– అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అకాల వర్షాలకు తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. తడిసిన ధాన్యం గురించి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల్లో గాలి వాన, పిడుగులు, వడగళ్లు పడి పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆదివారంనాడాయన వివరాలు తెప్పించుకుని పరిశీలన చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాల్లో కలెక్టర్లు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గిమ్మ గ్రామంలో పిడుగుపాటుతో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని, వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు.