సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలు
బాకీ కార్డు పేరుతో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వంద రోజుల్లోనే ఆరుగ్యారంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా అమలు చేయకుండా ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి మోగించనుంది. కాంగ్రెస్ మోసాన్ని ప్రజల్లో ఎండగట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. వచ్చేనెల రెండు నుంచి వారంరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులంతా ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టేలా కార్యాచరణను విజయవంతం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలేవీ సంపూర్ణంగా నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు 420 హామీలు, 13 డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. వెయ్యి రోజులు పూర్తయినా హామీలను సంపూర్ణంగా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ పరిపాలనా వైఫల్యం, అవినీతి, అరాచకాల పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో ప్రతి వర్గానికి అర్థమయ్యేలా వివరించేందుకు వచ్చేనెల రెండు నుంచి భారీ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమాలు కేవలం హామీల చుట్టూ కాకుండా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చోటుచేసుకున్న వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల బకాయిలను మరోసారి ‘బాకీ కార్డుల’ రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. రైతు కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, యువతకు ప్రతి నెలా ఇస్తామన్న ఆర్థిక సహాయం ఎంత మేరకు పేరుకుపోయిందో ఈ బాకీ కార్డుల ద్వారా ప్రజలకు గుర్తు చేయాలని పిలుపునిచ్చారు.
వారం రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీ చైర్మెన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మెన్లు సహా అన్ని స్థాయిల నాయకులు పాల్గొనాలని కోరారు. నిరసన కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహించాలని సూచించారు.
కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



