– 20 కుటుంబాలు కుల బహిష్కరణ..
– ఇళ్ళకు వెళ్లొద్దు..
– సరుకులు అమ్మ వద్దు..
– వ్యాపారులకు,సమీప బంధువులకు కుల పెద్దలు హుకుం జారీ..
– వడ్డి రంగాపురం లో సంఘటన..
– పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
బొడ్రాయి ఏర్పాటుకు చందా ఇవ్వలేదని గ్రామ పెద్దలు కొన్ని కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు.వీరికి ఎవరూ సహకరించ కూడదని నిర్ణయించుకున్నారు. కిరాణ దుకాణాల్లో నూ సరుకులు విక్రయించేందుకు ప్రయత్నం చేయకూడదని హుకుం జారీ చేశారు .గ్రామ పెద్దల నిర్ణయానికి వ్యతిరేకంగా పని చేస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామంటూ ప్రకటించారు.దీనిపై బాధిత కుటుంబాలు బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.బాధితులు తరుపున పిర్యాదు చేసిన చల్లా దుర్గయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మండలంలోని వడ్డెర రంగాపురం గ్రామ పెద్దలు పల్లపు అప్పారావు,గండికోట మహా లక్ష్మయ్య,వల్లపు శ్రీను,డేరంగుల దుర్గయ్య,గుంజి లక్ష్మయ్య లు బొడ్రాయి నిర్మాణానికి చందాలు వసూలు చేస్తున్నారు.సుమారు 10 రోజుల క్రితం పోలయ్య, తమ్మిశెట్టి పుష్పరాజు, వీర్రాజు లు తో పాటు మరికొందరిని కూడా గ్రామ పెద్దలు చందాలు అడిగారు. తాము చర్చికి వెళుతున్నామని,ఈ కార్యక్రమానికి డబ్బులు ఇవ్వలేమని సమాధానం చెప్పారు.
దీనిపై పెద్దలు బొడ్రాయి నిర్మాణానికి చందాలు ఇవ్వని కుటుంబాలకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారు.వారితో ఎవరూ మాట్లాడకూడదని,సరుకులు విక్రయించ కూడాదని ప్రకటించారు.ఒకవేళ గ్రామ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని గ్రామస్తులు, వ్యాపారులను హెచ్చరించినట్లు బాదితులు ఫిర్యాదులో వివరించారు.ఇదిలా ఉండగా ఈ వ్యవహారం వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందనే విమర్శలు ఉన్నాయి.తమకు జరిగిన నష్టం,వివక్షపై పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసినట్లు తెలిపారు.ఇదే విషయమై సీఐ జితేందర్ రెడ్డిని వివరణ కోరగా ఎస్.ఐ కు పిర్యాదు అందిందని విచారిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఓ మతం వారు మండల వ్యాప్తంగా ఆద్యాత్మిక కార్యక్రమాలను ఉదృతం చేస్తున్నారు.అంతే కాక ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ ఇతర మతాలను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే సందేశాలను వైరల్ చేయడం పరిపాటిగా మారింది.ఈ నేపద్యం లోనే ఈ గ్రామంలోనూ రెండు మతాల,వేర్వేరు సంప్రదాయాలు నడుమ కొందరి చే ప్రేరేపించే సంఘటనగా చర్చించుకుంటున్నారు. సామాజిక,సంఘసంస్కర్తలు,అభ్యుదయ వాదులు ఇటువంటి సంఘటనలు పై సామరస్య పూర్వకంగా అవగాహన కార్యక్రమాలు చేయాలని పలువురు మానవతా వాదులు కోరుతున్నారు.