర్వాత రెండు హాల్‌లను సంప్రదించినా.. భయంతో ప్రతి ఒక్కరూ నిరాకరించారు. దీంతో సమావేశాన్ని మేము పార్టీ కార్యాలయంలో నిర్వహించాల్సి వచ్చింది” అని తెలిపారు.
కాంగ్రెస్‌ నుంచే ప్రధాన పోటీ
ఈ స్థానం నుంచి పలు పార్టీలకు చెందినవారు 14 మంది బరిలో ఉన్నప్పటికీ.. బీజేపీకి ప్రధానంగా పోటీ ఉన్నది మాత్రం కాంగ్రెస్‌ నుంచే. ఇక్కడ హస్తం పార్టీ నుంచి సోనాల్‌ పటేల్‌ ఉన్నారు. 2019 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఛతుర్‌సిన్హ్‌ జవాన్జీ చవ్‌డా 26 శాతానికి పైగా ఓట్లను సాధించగలిగారు. అయితే, ఇక్కడ కాంగ్రెస్‌ కొంత వరకు బలంగానే ఉన్నది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ చెప్తున్న 10 లక్షల మెజారిటీ మాట సాధ్యం కాని విషయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైగా నియోజకవర్గంలో ఉన్నది దాదాపు 25 లక్షల ఓటర్లనీ, సగటు ఓటింగ్‌ 55 శాతం కంటే తక్కువగా ఉంటుందనీ, అలాంటపుడు అంత భారీ మెజారిటీ ఆశ అనేది ఒక ప్రచారం మాత్రమేనని విశ్లేషకులు చెప్తున్నారు.పెట్టుకున్నారు. అయితే, ఎన్నికలు, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది అసాధ్యమని కొన్ని గణాంకాలను ఉదహరిస్తున్నారు.

Spread the love