బీఆర్‌ఎస్‌, బీజేపీని ఓడించాలి

BRS and BJP should be defeated– ఓట్ల కోసం ప్రజలను నమ్మించి మోసం చేశారు.. : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
ప్రజలను నమ్మించి మోసం చేసిన బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలోని నర్రా రాఘవరెడ్డి భవన్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలోకి రావడం కోసం అనేక హామీలిచ్చి అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వమంటే కేవలం మోడీ అమిత్‌షా అనే విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న అనేక దిన పత్రికలను, న్యూస్‌ ఛానళ్లపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించిన డేటా కాపీలను స్వాధీనం చేసుకోవడం కోసం మీడియా సంస్థల కార్యాల యాలు, ఉద్యోగుల ఇండ్లపై దాడులు చేయిస్తోందని విమర్శించారు. పైగా చైనా ఏజెంట్లనే ముద్ర వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల్లో గట్టెక్కడం కోసం.. ప్రజలను రెచ్చగొట్టేందుకు సనాతన ధర్మాన్ని వాడుకుంటూ.. మూఢనమ్మ కాలను పెంపొందించి, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంక్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్లు, నిధులు, నియామకాల ఎజెండాతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను విస్మరించిందన్నారు. ఒంటెద్దు పోకడపోతూ ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా తలా తోకలేని నిర్ణయాలతో ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఐదేండ్లకు కూడా పూర్తిస్థాయిలో చేయకపోవడంతో పాటు అప్పు కంటే వడ్డీ రెట్టింపు కావడం ద్వారా రైతుల మీద భారం పడిందన్నారు. యాంత్రిక పరికరాలు, ఫెర్టిలైజర్స్‌పై సబ్సిడీ ఎత్తేసి రైతులపై ఆర్థిక భారం మోపిందన్నారు. యువతకు ఉద్యోగాలు లేక.. నోటిఫికేషన్లు వేసి వాటిని భర్తీ చేయకపోవడం ద్వారా నిరుద్యోగ యువత ట్రైనింగ్‌ సెంటర్లో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిర్వహించిన పోటీ పరీక్షల్లోనే అనేక అవకతవకలు జరగడం వల్ల నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి అనేక పథకాల అమల్లో అవినీతికి పాల్పడుతున్నారని, అధికార పార్టీకి తొత్తులుగా ఉన్న వారికే ఇస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావే శంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున తదితరులు ఉన్నారు.

Spread the love