విరిగిపడిన కొండచరియలు

Broken landslides– వందమందికిపైగా మృతి
– పదుల సంఖ్యలో క్షతగాత్రులు
– పేకమేడల్లా కూలిన ఇండ్లు
– బండరాళ్లు, చెట్లతో సహాయక చర్యలకు ఆటంకం
– పసిఫిక్‌ దేశం పాపువా న్యూ గునియాలో ఘటన
మెల్‌బోర్న్‌ : ఎటు చూసినా మృతదేహాలే.. ఎక్కడ చూసినా శిథిలాలే.. గాఢ నిద్రలో ఉండగానే మత్యువు ముంచుకొచ్చింది. రెప్పపాటులో గ్రామమంతా సమాధి అయిపోయింది. పసిఫిక్‌ దేశం పాపువా న్యూ గునియాలో ప్రకతి విపత్తు సంభవించింది. పోర్ట్‌ మోరెస్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని మారుమూల గ్రామమైన కౌకలంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. దీంతో వందల ఇండ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. బడుగు జీవుల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఈ దుర్ఘటనలో 100 మందికిపైగా మృతి చెందినట్టు ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టు తెలిపింది. ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్తులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. అనేక ఇండ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు,
చెట్ల కింద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటి వరకు 100కు పైగా మతదేహాలను వెలికి తీశారు. మతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కాగా.. ఈ గ్రామానికి పోలీసులు, సహాయక బందాలు ఇంకా చేరుకోలేదని సమాచారం. మతుల సంఖ్యపై పాపువా న్యూ గునియా ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
పూర్తి సమాచారం అందలేదు : ప్రధాని జేమ్స్‌ మరాపే
ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిపై ప్రభుత్వానికి ఇంకా పూర్తి సమాచారం అందలేదని ప్రధాని జేమ్స్‌ మరాపే తెలిపారు. అయితే కొండచరియలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. మతదేహాలను వెలికితీయడానికి, మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడానికి పీఎన్జీ డిఫెన్స్‌ ఫోర్స్‌, విపత్తు అధికారులు, వర్క్స్‌ అండ్‌ హైవేస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. మరోవైపు చెట్లు, రాళ్లు శిధిలాల కింద ఉన్న మతదేహాలను నివాసితులు బయటకు తీస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పరిస్థితి దారుణం : గ్రామ నివాసి
‘చుట్టూ భారీ రాళ్లు, మొక్కలు, చెట్లు, కూలిపోయిన భవనాలతో పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో మతదేహాల ఆచూకీ దొరకడం కష్టమవుతోంది’ అని గ్రామ నివాసి నింగ రోల్‌ చెప్పారు. పాపువా న్యూ గునియా 800 భాషలతో కూడిన ఓ దేశం. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 10 మిలియన్ల జనాభా ఉన్న ఈ దేశం ఆస్ట్రేలియా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దక్షిణ పసిఫిక్‌ దేశం.

Spread the love