వేడుకల్లో పాల్గొనలేను..

Can't participate in the celebrations..– కాంగ్రెస్‌ పోకడలకు నిరసనగానే ఈ నిర్ణయం
– సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సుదీర్ఘ లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో పాల్గొనటం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పోకడలకు నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆయన శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. తెలంగాణ అస్తిత్వాన్ని అధికార పార్టీ అవమానిస్తోందని కేసీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ అనేది కాంగ్రెస్‌ భిక్ష కాదనీ, అది ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితమని వివరించారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ భావ దారిద్రాన్ని నిరసిస్తున్నామంటూ ఎద్దేవా చేశారు. ఇకనైనా ఆ పార్టీ తన వైఖరిని మార్చుకుని, ప్రజా సంక్షేమానికి పాటుపడాలని కోరారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిన కాంగ్రెస్‌ దమననీతికి సాక్ష్యమే గన్‌పార్కు అమరవీరుల స్థూపమని మాజీ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన హస్తం పార్టీ కర్కశత్వం రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని విమర్శించారు. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను కాంగ్రెస్‌ బలిగొందని వాపోయారు. ఇలాంటి అన్యాయాలను సరిదిద్దటానికే టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశామని వివరించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఇప్పటి వరకూ ‘జై తెలంగాణ’ అనే నినాదాన్ని నోటినిండా పలకలేదని విమర్శించారు. ఇకముందైనా ఇలాంటి తెలంగాణ వ్యతిరేకత మానసికత నుంచి బయటపడాలని హితవు పలికారు. ఇప్పటి వరకూ రేవంత్‌ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించలేదనీ, శ్రద్ధాంజలి ఘటించలేదని దుయ్యబట్టారు. ఈ రకంగా ఆయన రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తిరోగమన దిశగా తీసుకుపోతున్న నేపథ్యంలో అధికారిక ఉత్సవాల్లో పాల్గొనటం సమంజసం కాదని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న కాంగ్రెస్‌ వికృత పోకడలను నిరసిస్తూ దశాబ్ది ఉత్సవాలకు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ నిర్ణయించిందని తెలిపారు. ఇకముందైనా ఇలాంటి వైఖరిని మానుకుని, నిజమైన ప్రగతి, సంక్షేమం కోసం ప్రయత్నించాలని సీఎంకు సూచించారు. ఎన్నికల వాగ్దానాలన్నింటినీ త్వరలోనే నెరవేర్చటం ద్వారా ప్రజల మన్ననలను పొందాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Spread the love