
నాగిరెడ్డిపల్లి వేర్ హౌజింగ్ గోదాములో ఎరువుల రేక్ పాయింట్ ఏర్పాటు కావడం వలన రైతులకు సకాలంలో ఎరువులు అందుతాయని జిల్లా కలెక్టరు హనుమంత్ కే.జెండగే అన్నారు. శుక్రవారం నాడు భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి లోని గోదాములో ఎల్ఎన్ఎస్ఇన్ ఫ్రా వారి ఎరువుల రేక్ పాయింట్ ను జిల్లా కలెక్టరు రిబ్బను కట్ చేసి ప్ర్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ఎరువుల రేక్ పాయింట్ మంజూరు కాబడి ఈరోజు ప్ర్రారంభించుకుంటున్నామని, దీనికి సహకరించిన అందరికి, కోరమాండల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నానని, ఎల్ఎన్ఎస్ ఇన్ ఫ్రా వారు రేక్ పాయింట్ ను విజయవంతంగా నడిపించాలని, రైతుల మేలు కాంక్షించాలని అన్నారు. జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాల వరకు సాగు చేయబడుతుందని, అందుకోసం 80 వేల మెట్రిక్ టన్నుల ఎరువులకు పైగా అవసరమవుతాయని, ఇంతవరకు ఉమ్మడి జిల్లా మిర్యాలగూడ రేక్ పాయింట్ నుండి, సనత్ నగర్ రేక్ పాయింట్ నుండి ఎరువులు వచ్చేవని, ఇప్పుడు మన జిల్లాలో రైతాంగానికి దగ్గరగా వచ్చిందని, తద్వారా రైతులు సకాలంలో ఎరువులు పొందవచ్చునని తెలిపారు. శాస్త్రవేత్తలు చెప్పిన ప్రకారం సకాలంలో పంటకు కావలసిన మేరకు మాత్రమే ఎరువులు వాడితే భూసారం సమతుల్యత ఉంటుందని, రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారులు ఎరువులు, క్రిమి సంహారక మందులపై అవగాహన కలిగిస్తున్నారని తెలిపారు. రైతులు రాబోయే వానాకాలం పంటలకు ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఆధరైజ్డ్ డీలర్ల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు ఖరీదు చేయాలని, తప్పనిసరిగా బిల్లు రశీదులు తీసుకోవాలని, సీజను పూర్తయ్యే వరకు రశీదులు దగ్గర వుంచుకోవాలని, పంటకు సంబంధించి ఏమైనా నష్టం వాటిల్లితే వాటి ద్వారా చర్యలు తీసుకోవచ్చునని అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ మాట్లాడుతూ జిల్లా కలెక్టరు గతంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమీషనర్ పనిచేసినప్పుడు రేక్ పాయింట్ జిల్లాకు రావడానికి కృషి చేశారని, ప్రస్తుతం జిల్లా కలెక్టరు హోదాలో ప్ర్రారంభించడం చాలా ఆనందిచదగిన విషయమని కరతాళధ్వనుల మధ్య అన్నారు. జిల్లాకు ఎరువుల రేక్ పాయింట్ రావడం వలన రైతులకు సమయం కలిసివస్తుందని, బస్తాకు ధర కూడా తగ్గుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్ఎస్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టరు పచ్చిమట్ల శివరాజ్ గౌడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ భాస్కరరెడ్డి, కోరమాండల్ లాజిస్టిక్స్ రీజినల్ మేనేజరు శేషుకుమార్, కోరమాండల్ డిజిఎం వెంకటేశ్వర్లు, సిబ్బంది, డీలర్లు పాల్గొన్నారు.