హరిద్వార్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన కార్లు, బస్సులు

నవతెలంగాణ – ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ తీర్థక్షేత్రం హరిద్వార్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతోపాటు ఇళ్లలోకి పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. ఈ క్రమంలోనే స్థానికంగా సుఖీ నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో పలు కార్లు, బస్సులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.వర్షాధారమైన సుఖీ నది సాధారణంగా ఎండిపోయి కనిపిస్తుంది. నీళ్లు లేకపోవడంతో పలువురు ఎప్పటిలాగే తమ వాహనాలను అక్కడే పార్క్‌ చేశారు. అయితే.. కుండపోత వర్షంతో శనివారం నది ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహించింది. దీంతో అక్కడున్న కార్లు, ఇతర వాహనాలు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ నది కొద్ది దూరంలో గంగాలో కలుస్తుంది. వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో ఎవరూ నదీ సమీపంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Spread the love