సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలి

With a service attitude Medical services should be provided– ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఎమ్మెల్యే భాస్కరరావు
– అత్యాధునిక పరికరాల స్టాల్స్‌ ఏర్పాటు
నవతెలంగాణ-మిర్యాలగూడ
వ్యాపారపరంగా కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ఎస్పీ కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి డాక్టర్‌ శేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈఎన్‌టీ రాష్ట్రస్థాయి 8వ సదస్సులో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రస్థాయి సదస్సు సావనీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించి మన్ననలు పొందాలన్నారు. ప్రజలకు డాక్టర్లే దేవుళ్ళని, చికిత్స కోసం వచ్చే రోగులకు అన్ని రకాల వైద్య సేవలను తక్కువ ఖర్చుతో అందించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, చదివిన చదువుకు, వృత్తికి న్యాయం చేయాలని సూచించారు. వైద్య సేవలతో మిర్యాలగూడ పట్టణానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని, వాటిని వినియోగంలోకి తీసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ఈ సదస్సులో నూతన వైద్య సేవలపై అవగాహన కల్పించారు. 33 జిల్లాల నలుమూలల నుంచి సుమారు 500 మంది ఈఎన్‌టీ డాక్టర్లు, వైద్య నిపుణులు, ప్రొఫెసర్లు, హెచ్‌ ఓడీలు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. అత్యాధునిక నూతన టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన వైద్య పరికరాలు, ల్యాప్రోస్కోపిక్‌ నూతన పరికరాలు, మిషన్లు, వినికిడి యంత్రాలకు సంబంధించిన సుమారు 54 స్టాల్స్‌ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. స్టాల్స్‌ను మిర్యాలగూడకు చెందిన సీనియర్‌ డాక్టర్లు టి.శరత్‌ బాబు, డాక్టర్‌ మువ్వ రామారావు, డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి సందర్శించారు. అసోసియేషన్‌ అధ్యక్షులు రమణ, ప్రధాన కార్యదర్శి రమేష్‌, డాక్టర్‌ ఇమ్మానుయేల్‌, శంకర్‌ కుమార్‌ వర్మ, రామాంజనేయులు, సుబ్రహ్మణ్యేశ్వర్‌, ఈఎన్‌టి అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ కోశాధికారి డాక్టర్‌ రాకేష్‌, డాక్టర్‌ నాగవర్ధన్‌ రెడ్డి, డాక్టర్‌ వంశీ, పట్టణానికి చెందిన సీనియర్‌ వైద్యులు టి.శరత్‌ బాబు, మువ్వ రామారావు, డాక్టర్‌ రోహిత్‌, సంపత్‌ చంద్ర ప్రసాద్‌, మోహినిష్‌ గ్రోవర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love