కుల గణన సర్వే దేశంలో సామాజిక,ఆర్థిక మార్పుకు పునాది..

– ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ
దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  ఇతర మంత్రులు కలిసి బీసీల అభ్యున్నతికై ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని, బీసీ సమాజానికి గుర్తుండిపోయే రోజు అని వేములవాడ శాసనసభ్యులు ,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణనసర్వే దేశంలోనే సామాజిక ఆర్థిక మార్పుకు పునాది అని ఆయన అన్నారు. సమాజంలో వెనుకబడిన తరగతులను గుర్తించడానికి, వారి వెనుకబాటుతనాన్ని రూపుమాపడానికి కులం అనేది కీలక పాత్ర పోషిస్తుందని సభాధ్యక్షునికి తెలియజేశారు. జనాభా దమాషాలో రిజర్వేషన్లు పెంచడానికి వెనుకబడిన తరగతుల సమకాలిన అంశాల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తీసుకున్న నిర్ణయాలకు సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు అని అభివర్ణించారు. కుల గణన చేయడం వలన వెనుకబడిన,ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురికాబడిన, అట్టడుగు వర్గాలను ఉద్ధరించడానికి తగిన విధివిధానాలను రూపొందించడానికి ఒక కార్యాచరణ రూపొందించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు. కుల గణన ద్వారా సమ్మిళిత వృద్ధి వనరుల సమాన పంపకంతో పాటు బీసీల అందరికీ సమాన అవకాశాలు కల్పించడంతోపాటు దేశ నిర్మాణంతో పాటు,ఇప్పటి వరకు నిర్లక్ష్యనికి గురి కాబడిన ప్రజలకు విశ్వాసాన్ని నింపుతుందని అన్నారు. ఒక అంచనా ప్రకారం బీసీ జనాభా 50% నుండి 60% వరకు పెరిగిందని దానికి అనుగుణంగా కులగణన ద్వారా విద్యా,వైద్య పరమైన వెనుకబాటు తనాన్ని రూపుమాపేందుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్లో సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.ఎస్సి,ఎస్టీ,బీసీ వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని సభాధ్యక్షులుకి విన్నవించారు.
Spread the love