బొబ్బలొస్తున్నాయి..!

Blistering..!– కొలతలు పెంచిండ్రు.. కూలి పెరగలేదు
– దినమంతా చేస్తే రూ.150 దాటుతలే..!
– తాగునీటికి గోస తీస్తున్నాం
– మా బాధలు చెబితే వినే దిక్కెవరు..?
– ఉపాధి హామీ కూలీల ఆవేదన
‘చేతులు బొబ్బలొచ్చేలా పనిచేసినా ఫలితం లేదు. పొట్టకూటి కోసం దినమంతా రెక్కలుముక్కలు చేసుకుని పనిచేస్తున్నా కూలి గిట్టడం లేదు. పని భారం రెండింతలు పెరిగినా వేతనం మాత్రం రూ.150 దాటడం లేదు. మండుటెండలో గుక్కెడు నీళ్లు తాగుతూ చెమటోడ్చినా ఈ పాలకులకు కనికరం లేకపాయే. పని ప్రదేశంలో తాగునీరు లేక గొంతెండి సొమ్మసిల్లినా పట్టించుకునే దిక్కులేదు. మా గోస చెబితే వినే దిక్కెవరు. మా బతుకుల గురించి ఆలోచించేదెవరు’ ఇది ఉపాధి కూలీల ఆవేదన.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,771 గ్రామ పంచాయతీల్లో 53.17లక్షల జాబ్‌కార్టులు జారీ కాగా, వాటి ద్వారా కోటీ 20 లక్షల మంది కూలీలు ఉపాధి హామీకి నమోదు చేసుకున్నారు. కాగా, వాటిలో.. 34.13లక్షల జాబ్‌కార్టులు, 58.22లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగునీటి అవకాశాలు తక్కువగా ఉండటంతో వ్యవసాయ కార్మికులు ఎక్కువగా ఉపాధి హామీపై ఆధారపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో జాబ్‌ కార్డులు 1,61,889 ఉండగా.. ఇందులో 2,68,156 మంది కూలీలు ఉన్నారు. ఇందులో రెగ్యులర్‌గా 96,728 కుటుంబాలు ఉపాధి పనులను ఉపయోగించుకుంటున్నాయి. 1,48,887 మంది కార్మికులు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. ప్రతి రోజూ 30 నుంచి 40 వేల మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మే 13 వరకూ జిల్లాలో 55,452 మంది కార్మికులకుగాను రూ.20 కోట్లా 89 లక్షల వేతనాలు చెల్లించినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
పని భారం పెంపు.. వేతనాల్లో కోతలు
‘పెంచింది మూరెడు.. మోపీంది బారెడు’ అన్నచందంగా ప్రభుత్వం కూలీలపై పని భారం రెండింతలు పెంచింది. ప్రభుత్వం ఉపాధి కూలి రేటు గతేడాది కంటే రూ.28 పెంచుతూ రూ. 300 చేసింది. గతంలో ఒక్కరికి.. పని కొలతల పొడవు 2 మీటర్లు, వెడల్పు 1 మీటరు, లోతు 1 ఫీటు కేటాయించేవారు. ప్రస్తుతం ఈ కొలతలను ఆమాంతం రెండింతలు చేసింది. పొడవు 4.50 మీటర్లు, వెడల్పు 1.80 మీటర్లు, లోతు 1 ఫీటుగా కొలతలు పెంచారు. దీంతో కూలీలపై పని భారం పెరిగింది. పెంచిన కొలతలు పూర్తి చేస్తేనే పూర్తి స్థాయి కూలి రూ. 300 వస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వం కేటాయించిన కొలతల ప్రకారం ఒక రోజులో పని పూర్తి చేయడం కష్టమవుతుందని కూలీలు వాపోతు న్నారు. ప్రభుత్వం కూలి పెంచామని గొప్పలు చెప్పుకోవడం తప్ప కూలీల బతుకులు మార్చింది ఏమీ లేదని వాపోతున్నారు. పొద్దంతా పని చేసినా ఫలితం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘మంచాల మండలంలోని నోముల గ్రామ పంచాయతీ పరిధిలో 367 జాబ్‌ కార్డులున్నాయి. ఇందులో 270 మంది కూలీలు ఉపాధి హామీ పనికి హాజర వుతున్నారు. అయితే ఇక్కడ రెండు నెలలుగా భూమి చదును చేసే పనులు చేపడుతున్నారు. భూములు గట్టిబారి ఉండటంతో చేతులు బొబ్బలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. పొద్దంతా తవ్వినా.. కొలతల ప్రకారం పూర్తి చేయడం కష్టమవుతుందని కూలీలు వాపోతున్నారు. ఎంత కష్టం చేసినా గదే వేతనం ఇస్తున్నారని కూలీలు వాపోతున్నారు. పని ప్రదేశంలో ప్రమాదశాత్త్తు ఏమైనా జరిగినా పట్టించుకునే దిక్కులేరని ఆందోళన చెందుతున్నారు. కనీసం తాగునీటి సదుపాయం కూడా లేక తాగునీటి కోసం నానా తిప్పలు పడుతున్నామని వాపోయారు. ఉపాధి కూలీల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీలపై పనిభారం తగ్గించి, పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పాత కొలతల పద్ధతినే కొనసాగించాలని, పని ప్రదేశంలో మౌలిక వసతులు కల్పించి, కూలీలను ప్రమాదాల నుంచి కాపాడాలని ఉపాధి హామీ కూలీ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాయి.
రెక్కలు పోతున్నరు పైసలొస్తలేవ్‌- గంట పద్మ, ఉపాధి కూలి నోముల గ్రామం
మండుటెండలో చేతులు బొబ్బలు వస్తున్నా పొట్టకూటి కోసం తిప్పలు పడుతున్నాం. అయినా ఫలితం లేదు. పొద్దంతా చేస్తే గవ్వే నూటయాభై ఇస్తుండ్రు. వారం మొత్తంలో వెయ్యి కూడా వచ్చేట్టు లేవు. బయట పనిచేద్దామంటే పని దొరకకపాయే. ఇంటి కాడ ఉంటే పూటగడువక పాయే.. సర్కారు పనికొస్తే కూలి ఇవ్వకపాయే.. మా బతుకులు తెల్లారెదెట్లా.. ప్రభుత్వం మా గోస చూసైనా పూర్తి స్థాయి వేతనం చెల్లించాలి.
అందరికీ పూర్తి వేతనం వచ్చేలా ప్రయత్నిస్తున్నాం- శ్రీలత, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి
ప్రతి ఒక్కరికి పూర్తి వేతనం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. వేతనాలు పెండింగ్‌ లేకుండా చూస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మే 13 వరకు జిల్లాలో పూర్తి స్థాయిలో వేతనాలు చెల్లించాం. పెండింగ్‌ ఏమీ లేదు.

Spread the love