ఆస్తి తగాదాలో సోదరిని హత్య చేసిన సోదరులు

–  బావ పరిస్థితి విషమం
నవతెలంగాణ-వైరా
భూ వివాదమై జరిగన ఘర్షణలో సోదరిని ఆమె సోదరులు హత్య చేశారు. అడ్డు వచ్చిన బావపై సైతం దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం తాటిపూడి గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్టల రాములు కుటుంబానికి అతని కుమార్తె ఉషా కుటుంబానికి సుమారు 10 ఏండ్లుగా భూ వివాదం నడుస్తుంది. ఈ వివాదం కోర్టు వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో సుబాబుల్‌ విత్తనాలు పడి మొలిచి పెద్దవి కాగా ఆ చెట్లను ఉషా అమ్ముకున్నది. సుబాబుల్‌ కర్ర నరికేందుకు శుక్రవారం మనుషులు రాగా రాములు అతని కుమారులు నరేష్‌, వెంకటేష్‌.. స్థలం వివాదంలో ఉన్నదని కర్ర నరక వద్దని చెప్పటంతో వాళ్ళు వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఉషా కొడవలి చేత బట్టి తండ్రితో గొడవకు దిగింది. మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఉషా వద్ద ఉన్న కొడవలి వేటుకు తండ్రి రాములు తలకు గాయమైంది. తండ్రిపై దాడి అనంతరం పారిపోతున్న ఉషను ఆమె సోదరులు నరేష్‌, వెంకటేష్‌.. వెంబడించి మారణాయుధాలతో దాడి చేసి హతమార్చారు. అడ్డువచ్చిన ఆమె భర్త కృష్ణపై కూడా దాడి చేశారు. సంఘటనా స్థలాన్ని వైరా ఏసీపీ రెహమాన్‌, సీఐ సాగర్‌, ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ సందర్శించి.. కృష్ణను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Spread the love