Sunday, June 14, 2026
E-PAPER
Homeహెల్త్జూన్‌లో సందడే సందడి...

జూన్‌లో సందడే సందడి…

- Advertisement -

జూన్‌ నెల రాగానే ప్రతి ఇంట్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. కొత్త యూనిఫార్ములు, కొత్త బ్యాగులు, కొత్త పుస్తకాలు, స్కూల్‌ బస్సుల హడావిడి… అన్నీ కలిసి విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే ఈ సందడిలో ఒక ప్రశ్న మాత్రం మెల్లగా మనల్ని వెంటాడుతోంది. నిజంగా మనం పిల్లలను విద్యావంతులను చేస్తున్నామా? లేక విద్య పేరుతో వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేస్తున్నామా?

నేటి సమాజంలో విద్య అనేది జ్ఞానాన్ని సంపాదించే ప్రక్రియ కంటే పోటీగా మారిపోయింది. ఒకప్పుడు పాఠశాలలు పిల్లల్లో విలువలు, సజనాత్మకత, సామాజిక నైపుణ్యాలను పెంపొందించే కేంద్రాలుగా ఉండేవి. ఇప్పుడు మాత్రం మార్కులు, ర్యాంకులు, ప్రవేశ పరీక్షలు, కార్పొరేట్‌ విద్యాసంస్థల ప్రకటనల మధ్య విద్యార్థి ఒక సంఖ్యగా మారిపోతున్నాడు. చిన్న వయసులోనే పిల్లలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
సైకాలజీ ప్రకారం బాల్యంలో మెదడు సమతుల్యంగా ఎదగాలంటే చదువుతో పాటు ఆట, విశ్రాంతి, కుటుంబంతో గడిపే సమయం కూడా అవసరం. కానీ ప్రస్తుతం చాలా మంది విద్యార్థుల జీవితం ఉదయం స్కూల్‌తో మొదలై సాయంత్రం ట్యూషన్లు, రాత్రి హోంవర్క్‌లతో ముగుస్తోంది. ఫలితంగా వారి జీవితంలో ఆనందం, స్వేచ్ఛ, సజనాత్మకతకు స్థానం తగ్గిపోతోంది. పిల్లలు చదువుకోవడం కంటే చదువు భరించడం నేర్చుకుంటున్నారు.
చాలా మంది తల్లిదండ్రులు ”మా పిల్లవాడు ఫస్ట్‌ రావాలి”, ”పక్కింటి పిల్లాడికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి” అంటూ పిల్లలపై తెలియకుండానే ఒత్తిడి పెంచుతున్నారు. ప్రేమతో చెప్పిన ఈ మాటలు పిల్లల మనసులో భయాన్ని నింపుతాయి. ”నేను బాగా చదవకపోతే అమ్మానాన్నలకు నచ్చను”, ”మార్కులు తక్కువ వస్తే నేను పనికిరానివాడిని” అనే భావనలు ఏర్పడతాయి. ఈ ఆలోచనలే తర్వాత ఆందోళన, ఆత్మవిశ్వాస లోపం, డిప్రెషన్‌ వంటి సమస్యలకు కారణమవుతాయి.

సైకాలజిస్టులు తరచూ చెప్పే విషయం ఏమిటంటే, పిల్లలు పరీక్షలకు భయపడటం కాదు… విఫలమైతే తమను తాము కోల్పోతామనే భయానికి గురవుతున్నారు. నేటి విద్యార్థులలో కనిపిస్తున్న ఆందోళన, కోపం, ఒంటరితనం, నిద్రలేమి వంటి సమస్యలకు ప్రధాన కారణాలలో విద్యా ఒత్తిడి కూడా ఒకటి. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు పిల్లల మార్కులను గమనిస్తారు కానీ వారి మనసులో జరుగుతున్న సంఘర్షణలను గుర్తించలేరు.
ఒక విద్యార్థికి 95 మార్కులు వస్తే అతని కషిని మెచ్చుకోవడం కంటే ”మిగిలిన 5 మార్కులు ఎక్కడ పోయాయి?” అని అడిగే సంస్కతి పెరిగింది. ఈ విధమైన స్పందనలు పిల్లలలో సాధించిన విజయాన్ని ఆస్వాదించే అవకాశాన్ని దూరం చేస్తాయి. వారు ఎప్పుడూ తమ లోపాల గురించే ఆలోచించడం ప్రారంభిస్తారు. ఫలితంగా విజయాన్ని ఆనందించలేని, వైఫల్యాన్ని తట్టుకోలేని తరం రూపుదిద్దుకుంటోంది. మన భారతీయ సంస్కతిలో విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు. కానీ నేటి వ్యవస్థలో వ్యక్తిత్వం కంటే మార్కులకే ఎక్కువ విలువ లభిస్తోంది.
ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ప్రతిరోజూ పద్నాలుగు గంటలు చదివేవాడు. మొదట్లో అందరూ అతన్ని ఆదర్శ విద్యార్థిగా ప్రశంసించారు. కానీ కొద్ది నెలల తర్వాత అతను స్నేహితులతో మాట్లాడటం తగ్గించాడు, చిరునవ్వు మాయమైంది, చిన్న తప్పుకే తీవ్ర నిరాశకు గురయ్యేవాడు. నా పరిశీలనలో అతను చదువు వల్ల కాదు, అధిక ఒత్తిడి వల్ల మానసికంగా అలసిపోయాడని తేలింది. ఈ సంఘటన నేటి వేలాది మంది విద్యార్థుల పరిస్థితికి ప్రతిబింబంగా చెప్పవచ్చు.
ప్రతి పిల్లవాడు ఒకేలా ఉండడు. కొందరిలో గణిత ప్రతిభ ఉంటుంది, మరికొందరిలో కళలు, సంగీతం, క్రీడలు లేదా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అయితే అందరినీ ఒకే ప్రమాణంతో కొలవడం వల్ల అనేక మంది తమ అసలైన ప్రతిభను కోల్పోతున్నారు. చేపను చెట్టెక్కమని పరీక్షిస్తే అది జీవితాంతం తనను తాను అసమర్థంగా భావించినట్లే, ప్రతి పిల్లవాడిని ఒకే రకమైన విజయ నిర్వచనంలో బంధించడం కూడా అన్యాయమే.
పిల్లలకు విద్య అవసరం. కానీ విద్యతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరం. మార్కులు ముఖ్యం. కానీ పిల్లల చిరునవ్వు, ఆత్మవిశ్వాసం, ఆనందం అంతకంటే ముఖ్యం. స్కూల్లు తెరుచుకోవడం మంచిదే. కానీ పిల్లల మనసులు మూసుకుపోయే పరిస్థితి రాకూడదు. వారిని చదివించడం అంటే కేవలం పాఠాలు నేర్పించడం కాదు. జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యం, విలువలు, ఆనందం, మానవత్వం నేర్పించడం కూడా.
జూన్‌ నెలలో పాఠశాలల గేట్లు తెరుచుకున్నప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలు మార్కులు సాధించే యంత్రాలు కాదు. వారు కలలతో, భావోద్వేగాలతో, ఆశలతో నిండిన మనుషులు. విద్య వారి భవిష్యత్తును నిర్మించాలి గానీ, వారి బాల్యాన్ని బలి తీసుకోకూడదు.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -