ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అత్యవసర వైద్య భరోసానిచ్చే ఎంప్లా యీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ముహూర్తానికి ముందే బ్రేక్ పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యా యులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలందిం చేందుకు డిజిటల్ హెల్త్‌కార్డులు ఇస్తామని గత ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ప్రకటిం చింది. కానీ అందుకు సంబంధించిన ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్టును నియమించలేదు. ట్రస్టు ఏర్పడి ఆస్పత్రులతో, ఉద్యోగులతో విధివిధానాలు చర్చించి రూపొందించాలి. ఆ సన్నాహాలేవీ లేకుండానే జూన్2 నాడు ముఖ్యమంత్రి చేతుల మీదుగా డిజిటల్ కార్డుల పంపకం ఉంటుందని, అందుకు ఉద్యోగుల, పెన్షనర్ల వేతనం/పెన్షన్ నుంచి 1.5 శాతం వాటాగా జూన్ నెల వేతనంతో మినహాయించింది. నిర్దిష్టమైన ఉత్తర్వులేవి లేకుండానే జూలై నెలతో కలిపి రెండు వాయిదాల చందా మినహాయించిన ప్రభుత్వం ఎట్టకేలకు జూన్ 17న ట్రస్టును ఏర్పాటు చేసింది. ఆ ట్రస్టు ఇంకా ఆస్పత్రులతో నగదు రహిత చికిత్స విధి విధానాలు చర్చించలేదు. జులై 10న ఒకసారి మాత్రమే సమావేశమై కొన్ని అంశాలు చర్చించింది.
జూలై 15న నగదు రహిత చికిత్స కోసం కావలసిన డిజిటల్ కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించింది. తీరా ప్రయివేటు ఆస్పత్రులకు ప్రాతినిధ్యం వహించే తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌హెచ్ఏ) ప్రతిపాదిత ప్యాకేజీ ధరలు ప్రస్తుత ఆరోగ్యశ్రీ, గత ఈహెచ్ఎస్ ప్యాకేజీ ధరల కంటే తక్కువగా ఉన్నాయని చెప్పింది. సీజీహెచ్ఎస్ టారిఫ్‌తో ఈ కొత్త పథకాన్ని అమలు చేస్తే ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని అధికారులకు తెలిపింది. సవరించిన సిజిహెచ్ఎస్ ప్యాకేజీలను యథాతథంగా అమలు చేయకుండా, శాస్త్రీయ వ్యయ నిర్ధారణ ఆధారంగా చికిత్స ప్యాకేజీ రేట్లను నిర్ణయించాలని కోరుతోంది. ఇదిలా ఉండగా ప్రభుత్వం ప్రకటించిన ముహూర్తానికి డిజిటల్ హెల్త్‌కార్డులు రాలేదు. జూన్ 14 నాటికి కూడా మార్గదర్శకాలు విడుదల కాలేదు. నెట్‌వర్క్ దవాఖానాలతో ఒప్పందాలు చేసుకోలేదు. మరోవైపు, నెట్‌వర్క్ దవాఖానాల ప్రతినిధులు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్యాకేజీ ధరలతో తాము సేవలందించలేమని తేల్చిచెప్పారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్‌కార్డుల జారీ.. నగదు రహిత చికిత్సలపై అనిశ్చితి ఏర్పడింది. నగదురహిత చికిత్సకి సంబంధించి రూపొందించే మార్గదర్శకాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. ముఖ్యంగా దంపతులు ఇద్దరు పెన్షనర్లు లేదా ఉద్యోగులు లేదా పెన్షనర్, ఉద్యోగి అయినప్పుడు ఒకరి నుంచి మాత్రమే చందా మిన హాయిస్తూ, ఒక ఉద్యోగి కుటుంబ పెన్షన్ కూడా తీసుకుంటూ ఉంటే వేతనం/పెన్షన్ రెండింట్లో ఒకదాని నుంచే మిన హాయింపు చేసేలా చూడాలి.
ఏదైనా ఒక హాస్టల్‌ని ఎంపానల్ హాస్పిటల్స్ లిస్టులో చేర్చినప్పుడు ఆస్పత్రిలోని కొన్ని విభాగాలలోనే వైద్యం అందించేలా కాకుండా అన్ని విభాగాల్లో వైద్యమందించే ఏర్పాటు ఉండాలి. కో పేమెంట్ విధానం ఉండకూడదని, ఉంటే దానికి పేషంట్ చెల్లించే మొత్తానికి రీయంబర్స్‌మెంట్ ఉండేలా చూడాలి. అత్యవసర పరిస్థితిలో ఎంపానెల్ కాని ఆస్పత్రిలో నగదు చెల్లించి వైద్యం చేయించుకుంటే చెల్లించిన నగదుని రీయంబర్స్‌మెంట్ చేసే విధానం రూపొందించాలి. తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ ఒకశాతం కంట్రిబ్యూషన్ మాత్రమే సిఫారసు చేసింది. అయినప్పటికీ 1.5శాతం నిర్ణయానికి సంబంధించిన ఆర్థిక అధ్యయనం, వ్యయ అంచనాలు, ట్రస్ట్ తీర్మానాలు, విధి విధానాలు బహిరంగంగా వెల్లడించలేదు. సిజిహెచ్ఎస్ ప్యాకేజీలు అమలు చేస్తున్నట్లయితే, కంట్రిబ్యూషన్ విధానాన్ని కూడా సిజిహెచ్ఎస్ తరహాలో స్థాయివారీగా అమలు చేయాలి. అలాగే ఈహెచ్‌ఎస్ ట్రస్ట్ సమావేశాల నిర్ణయాలు, ఆర్థిక లెక్కలు, విధివిధానాలు ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలి.
ఈ తరుణంలో ఆస్పత్రుల యాజమాన్యాలు సిజిహెచ్ఎస్ రేట్లు రాష్ట్రంలో ఆస్పత్రుల నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా లేకపోవడం, కార్పొరేట్ ఆస్పత్రులకు జిల్లాల్లోని ఆస్పత్రులకు ఒకే చికిత్స రేట్లు అనుమతించడం అంశాలతో ఆస్పత్రుల యాజమాన్యాలు నగదు రహిత చికిత్స చేయలేమని ప్రభుత్వానికి తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వము ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతను కోసం అమలు చేస్తున్న ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌లో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ట్రస్ట్ పరిశీలించి తగు మార్గ దర్శకాలను విడుదల చేయాలి. ఎందుకంటే, ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు సక్రమంగా అందడం లేదు. గుర్తింపు పొందిన కొన్ని ఆస్పత్రులు కార్డులను అంగీకరించకపోవడం, మరికొన్ని ఆస్పత్రులు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను కారణంగా చూపిస్తూ చికిత్సలకు నిరాకరించడం చేస్తున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో నగదు చెల్లించాలని కోరడంతో ఆ రాష్ట్రంలోని పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా ఈ హెచ్ఎస్ కార్డు ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో ఉపయోగపడని పరిస్థితి ఏర్పడుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం అక్కడ రెండు లక్షల ఆర్థిక పరిమితితో పథకాన్ని అమలు చేయడంతో, గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ మార్పిడి, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలకు లక్షల రూపాయలు ఖర్చవుతున్న నేపథ్యంలో ఈ పరిమితిని నిర్ణయించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలందించడానికి ప్రభుత్వం చేపట్టే చర్యలను ఉద్యోగులు, పెన్షనర్లు ఆహ్వానిస్తున్నారు. కానీ,నగదు రహిత వైద్యం కోసం మూల వేతనం/మూల పెన్షన్‌పై 1.5శాతం మొత్తం మినహాయింపు చేయడాన్ని ఆందోళన చెందుతున్నారు. జూన్ పదిన జరిగిన ఉద్యోగుల ఆరోగ్య ట్రస్టు సమావేశంలో వైద్య సేవలు సిజిహెచ్ ఎస్ ప్యాకేజీ రేట్ల ఆధారంగా అందిస్తామని తెలిపింది. ఈ నిర్ణయం హేతుబద్ధంగా ఉండడం, పరిపాలనా న్యాయానికి ప్రాథమిక సూత్రం.
కాని కంట్రిబ్యూషన్ విధానంలో మాత్రం సిజిహెచ్ఎస్ విధానం అనుసరించకపోవడాన్ని ట్రస్టు పునః పరిశీలించాలి. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వాల రాజ్యాంగ కర్తవ్యం. అటువంటి ప్రజారోగ్యాన్ని పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ చికిత్సలు అందరికీ అందుబాటులోకి రాకపోవడం, ప్రయివేటు ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్సలతో రోగుల ప్రాణాలను రక్షించడంతో ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆర్థికంగా కొంత మెరుగైన స్థితిలో ఉండే ఉద్యోగులు ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తమ ప్రాణాలను రక్షించుకోవడం సాధారణమైంది. ప్రభుత్వము ఉద్యోగుల/పెన్షనర్ల ఆరోగ్య రక్షణ కోసం నగదురహిత చికిత్సను ప్రవేశపెట్టే క్రమంలో వారు ఇబ్బంది పడకుండా అదేవిధంగా ఆసుపత్రులను అదుపులో ఉంచి నిర్ణయించిన ప్యాకేజీ రేట్ల ప్రకారం చికిత్స అందేలా, ఆస్పత్రి యాజమాన్యాలు నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం చికిత్సలు జరిపేలా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి.
కె.వేణుగోపాల్, 9866514577



