అలవోకగా బోణీ

match– మొహాలి టీ20లో భారత్‌ గెలుపు
– ఛేదనలో మెరిసిన దూబె, జితేశ్‌, తిలక్‌
మొహాలి టీ20లో టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించింది. అఫ్గనిస్థాన్‌తో తొలి టీ20 సిరీస్‌లో ఆతిథ్య భారత్‌ బంతితో, బ్యాట్‌తో మెప్పించింది. అక్షర్‌ పటేల్‌ (2/23), ముకేశ్‌ కుమార్‌ (2/33) రాణించటంతో తొలుత అఫ్గనిస్థాన్‌ 158/5 పరుగులే చేసింది. ఛేదనలో కుర్ర బ్యాటర్లు శివం దూబె (60), జితేశ్‌ శర్మ (31), తిలక్‌ వర్మ (26), గిల్‌ (23) మెరవటంతో టీమ్‌ ఇండియా అలవోక విజయం సాధించింది. టీ20 సిరీస్‌లో భారత్‌ 1-0తో ముందంజ వేసింది.
నవతెలంగాణ-మొహాలి
అఫ్గనిస్థాన్‌తో తొలి టీ20లో టీమ్‌ ఇండియా ఘన విజయం సాధించింది. 159 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. యువ బ్యాటర్లు శివం దూబె (60 నాటౌట్‌, 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీతో చెలరేగగా.. జితేశ్‌ శర్మ (31, 20 బంతుల్లో 5 ఫోర్లు), తిలక్‌ వర్మ (26, 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (23, 12 బంతుల్లో 5 ఫోర్లు) రాణించటంతో 17.3 ఓవర్లలో భారత్‌ లాంఛనం ముగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గనిస్థాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేసింది. భారత్‌, అఫ్గనిస్థాన్‌ రెండో టీ20 ఆదివారం ఇండోర్‌లో జరుగనుంది.
సమిష్టిగా కొట్టారు : 159 పరుగుల ఛేదనలో టీమ్‌ ఇండియాకు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఏడాది విరామం తర్వాత తొలి మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (0) సమన్వయ లోపంతో రనౌట్‌గా నిష్క్రమించాడు. సున్నా పరుగులకే భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. తిలక్‌ వర్మ (26) తోడుగా గిల్‌ దూకుడు పెంచాడు. ఐదు ఫోర్లతో మెరిశాడు. గిల్‌ అవుటైనా.. తిలక్‌కు శివం దూబె తోడయ్యాడు. తిలక్‌ వర్మ రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో ఆకట్టుకున్నాడు. శివం దూబె సైతం బౌండరీలతో చెలరేగాడు. జితేశ్‌ శర్మ (31) వేగంగా ఛేదన ముగించే క్రమంలో జితేశ్‌ వికెట్‌ కోల్పోయాడు. ఫినీషర్‌ రింకూ సింగ్‌ జతగా శివం దూబె జోరు కొనసాగించాడు. 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. రింకూ సింగ్‌ (16 నాటౌట్‌, 9 బంతుల్లో 2 ఫోర్లు) తనదైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. నవీన్‌ ఓవర్లో 6, 4తో దూబె లాంఛనం ముగించాడు.
స్పిన్‌ మ్యాజిక్‌ : టాస్‌ నెగ్గిన రోహిత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అఫ్గాన్‌ ఓపెనర్లు రెహ్మనుల్లా గుర్బాజ్‌ (23, 28 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఇబ్రహీం జద్రాన్‌ (25, 22 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించారు. పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 33 పరుగులు చేసిన అఫ్గాన్‌ను స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ దెబ్బతీశాడు. అక్షర్‌ ఓవర్లో క్రీజు వదిలి ముందుకొచ్చిన గుర్బాజ్‌.. మళ్లీ క్రీజులోకి వెళ్లలేదు. రెహమత్‌ షా (3) వికెట్లను అక్షర్‌ పటేల్‌ గిరాటేశాడు. నం.3 బ్యాటర్‌ ఓమర్‌జారు (29) నిలకడగా పరుగులు రాబట్టాడు. కానీ అతడిని ముకేశ్‌ కుమార్‌ సాగనంపాడు.మహ్మద్‌ నబి (42) , నజిబుల్లా జద్రాన్‌ (19 నాటౌట్‌) రాణించటంతో అఫ్గనిస్థాన్‌ 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది.

స్కోరు వివరాలు
అఫ్గనిస్థాన్‌ ఇన్నింగ్స్‌:
158/5 (మహ్మద్‌ నబి 42, అజ్మతుల్లా ఓమర్‌జారు 29, అక్షర్‌ పటేల్‌ 2/23, ముకేశ్‌ 2/33)
భారత్‌ ఇన్నింగ్స్‌ : 159/4 (శివం దూబె 60 నాటౌట్‌, జితేశ్‌ శర్మ 31, తిలక్‌ వర్మ 26, ముజీబ్‌ 2/21).

Spread the love